Tilak T20I ranking: ఇండియన్ క్రికెట్ టీమ్ లో సరికొత్త సెన్సేషన్ తిలక్ వర్మ. వెస్టిండీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ తోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసిన తిలక్.. తొలి మూడు మ్యాచ్ లలోనూ అదరగొట్టాడు. వరుసగా 39, 51, 49 పరుగులు చేశాడు. దీంతో తిలక్ తొలిసారి ఐసీసీ ప్రతి వారం రిలీజ్ చేసే టీ20 ర్యాంకుల్లోకి అడుగుపెట్టాడు.
అది కూడా అలాఇలా కాదు. చాలా ఘనంగా. ఏకంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్ లాంటి రెగ్యులర్ టీ20 ప్లేయర్స్ ను వెనక్కి నెట్టి టీ20 ర్యాంకుల్లో తిలక్ వర్మ దూసుకెళ్లాడు. ఐసీసీ లేటెస్ట్ ర్యాంకుల్లో తిలక్ 503 పాయింట్లతో 46వ స్థానంలో ఉండటం విశేషం. అంతేకాదు టీ20 బ్యాటర్ల ర్యాంకుల్లో ఇండియా తరఫున ఐదో అత్యుత్తమ ర్యాంక్ కలిగిన ప్లేయర్ గా అతడు నిలిచాడు.
మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగిన సూర్యకుమార్ యాదవ్ తొలి ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక విరాట్ కోహ్లి 19వ స్థానంలో, కేఎల్ రాహుల్ 33, రోహిత్ 34వ స్థానాల్లో ఉన్నారు. వీళ్ల తర్వాత బెస్ట్ ర్యాంక్ తిలక్ వర్మదే. వీళ్లలో కోహ్లి, రోహిత్, రాహుల్ చాలా కాలంగా టీ20 జట్టులోనే లేరు. ఆ లెక్కన ప్రస్తుత టీ20 టీమ్ లో సూర్య తర్వాత బెస్ట్ ర్యాంక్ తిలక్ వర్మదే.
కొంతకాలంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న శుభ్‌మన్ గిల్ 68వ ర్యాంకులో, ఇషాన్ 54వ ర్యాంకులో, హార్దిక్ పాండ్యా 53వ ర్యాంకులో ఉన్నారు. ఇక బౌలర్ల విషయానికి వస్తే ఇండియా తరఫున టీ20ల్లో అత్యంత వేగంగా అంటే 30వ మ్యాచ్ లోనే 50 వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్.. తాజా ర్యాంకుల్లో చాలా మెరుగయ్యాడు. ఏకంగా 24 ర్యాంకులు ఎగబాకి 51వ స్థానంలో ఉన్నాడు.
అయితే టీ20 ర్యాంకుల్లో టాప్ 10లో ఒక్క ఇండియన్ బౌలర్ కూడా లేడు. అర్ష్‌దీప్ సింగ్ మాత్రమే 17వ ర్యాంకులో ఉన్నాడు. అక్షర్ పటేల్ 33, హార్దిక్ పాండ్యా 37వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
సంబంధిత కథనం