Hardik slams West Indies: కనీస అవసరాలూ తీర్చకపోతే ఎలా.. వెస్టిండీస్ బోర్డుపై హార్దిక్ సీరియస్
Hardik slams West Indies: కనీస అవసరాలూ తీర్చకపోతే ఎలా అంటూ వెస్టిండీస్ బోర్డుపై హార్దిక్ సీరియస్ అయ్యాడు. మూడో వన్డే ముగిసిన తర్వాత మాట్లాడుతూ.. విండీస్ బోర్డు చేసిన ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Hardik slams West Indies: క్రికెట్ లో ఓ ఇంటర్నేషనల్ టీమ్ మరో దేశానికి వెళ్లినప్పుడు ఇంచుమించు రాజభోగాలు అనుభవిస్తుంది. స్టార్ హోటల్స్ లో వసతి సహా క్రికెటర్లు ఏది అడిగితే క్షణాల్లో వాళ్ల ముందు వాలే ఏర్పాట్లను ఆతిథ్య క్రికెట్ బోర్డు చేస్తుంది. కానీ వెస్టిండీస్ లో మాత్రం ఇండియన్ టీమ్ కు కనీస వసతులూ కరువయ్యాయని స్టాండిన్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వాపోయాడు.
మూడో వన్డే ముగిసిన తర్వాత పబ్లిగ్గానే వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు అతడు చురకలంటించాడు. తామేమీ లగ్జరీలు కోరుకోవడం లేదని, కనీస అవసరాలు కూడా తీర్చకపోతే ఎలా అంటూ ప్రశ్నించాడు. మళ్లీ ఎప్పుడైనా వెస్టిండీస్ టూర్ కు వచ్చినప్పుడు మెరుగైన సౌకర్యాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు కూడా హార్దిక్ చెప్పాడు. మూడో వన్డే ఆడిన బ్రియాన్ లారా స్టేడియం చాలా బాగున్నా.. విండీస్ బోర్డు కనీస అవసరాలు తీర్చకపోవడంపై మాత్రం హార్దిక్ అసహనం వ్యక్తం చేశాడు.
"మేము ఆడిన చాలా మంది గ్రౌండ్స్ లో ఇదీ ఒకటి. మరోసారి వెస్టిండీస్ కు మేము వస్తే పరిస్థితులు మెరుగ్గా ఉండాలనుకుంటున్నాం. ప్రయాణం నుంచి ఇతర అన్ని విషయాల్లోనూ ఇంకా చాలా చేయాలి. గతేడాది కూడా ఇలాంటి సమస్యలే ఎదురయ్యాయి. ఇప్పటికైనా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు దీని గురించి ఆలోచించాలి. మేమేమీ లగ్జరీ కోరుకోవడం లేదు. కానీ కనీస అవసరాలైతే తీర్చాలి కదా. అది వదిలేస్తే ఇక్కడికి వచ్చి క్రికెట్ ఆడటం మాత్రం చాలా సంతోషంగా ఉంది" అని హార్దిక్ అన్నాడు.
అంతకుముందు ఇండియన్ టీమ్ కూడా ఫ్లైట్ ఆలస్యం కావడంపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ట్రినిడాడ్ నుంచి బార్బడోస్ కు వెళ్లి విమానం 4 గంటలు ఆలస్యం కావడంతో తమకు నిద్ర సరిపోలేదని ప్లేయర్స్ అసహనం వ్యక్తం చేశారు. మ్యాచ్ ల మధ్య మరీ తక్కువ సమయం ఉంటే అర్ధరాత్రి విమాన ప్రయాణాలు వద్దని కూడా సీనియర్ ప్లేయర్స్ సూచించారు.
మూడు వన్డేల సిరీస్ ను ఇండియా 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. మూడో వన్డేలో ఏకంగా 200 పరుగులతో ఇండియా గెలిచింది. వెస్టిండీస్ పై ఇండియాకు వరుసగా 13వ వన్డే సిరీస్ విజయం కావడం విశేషం. 2007 నుంచి వెస్టిండీస్ చేతుల్లో ఇండియా వన్డే సిరీస్ ఓడిపోలేదు.
సంబంధిత కథనం