Rohit Breaks Dhoni Record: ధోనీ రికార్డు బ్రేక్ చేసిన రోహిత్.. ఆ లిస్టులో ఐదో స్థానానికి..
Rohit Breaks Dhoni Record: ధోనీ రికార్డు బ్రేక్ చేశాడు రోహిత్ శర్మ. ఇండియా తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో ఐదో స్థానానికి దూసుకెళ్లాడు.

Rohit Breaks Dhoni Record: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ రికార్డును బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు 80 పరుగులు చేసిన రోహిత్.. అరుదైన జాబితాలో మరో స్థానం ఎగబాకాడు. ఇండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన వారి లిస్టులో ధోనీని దాటి రోహిత్ ఐదో స్థానానికి చేరుకున్నాడు.
ఆ నలుగురి తర్వాత రోహితే..
వెస్టిండీస్ తో తొలి టెస్ట్ లో సెంచరీ చేసిన రోహిత్.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లోనూ 80 పరుగులతో రాణించాడు. దీంతో అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లు కలిపి రోహిత్ పరుగుల సంఖ్య 17,298కి చేరింది. ఇప్పటి వరకూ ఇండియా తరఫున 443 మ్యాచ్ లు ఆడిన రోహిత్.. 42.92 సగటుతో ఈ పరుగులు చేశాడు. అతని ఖాతాలో 44 సెంచరీలు, 92 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోరు 264.
ఇండియా తరఫునే కాదు అంతర్జాతీయంగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ సచిన్ టెండూల్కర్. అతడు 664 మ్యాచ్ లలో 34,357 రన్స్ చేశాడు. ఇక తర్వాతి స్థానాల్లో విరాట్ కోహ్లి (500 మ్యాచ్ లు, 25,484 రన్స్), రాహుల్ ద్రవిడ్ (504 మ్యాచ్ లు, 24,064 రన్స్), సౌరవ్ గంగూలీ (421 మ్యాచ్ లు, 18433 రన్స్) ఉన్నారు. ఇప్పుడీ జాబితాలో ధోనీని దాటి రోహిత్ ఐదో స్థానానికి దూసుకెళ్లాడు.
ధోనీ 535 మ్యాచ్ లలో 17092 రన్స్ చేశాడు. ధోనీ తన కెరీర్లో 15సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు చేశాడు. బెస్ట్ స్కోరు 224. ఇక రోహిత్ విషయానికి వస్తే వన్డే ఫార్మాట్ లో అతడు తన అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. రోహిత్ 243 వన్డేల్లో 9825 రన్స్ చేశాడు. సగటు 48.63 కాగా.. 30 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 264.
ఇక టెస్టుల విషయానికి వస్తే 52 మ్యాచ్ లలో 3620 రన్స్ చేశాడు. సగటు 46.41 కాగా.. 10 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 212. రోహిత్ తన కెరీర్లో 148 టీ20లు ఆడి 3853 రన్స్ చేశాడు. సగటు 31.32 కాగా.. నాలుగు సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బెస్ట్ స్కోరు 118. టెస్టుల్లో ఓపెనర్ గా 2 వేల పరుగుల మైలురాయిని కూడా విండీస్ తో రెండో టెస్టులో అతడు అందుకున్నాడు.