Virat Kohli@500: విరాట్ కోహ్లిలాగే 500కుపైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ వీళ్లే
Virat Kohli@500: విరాట్ కోహ్లి కంటే ముందు అంతర్జాతీయ క్రికెట్ లో 500కుపైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ మరో 9 మంది ఉన్నారు. వెస్టిండీస్ తో గురువారం (జులై 20) నుంచి ప్రారంభం కాబోతున్న రెండో టెస్ట్ కోహ్లికి 500వ అంతర్జాతీయ మ్యాచ్ అన్న విషయం తెలిసిందే.
Virat Kohli@500: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించబోతున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్న క్రికెటర్ల అరుదైన జాబితాలో చేరనున్నాడు. వెస్టిండీస్ తో గురువారం (జులై 20) నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్.. కోహ్లికి 500వ మ్యాచ్ కావడం విశేషం.
ట్రెండింగ్ వార్తలు
ఈ క్రమంలో ఈ ఘనత సాధించిన 10వ క్రికెటర్ గా కోహ్లి నిలవనున్నాడు. ఇంతకుముందు 500కుపైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ ఎవరో ఒకసారి చూద్దాం.
500కుపైగా మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్స్ వీళ్లే
అంతర్జాతీయ క్రికెట్ లో 500లకుపైగా మ్యాచ్ లు ఆడిన ప్లేయర్స్ మొత్తం 9 మంది ఉన్నారు. అందులో ముగ్గురు ఇండియన్స్ కాగా.. శ్రీలంక నుంచి ముగ్గురు, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా నుంచి ఒక్కొక్కరు ఉన్నారు.
సచిన్ టెండూల్కర్ - 664 మ్యాచ్‌లు
క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఘనత సచిన్ టెండూల్కర్ దే. అతడు టెస్టులు, వన్డేలు, టీ20లు కలిపి 664 మ్యాచ్ లు ఆడాడు. అందులో టీ20 మ్యాచ్ కేవలం ఒక్కటే. మొత్తంగా 100 సెంచరీలు సహా 34 వేలకుపైగా రన్స్ చేశాడు. 1989 నుంచి 2013 మధ్య 24 ఏళ్ల పాటు సచిన్ కెరీర్ కొనసాగింది.
మహేళ జయవవర్దనె - 652 మ్యాచ్‌లు
సచిన్ తర్వాతి స్థానం శ్రీలంక లెజెండరీ ప్లేయర్ జయవర్దనెది. అతడు 1996 నుంచి 18 ఏళ్ల పాటు శ్రీలంక క్రికెట్ కు సేవలందించాడు. మూడు ఫార్మాట్లు కలిపి 652 మ్యాచ్ లలో 26 వేలకుపైగా రన్స్ చేశాడు.
కుమార సంగక్కర - 594 మ్యాచ్‌లు
మూడోస్థానంలో శ్రీలంకకే చెందిన కుమార సంగక్కర ఉన్నాడు. అతడు మొత్తంగా 594 మ్యాచ్ లలో 28 వేలకుపైగా రన్స్ చేశాడు. 2000 నుంచి 2015 మధ్య శ్రీలంక తరఫున మూడు ఫార్మాట్లు ఆడాడు. టెస్టుల్లో 10 వేలకుపైగా రన్స్ చేసిన వాళ్లలో బెస్ట్ యావరేట్ సంగక్కరదే కావడం విశేషం.
సనత్ జయసూర్య - 586 మ్యాచ్‌లు
నాలుగో స్థానంలోనూ శ్రీలంక క్రికెటరే అయిన సనత్ జయసూర్య ఉన్నాడు. 1996లో లంక వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన జయసూర్య.. మొత్తంగా 22 ఏళ్ల పాటు 586 మ్యాచ్ లు ఆడాడు. ఆల్ రౌండర్ గా శ్రీలంకకు మంచి సేవలందించాడు.
రికీ పాంటింగ్ - 560 మ్యాచ్‌లు
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్ లో 560 మ్యాచ్ లు ఆడాడు. ఈ లిస్టులో ఉన్న కేవలం ఇద్దరే ఆసియాయేతర క్రికెటర్లలో పాంటింగ్ మొదటి వాడు. అతడు 71 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాకు రెండు వరల్డ్ కప్ లు కూడా అందించాడు.
ఎమ్మెస్ ధోనీ - 538 మ్యాచ్‌లు
టీమిండియా మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా పేరుగాంచిన ధోనీ ఇండియా తరఫున మొత్తం మూడు ఫార్మాట్లు కలిపి 538 మ్యాచ్ లు ఆడాడు. ఇండియాకు మూడు ఐసీసీ టోర్నీలు సాధించి పెట్టిన కెప్టెన్ గా ధోనీ నిలిచాడు. 90 టెస్టులు, 98 టీ20లు ఆడి కెరీర్ ముగించాడు. లేదంటే మూడు ఫార్మాట్లలోనూ 100కుపైగా మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్ గా నిలిచేవాడు.
షాహిద్ అఫ్రిది - 524 మ్యాచ్‌లు
పాకిస్థాన్ తరఫున రెండు దశాబ్దాలకుపైగా ఆడిన ప్లేయర్ షాహిద్ అఫ్రిది. ఆల్ రౌండర్ గా మూడు ఫార్మాట్లలోనూ పాక్ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చి 524 మ్యాచ్ లు ఆడాడు.
జాక్వెస్ కలిస్ - 519 మ్యాచ్‌లు
ఈ సౌతాఫ్రికా ఆల్ రౌండర్ ఆ జట్టు తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన ప్లేయర్. 20 ఏళ్ల కెరీర్లో 519 మ్యాచ్ లలో 25 వేలకుపైగా రన్స్, 500కుపైగా వికెట్లు తీసిన ప్లేయర్. గ్రేటెస్ట్ క్రికెటర్స్ ఆఫ్ ఆల్ టైమ్ జాబితాలో కలిస్ పేరుంటుంది.
రాహుల్ ద్రవిడ్ - 509 మ్యాచ్‌లు
ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కూడా 500కుపైగా అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ది వాల్ గా పేరుగాంచిన ద్రవిడ్.. 24 వేలకుపైగా రన్స్ చేశాడు.
సంబంధిత కథనం