Prithvi Shaw Records: డబుల్ సెంచరీతో రికార్డులు బ్రేక్ చేసిన పృథ్వీ షా
Prithvi Shaw Records: డబుల్ సెంచరీతో పలు రికార్డులు బ్రేక్ చేశాడు పృథ్వీ షా. వన్డే కప్ టోర్నమెంట్ లో భాగంగా నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్న అతడు.. సోమర్సెట్ పై ఈ డబుల్ సెంచరీ చేశాడు.
Prithvi Shaw Records: టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా కౌంటీ క్రికెట్ లో చెలరేగాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే కప్ టోర్నీలో డబుల్ సెంచరీ చేశాడు. నార్తాంప్టన్‌షైర్ తరఫున ఆడుతున్న అతడు సోమర్సెట్ తో జరుగుతున్న మ్యాచ్ లో కేవలం 129 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం విశేషం. మొత్తంగా ఈ మ్యాచ్ లో పృథ్వీ.. 153 బంతుల్లో 244 పరుగులు చేశాడు.
పృథ్వీ షా తన ఇన్నింగ్స్ లో ఏకంగా 28 ఫోర్లు, 11 సిక్స్ లు బాదడం విశేషం. ఈ డబుల్ సెంచరీ లిస్ట్ ఎ క్రికెట్ లో అతడు పలు రికార్డులను తిరగరాశాడు. తొలి సెంచరీని 81 బంతుల్లో సాధించిన పృథ్వీ.. తర్వాతి సెంచరీని కేవలం 48 బంతుల్లోనే అందుకున్నాడు. గతంలో 2020-21 విజయ్ హజారే ట్రోఫీలోనూ అతడు డబుల్ సెంచరీ చేశాడు.
ముంబై తరఫున పుదుచ్చెరిపై 227 రన్స్ చేశాడు. ఇప్పుడా రికార్డును మరింత మెరుగుపరచుకున్నాడు. పృథ్వీ మెరుపులతో నార్తాంప్టన్‌షైర్ టీమ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 రన్స్ చేసింది. లిస్ట్ ఎ క్రికెట్ లో అతనికిది 9వ సెంచరీ. చివరిసారి 2021లో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా 165 రన్స్ చేసిన పృథ్వీ.. మళ్లీ రెండేళ్ల తర్వాత సెంచరీ బాదాడు.
పృథ్వీ షా బ్రేక్ చేసిన రికార్డులు ఇవీ..
- వన్డే కప్ టోర్నీలో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు. గతంలో 206 పరుగులతో ఓలీ రాబిన్సన్ పేరిట ఉన్న రికార్డును పృథ్వీ బ్రేక్ చేశాడు.
- లిస్ట్ ఎ క్రికెట్ లో పృథ్వీకి ఇదే (244) అత్యధిక వ్యక్తిగత స్కోరు.
- ఇంగ్లిష్ లిస్ట్ ఎ క్రికెట్ లో అలీ బ్రౌన్ 268 పరుగుల తర్వాత పృథ్వీ షాదే అత్యుత్తమ స్కోరు కావడం విశేషం.
- రెండు దేశాల్లో లిస్ట్ ఎ డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ పృథ్వీ షా.
- రెండు జట్ల (ముంబై, నార్తాంప్టన్‌షైర్) తరఫున లిస్ట్ ఎ డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ కూడా అతడే.
- లిస్ట్ ఎ క్రికెట్ లో ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన రెండో ఇండియన్ పృథ్వీ షా. రోహిత్ శర్మ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.
- వన్డే కప్ టోర్నీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇండియన్ ప్లేయర్ గా పుజారా పేరిట ఉన్న రికార్డును పృథ్వీ బ్రేక్ చేశాడు.
- లిస్ట్ ఎ క్రికెట్ లో పృథ్వీ షా సగటు (55.30) ఇండియా తరఫున నాలుగో అత్యుత్తమం. అతని కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్, పుజారా, విరాట్ కోహ్లి ఉన్నారు.
సంబంధిత కథనం