India vs West Indies Fines: టీమిండియా, వెస్టిండీస్ మధ్య తొలి టీ20 ఉత్కంఠ భరితంగా జరిగింది. గురువారం ట్రినిడాడ్‍లో జరిగిన ఈ మ్యాచ్‍లో చివరికి ఆతిథ్య విండీస్ విజయం సాధించింది. ఐదు టీ20 సిరీస్‍లో 1-0తో ముందడుగు వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేయగా.. లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులే చేయగలిగింది. దీంతో భారత జట్టు 4 పరుగులతో ఓడిపోయింది. అయితే, తొలి టీ20 తర్వాత టీమిండియా, వెస్టిండీస్ జట్లకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధించింది. ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత విధించింది.
తొలి టీ20లో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, వెస్టిండీస్‍కు ఫైన్ వేసింది ఐసీసీ. అంటే నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేదు. వెస్టిండీస్ రెండు ఓవర్లు వెనుకబడి.. ఆలస్యం చేసింది. భారత్ ఓవర్ ఆలస్యంగా వేసింది. దీంతో టీమిండియాకు మ్యాచ్ ఫీజులో ఐదు శాతం, వెస్టిండీస్‍కు పది శాతం ఫైన్ వేసింది ఐసీసీ. మినిమం ఓవర్ రేటు పాటించని కారణంగా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఈ మేరకు మ్యాచ్ ఫీజులను జరిమానాగా విధించినట్టు ఐసీసీ నేడు వెల్లడించింది.
ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయకపోవడం తప్పు. ఒక్కో ఓవర్ ఆలస్యానికి ఐదు శాతం మ్యాచ్ ఫీజు ఫైన్ ఉంటుంది. అంటే రెండు ఓవర్లు ఆలస్యమైతే 10 శాతం జరిమానా పడుతుంది. దీనికి 50శాతం గరిష్ట పరిమితిగా ఉంది.
తొలి టీ20లో కెప్టెన్ రావ్మన్ పావెల్ (48), నికోలస్ పూరన్ (41) రాణించటంతో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ ఆరు వికెట్లకు 149 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో టీమిండియా 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది. టీమిండియా డెబ్యూటంట్ తిలక్ వర్మ (39) ఆకట్టుకున్నాడు. అయితే, 16వ ఓవర్లో వెస్టిండీస్ బౌలర్ జేసన్ హోల్డర్ ఓ వికెట్ తీయడం సహా మేడిన్ చేశాడు. దీంతో భారత్ ఒత్తిడిలోకి వెళ్లి ఏకంగా చివరికి మ్యాచ్‍ను చేజార్చుకుంది. టీమిండియాను కట్టడి చేసిన హోల్డర్‌కే మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఇండియా, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 ఆదివారం (ఆగస్టు 6) జరగనుంది.