Sunrisers Hyderabad Coach: బ్రియాన్ లారాకు సన్ రైజర్స్ గుడ్‌బై.. కొత్త హెడ్ కోచ్ వచ్చేశాడు
Sunrisers Hyderabad Coach: బ్రియాన్ లారాకు సన్ రైజర్స్ గుడ్‌బై చెప్పింది. టీమ్ కొత్త హెడ్ కోచ్ గా న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీ రానుండటం విశేషం.
Sunrisers Hyderabad Coach: ఐపీఎల్ 2024 సీజన్ కు ముందు పాయింట్ల టేబుల్లో కింద ఉన్న టీమ్స్ భారీ మార్పులు చేస్తున్నాయి. ముఖ్యంగా తమ కోచ్ లపై వేటు వేస్తున్నాయి. ఈ మధ్యే లక్నో, ఆర్సీబీ జట్లు తమ కోచ్ లను మార్చేయగా.. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా తమ హెడ్ కోచ్ బ్రియాన్ లారాను తప్పించింది.

లారా స్థానంలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ డేనియల్ వెటోరీని హెడ్ కోచ్ గా నియమించింది. ఈ విషయాన్ని సోమవారం (ఆగస్ట్ 7) సన్ రైజర్స్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఈ ఏడాది ఐపీఎల్లో సన్ రైజర్స్ దారుణమైన ప్రదర్శన తర్వాత ఆ ఫ్రాంఛైజీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. 2023 ఐపీఎల్ సీజన్ లో ఆ టీమ్ టేబుల్లో చివరి స్థానంతో సరిపెట్టుకుంది.
గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్ గా వ్యవహరించిన వెటోరీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్ గానూ ఉన్నాడు. న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ స్పిన్నర్ గా నిలిచిన వెటోరీ కోచింగ్ లో సన్ రైజర్స్ మళ్లీ గాడిలో పడుతుందని ఆ ఫ్రాంఛైజీ ఆశిస్తోంది.
18 ఏళ్ల వయసులోనే న్యూజిలాండ్ తరఫున అరంగేట్రం చేసిన వెటోరీ.. టెస్టుల్లో 300కుపైగా వికెట్లు, 3వేలకుపైగా రన్స్ చేశాడు. ఈ ఘనత సాధించిన 8వ ఆల్ రౌండర్ గా వెటోరీ నిలిచాడు. మొత్తంగా టెస్టుల్లో 6 సెంచరీలు సహా 4500 రన్స్ చేయడం విశేషం. 2015 వరల్డ్ కప్ తర్వాత వెటోరీ రిటైరయ్యాడు. ఆ తర్వాత ఆర్సీబీ జట్టుకు నాలుగేళ్ల పాటు హెడ్ కోచ్ గా ఉన్నాడు.
బంగ్లాదేశ్ జట్టుకు స్పిన్ బౌలింగ్ కోచ్ గా, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంఛైజీ బార్బడోస్ రాయల్స్ కు హెడ్ కోచ్ గా పని చేశాడు. ఆస్ట్రేలియా టీమ్ స్పిన్ బౌలింగ్ కోచ్ గా ఆ జట్టులోని ఇద్దరు స్పిన్నర్లు నేథన్ లయన్, టాడ్ మర్ఫీ నిలకడగా రాణించేలా చేశాడు. దీంతో వెటోరీ కోచింగ్ పై సన్ రైజర్స్ భారీగానే ఆశలు పెట్టుకుంది.
2016లో ఐపీఎల్ ట్రోఫీ గెలిచినా.. తర్వాత సన్ రైజర్స్ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. గత రెండు సీజన్లలో టేబుల్లో చివరి స్థానంతోనే సరిపెట్టుకుంటోంది. వార్నర్, విలియమ్సన్, మార్‌క్రమ్.. ఇలా కెప్టెన్లను మారుస్తూ వెళ్తున్నా ప్రయోజనం లేకపోయింది. అటు కోచ్ ల పరిస్థితీ అంతే. మొదట టామ్ మూడీ, ఇప్పుడు బ్రియాన్ లారాపై వేటు వేసింది.
సంబంధిత కథనం