Ronaldo 700 Wins: ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో ఒకడైన క్రిస్టియానో రొనాల్డో ఓ ఊహకందని రికార్డును క్రియేట్ చేశాడు. అతని సమకాలీనుడైన మరో గ్రేట్ ఫుట్‌బాలర్ లియోనెల్ మెస్సీకి సాధ్యం కాని రికార్డును అందుకున్నాడు. గురువారం (జనవరి 30) రొనాల్డోకు చెందిన అల్-నసర్ టీమ్ 2-1తో అల్ రైద్ టీమ్ ను ఓడించడంతో రొనాల్డో ఖాతాలో 700 క్లబ్ విజయాలు వచ్చి చేరాయి.
పోర్చుగల్ సూపర్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో ఈ జనరేషన్లో అతి గొప్ప ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా అతడు సాధించిన ఫీట్ రొనాల్డోను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ప్రస్తుతం అల్-నసర్ టీమ్ కు ఆడుతున్న రొనాల్డో 700 క్లబ్ విజయాలు సాధించిన తొలి, ఏకైక ఫుట్‌బాల్ ప్లేయర్ కావడం విశేషం.
రొనాల్డో ఇప్పటి వరకూ స్పోర్టింగ్ తో 13 విజయాలు, రియల్ మాడ్రిడ్ తో 316, మాంచెస్టర్ యునైటెడ్ తో 214, జువెంటస్ తో 91, అల్-నసర్ తో 66 విజయాలు సాధించాడు. మొత్తంగా రొనాల్డో కెరీర్లో 700 క్లబ్ విజయాల్లో పాలుపంచుకున్నాడు.
ఇప్పటికే క్రిస్టియానో రొనాల్డో కెరీర్లో క్లబ్, ఇంటర్నేషనల్ కలిపి మొత్తంగా 900కుపైగా గోల్స్ చేసిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్ చరిత్రలో ఇన్ని గోల్స్ చేసిన మరో ప్లేయర్ లేడు.
ఆ విషయానికి వస్తే అసలు అతనికి దరిదాపుల్లోనూ ఎవరూ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తాను ఆడుతున్న సౌదీ క్లబ్ అల్-నసర్ తరఫున 94 మ్యాచ్ లు ఆడిన రొనాల్డో 85 గోల్స్ చేశాడు.
ఫుట్‌బాల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను క్రిస్టియానో రొనాల్డో సొంతం చేసుకున్నాడు. అయితే తన దేశం పోర్చుగల్ తరఫున ఇప్పటి వరకూ ఒక్క వరల్డ్ కప్ కూడా గెలవలేదన్న లోటు అలాగే ఉంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ లో రొనాల్డో ఆడతాడా లేదా అన్న ఆసక్తి నెలకొంది. అతడు ఈ మెగా టోర్నీలో ఆడొచ్చని ఈ మధ్యే పోర్చుగల్ టీమ్మేట్ బ్రూనో ఫెర్నాండెజ్ వెల్లడించాడు. ప్రస్తుతం రొనాల్డో వయసు 40 ఏళ్లు. వచ్చే ఏడాది వరల్డ్ కప్ నాటికి అతని వయసు 41కి చేరనుంది.
ఈ నేపథ్యంలో రొనాల్డో వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్నది అనుమానమే. పోర్చుగల్ తరఫున రొనాల్డో ఇప్పటి వరకూ 217 మ్యాచ్ లలో 135 గోల్స్ చేశాడు.
సంబంధిత కథనం