SL vs Pak: ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్.. శ్రీలంకపై విజయం-cricket news pakistan beat sri lanka as the team ends their year long wait for win ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Sl Vs Pak: ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్.. శ్రీలంకపై విజయం

SL vs Pak: ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్.. శ్రీలంకపై విజయం

Hari Prasad S HT Telugu
Jul 20, 2023 12:30 PM IST

SL vs Pak: ఏడాది తర్వాత టెస్టు మ్యాచ్ గెలిచింది పాకిస్థాన్ టీమ్. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం (జులై 20) మ్యాచ్ చివరి రోజు పాక్ గెలవడం విశేషం.

ఏడాది తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్
ఏడాది తర్వాత టెస్ట్ మ్యాచ్ గెలిచిన పాకిస్థాన్ (AFP)

SL vs Pak: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సరిగ్గా ఏడాది తర్వాత తమ తొలి టెస్టు విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో చివరి రోజైన గురువారం (జులై 20) 133 పరుగుల లక్ష్యాన్ని ఆరు వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. సరిగ్గా ఏడాది కిందట అంటే జులై 20, 2022లో పాకిస్థాన్ చివరిసారి ఓ టెస్ట్ మ్యాచ్ గెలవడం విశేషం. 2023-25 డబ్ల్యూటీసీ సైకిల్లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది.

చివరి రోజు విజయానికి 83 పరుగులు అవసరం కాగా.. పాక్ చేతిలో ఏడు వికెట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇమాముల్ హక్ హాఫ్ సెంచరీ చేయడంతోపాటు కెప్టెన్ బాబర్ ఆజం 24, తొలి ఇన్నింగ్స్ డబుల్ సెంచరీ హీరో సాద్ షకీల్ 30 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. ఒక దశలో 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడినట్లు కనిపించింది.

ఈ దశలో మొదట బాబర్ తో కలిసి నాలుగో వికెట్ కు 41 పరుగులు, సాద్ షకీల్ తో కలిసి ఐదో వికెట్ కు 43 పరుగులు జోడించాడు ఇమాముల్ హక్. దీంతో పాక్ మెల్లగా విజయం వైపు అడుగులు వేసింది. చివరి రోజు తొలి సెషన్ లోనే మ్యాచ్ ముగిసింది. పాక్ మరో మూడు వికెట్లు కోల్పోయి విజయానికి అవసరమైన మిగతా 83 పరుగులు చేసింది.

తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ చేసిన సాద్ షకీల్ (208)కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక 312 పరుగులు చేసింది. ధనంజయ డిసిల్వా (122) సెంచరీ చేశాడు. తర్వాత పాక్ తొలి ఇన్నింగ్స్ లో 461 పరుగులు చేయడంతో 149 పరుగుల ఆధిక్యం సంపాదించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక 279 పరుగులకు ఆలౌటైంది.

మరోసారి డిసిల్వా 82 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. పాక్ ముందు 133 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక విధించింది. పాక్ చేజింగ్ లో అబ్దుల్లా షఫీక్ (8), షాన్ మసూద్ (7), నోమన్ అలీ (0) వికెట్లను త్వరగానే కోల్పోయింది. అయితే ఇమాముల్ హక్, బాబర్ ఆజం, సాద్ షకీల్ విజయం సాధించి పెట్టారు. ఏడాది తర్వాత తొలి టెస్ట్ గెలిచి సిరీస్ లో ఆధిక్యం సంపాదించింది.

Whats_app_banner

సంబంధిత కథనం