Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న జెంటిల్మెన్ గేమ్-cricket in olympics official announcement this week end says a report ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Cricket In Olympics Official Announcement This Week End Says A Report

Cricket in Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్.. 128 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న జెంటిల్మెన్ గేమ్

Hari Prasad S HT Telugu
Oct 09, 2023 10:13 PM IST

Cricket in Olympics: ఒలింపిక్స్‌లోకి మళ్లీ క్రికెట్ ఎంట్రీ ఇవ్వబోతోంది. 128 ఏళ్ల తర్వాత ఈ మెగా స్పోర్టింగ్ ఈవెంట్లోకి క్రికెట్ తిరిగి రానుండటం విశేషం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.

ఒలింపిక్స్ లోకి 128 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్
ఒలింపిక్స్ లోకి 128 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇవ్వనున్న క్రికెట్ (REUTERS)

Cricket in Olympics: ఒలింపిక్స్ లో క్రికెట్ చూడాలన్న అభిమానుల కల నెరవేరబోతోంది. అప్పుడెప్పుడో 1900లో జరిగిన తొలి ఆధునిక ఒలింపిక్స్ లో కనిపించిన ఈ జెంటిల్మెన్ గేమ్ ఇప్పుడు మళ్లీ 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ESPNcricinfo రిపోర్టు వెల్లడించింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారం చివర్లోపు రానున్నట్లు కూడా ఆ రిపోర్టు తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు

ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న నిర్ణయాన్ని ఎల్ఏ28 కమిటీ తీసుకోగా.. దానిని ఆమోదించాల్సిందిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)కి సిఫారసు చేసింది. దీనిపై ఎల్ఏ28, ఐసీసీ లేదా ఐఓసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ముంబైలో జరగనున్న ఐఓసీ సమావేశంలో దీనిపై ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు.

అక్టోబర్ 14, 15 తేదీల్లో ముంబైలోనే ఐఓసీ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ కూడా జరగనుంది. గత ఫిబ్రవరిలో ఒలింపిక్స్ లో ఉండబోయే 28 స్పోర్ట్స్ జాబితాలో క్రికెట్ కు చోటు దక్కలేదు. అయితే జులై నెలలో ఐఓసీ పరిశీలన కోసం ఎంపిక చేసిన 9 క్రీడల జాబితాలో క్రికెట్ కు చోటు దక్కడంతో జెంటిల్మెన్ గేమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

క్రికెట్ తోపాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ లాంటి స్పోర్ట్స్ ను ఒలింపిక్స్ లోకి తీసుకునేందుకు ఐఓసీ పరిశీలించింది. ఎల్ఏ28 కమిటీ ముందు ఐసీసీ ప్రెజంటేషన్ కూడా ఇచ్చింది. ఇందులో మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో టీ20 క్రికెట్ నిర్వహించాలని సిఫారసు చేసింది.

ఐసీసీ టీ20 ర్యాంకుల్లో టాప్ 6లో ఉండే టీమ్స్ ఇందులో తలపడతాయి. తక్కువ సమయంలో ముగిసే, ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకర్షించే, ప్రపంచ ఛాంపియన్‌షిప్ నిర్వహించే ఫార్మాట్ లో ఆడించాలని ఎల్ఏ28, ఐఓసీ స్పష్టం చేశాయి. దీంతో ఐసీసీ టీ20 క్రికెట్ ను రికమండ్ చేసింది. క్రికెట్ తొలి, చివరిసారి 1900లో పారిస్ లో జరిగిన తొలి ఆధునిక ఒలింపిక్స్ లో కనిపించింది. అప్పుడు ఫ్రాన్స్ ను చిత్తు చేసి గ్రేట్ బ్రిటన్ గోల్డ్ మెడల్ గెలిచింది.

WhatsApp channel