Rohit on Jadeja: మరి జడేజా గురించి అడగలేదే..: రోహిత్ దిమ్మదిరిగే ఆన్సర్
Rohit on Jadeja: మరి జడేజా గురించి అడగలేదే అంటూ రోహిత్ దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చాడు. తాను, కోహ్లి ఎందుకు టీ20లు ఆడటం లేదన్న ప్రశ్నకు అతడు ఇలా స్పందించడం విశేషం.
Rohit on Jadeja: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతుంటాడు. విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోడు. అదే సమయంలో తాను ఇచ్చే సమాధానాలకు కాస్త చమత్కారం కూడా జోడిస్తాడు. తాజాగా తనతోపాటు విరాట్ కోహ్లి ఎందుకు టీ20లు ఆడటం లేదన్న ప్రశ్నకు రోహిత్ అలాగే స్పందించాడు. జడేజా కూడాఆడటం లేదు కదా.. మరి అతని గురించి ఎందుకు అడగడం లేదని ఎదురు ప్రశ్నించాడు.
ట్రెండింగ్ వార్తలు
ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ ఉన్న కారణంగా తాము టీ20లు ఆడటం లేదని, గతేడాది టీ20 వరల్డ్ కప్ సందర్భంగా వన్డేలు ఆడని విషయాన్ని గుర్తు చేశాడు. తాను ఇప్పటి వరకూ వన్డే వరల్డ్ కప్ గెలవలేదని, ఇప్పుడు దాని కోసం ఫైట్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉందని అన్నాడు. మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన సందర్భంగా రోహిత్ వివిధ అంశాలపై స్పందించాడు.
సెలక్టర్లు తనను, కోహ్లిని టీ20 జట్టుకు ఎంపిక చేయకపోవడంపై స్పందిస్తూ.. "గతేడాది కూడా మేము ఇదే చేశాం. టీ20 వరల్డ్ కప్ ఉండటం వల్ల వన్డే క్రికెట్ ఆడలేదు. ఇప్పుడూ అదే చేస్తున్నాం. వన్డే వరల్డ్ కప్ రాబోతోంది. అందుకే టీ20లు ఆడటం లేదు. అన్నీ ఆడుతూ వరల్డ్ కప్ కు సిద్ధంగా ఉండలేం. ఇది రెండేళ్ల కిందటే నిర్ణయించాం. జడేజా కూడా టీ20లు ఆడటం లేదు. అతని గురించి ఎందుకు అడగటం లేదు? విరాట్ పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తారన్న విషయం నాకు తెలుసు. కానీ జడేజా కూడా ఆడటం లేదు కదా" అని రోహిత్ అన్నాడు.
గతేడాది వరల్డ్ కప్ సెమీఫైనల్ తర్వాత రోహిత్, కోహ్లి మరో అంతర్జాతీయ టీ20 ఆడలేదు. ఇక పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవడం లేదన్న అపవాదును కూడా ఈసారి చెరిపేయాలన్న పట్టుదలతో తమ టీమ్ ఉన్నట్లు రోహిత్ చెప్పాడు. 2013లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఇండియా ఓ ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు స్వదేశంలో వరల్డ్ కప్ గెలిచే అవకాశం మరోసారి వచ్చింది.
దీనిపై రోహిత్ స్పందిస్తూ.. "నిజాయతీగా చెప్పాలంటే నేనెప్పుడూ వన్డే వరల్డ్ కప్ గెలవలేదు. వరల్డ్ కప్ గెలవడం నా కల. ఇప్పుడు దాని కోసం ఫైట్ చేయబోతుండటం సంతోషంగా ఉంది. వరల్డ్ కప్ లు అంత సులువుగా దక్కవు. చాలా కఠోర శ్రమ అవసరం. 2011 నుంచి దాని కోసం కృషి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు దానికోసం ఫైట్ చేయబోతున్నాం" అని రోహిత్ చెప్పాడు.
సంబంధిత కథనం