Shikhar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. ఏమన్నాడంటే!-cricket news shikhar dhawan breaks silence on indian cricket team snub check details ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Cricket News Shikhar Dhawan Breaks Silence On Indian Cricket Team Snub Check Details

Shikhar Dhawan: టీమిండియాలో చోటు దక్కకపోవడంపై మౌనం వీడిన శిఖర్ ధావన్.. ఏమన్నాడంటే!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 10, 2023 10:30 PM IST

Shikhar Dhawan: భారత జట్టులో చోటు దక్కకపోవడంపై స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ స్పందించాడు. ఆసియా గేమ్స్ టీమ్‍లోనూ స్థానం లభించకపోవడంపై కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు.

శిఖర్ ధావన్ (Photo: ANI)
శిఖర్ ధావన్ (Photo: ANI)

Shikhar Dhawan: భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్.. మోస్తరు ఫామ్‍లో ఉండగానే టీమిండియాలో చోటు కోల్పోయాడు. యువ ఆటగాళ్లను తీసుకొచ్చిన సెలెక్టర్లు ధావన్‍ను కొంతకాలంగా పూర్తిగా పక్కన పెట్టేశారు. అతడి గణాంకాలు మెరుగ్గానే ఉన్నా.. పట్టించుకోవడం లేదు. అయితే, చైనాలో సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య జరగాల్సిన ఆసియన్ గేమ్స్‌కు సెలెక్టర్లు.. ద్వితీయ శ్రేణి జట్టును ఎంపిక చేశారు. ఆ సమయంలో భారత్‍లో వన్డే ప్రపంచకప్ జరగనుండటంతో ఆ టోర్నీలో టీమిండియాలో చోటు దక్కని ఆటగాళ్లతో ఆసియన్ గేమ్స్‌ కోసం జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, కనీసం ఆ జట్టులోనూ శిఖర్ ధావన్‍కు చోటు దక్కలేదు. అతడి సారథ్యంలోనే ఆసియన్ గేమ్స్‌లో టీమిండియా బరిలోకి దిగుతుందని అంచనాలు రాగా.. సెలెక్టర్లు కనీసం ధావన్‍ను ఎంపిక కూడా చేయలేదు. అయితే, ఈ విషయంపై శిఖర్ ధావన్ మౌనం వీడాడు. కాస్త అసంతృప్తిని వెల్లడించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఆసియన్ గేమ్స్‌ జట్టులోనూ తన పేరు లేకపోవడంతో షాక్ అయ్యానని న్యూస్ ఏజెన్సీ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ గురువారం చెప్పాడు. “నా పేరు అక్కడ (ఆసియా గేమ్స్‌) లేకపోయే సరికి.. నేను షాక్‍కు గురయ్యా. అయితే, వారు (సెలెక్టర్లు, బీసీసీఐ) వేరే ఆలోచనా విధానంలో ఉన్నారని అర్థమైంది. అలాంటివి అంగీకరించాల్సిందే. కెప్టెన్‍గా రుతు (రుతురాజ్ గైక్వాడ్) ఎంపికవడం ఆనందాన్ని ఇచ్చింది. అందరూ యువ ఆటగాళ్లే ఉన్నారు. వాళ్లందరూ బాగా రాణిస్తారని నేను నమ్మకంగా ఉన్నా” అని శిఖర్ ధావన్ చెప్పాడు.

గతేడాది డిసెంబర్ బంగ్లాదేశ్ సిరీస్ తర్వాతి నుంచి టీమిండియాలో శిఖర్ ధావన్‍కు చోటు దక్కలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్‍మన్ గిల్ ఓపెనర్లుగా స్థిరపడటంతో అతడికి అవకాశాలు రావడం లేదు. అయితే, మళ్లీ అవకాశం ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉంటానని ధావన్ అన్నాడు. “నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటా. అందుకే నేను ఫిట్‍గా ఉండడాన్ని కొనసాగిస్తా. ఒక శాతం లేకపోతే 20 శాతం ఎప్పుడూ ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది” అని ధావన్ చెప్పాడు. తాను ప్రస్తుతం ట్రైనింగ్ ఎంజాయ్ చేస్తున్నానని అతడు చెప్పాడు.

విజయ్ హజారే వన్డే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 దేశవాళీ టోర్నీలు ఆడాలని తాను అనుకుంటున్నట్టు శిఖర్ ధావన్ చెప్పాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‍కు ముందు ఈ టోర్నీలు ఆడతానని అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ కోసం సిద్ధమవుతానని శిఖర్ అన్నాడు. ఐపీఎల్‍లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు శిఖర్.

WhatsApp channel