Ind Legends vs SA Legends: సచిన్, యువరాజ్ విఫలం - బిన్నీ బ్యాటింగ్ మెరుపులతో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
Ind Legends vs SA Legends: రోడ్ సెఫ్టీ సిరీస్ లో సౌతాఫ్రికా లెజెండ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. సచిన్, యువరాజ్ విఫలమైనా స్టువర్ట్ బిన్నీ 82 రన్స్ తో మెరిశాడు.
Ind Legends vs SA Legends: రోడ్ సెఫ్టీ వరల్డ్ సిరీస్ లో భాగంగా శనివారం సౌతాఫ్రికా లెజెండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా లెజెండ్స్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 217 రన్స్ చేసింది. స్టువర్ట్ బిన్నీ 82 పరుగులతో మెరవగా చివరలో యూసఫ్ ఫఠాన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు సాధించింది. నమన్ ఓజాతో కలిసి సచిన్ ఇండియా లెజెండ్స్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెండు ఫోర్లు కొట్టి అభిమానులను అలరించాడు సచిన్. 15 బాల్స్ లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఓజా కూడా 21 పరుగులకు పెవిలియన్ చేరాడు. సురేష్ రైనాతో కలిసి బిన్నీ ఇండియా ఇన్నింగ్స్ ను గాడిన పెట్టాడు. రైనా 22 బాల్స్ లో ఒక సిక్సర్ నాలుగు ఫోర్లతో 33 రన్స్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా బిన్నీ బ్యాటింగ్ జోరు మాత్రం తగ్గించలేదు. 42 బాల్స్ లో ఆరు సిక్సర్లు, ఐదు ఫోర్లతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
చివరలో యూసఫ్ పఠాన్ కేవలం పదిహేను బాల్స్ లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్ తో 35 రన్స్ చేయడంతో ఇండియా లెజెండ్స్ నాలుగు వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ కేవలం ఆరు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. సౌతాఫ్రికా లెజెండ్స్ బౌలర్లలో వండర్ వాత్ రెండు, ఎన్తిని, ఎడ్డీ లో ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.