Ind vs Pak: చెలరేగిన భువీ, హార్దిక్ పాండ్యా.. ఇండియా టార్గెట్ 148
Ind vs Pak: పాకిస్థాన్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసింది టీమిండియా. మహ్మద్ రిజ్వాన్ భయపెట్టినా.. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా, చివర్లో భువనేశ్వర్ కుమార్ చెలరేగడంతో ఆ టీమ్ భారీ స్కోరు సాధించలేకపోయింది.
Ind vs Pak: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్‌లో ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 147 రన్స్ చేసింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 42 బాల్స్‌లో 43 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతడు ఒక్కడే కాస్త భయపెట్టినా.. మిడిల్ ఓవర్లలో హార్దిక్ పాండ్యా, చివరి ఓవర్లలో భువనేశ్వక్ కుమార్ చెలరేగి పాక్ ను దెబ్బతీశారు. దీంతో ఆ టీమ్ భారీ స్కోరు చేయలేకపోయింది. భువనేశ్వర్ 4 ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. పాకిస్థాన్ పై ఓ ఇండియన్ బౌలర్ కు టీ20ల్లో ఇవే బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కావడం విశేషం.
హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 25 రన్స్ 3 వికెట్లు తీశాడు. షార్ట్ బాల్స్‌తో పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు హార్దిక్ పాండ్యా. అతడు తీసిన మూడు వికెట్లు షార్ట్ పిచ్ బాల్స్‌తోనే కావడం విశేషం. డేంజరస్ రిజ్వాన్ వికెట్‌ను కూడా ఇలాంటి బాల్‌తోనే బోల్తా కొట్టించాడు. అటు స్ట్రైకర్ బౌలర్ భువనేశ్వర్ కూడా రాణించాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ను తొలి ఓవర్లోనే భయపెట్టాడు భువనేశ్వర్. రెండుసార్లు రివ్యూలతో బతికిపోయాడు ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్. ఆ తర్వాత స్కోరు 15 రన్స్ చేరేసరికి కెప్టెన్ బాబర్ ఆజం (10)ను షార్ట్ బాల్‌తో భువీయే ఔట్ చేశాడు. ఆ తర్వాత ఫఖర్ జమాన్ (10) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇఫ్తికార్ అహ్మద్ (28) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
ఇద్దరూ కలిసి భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఈ సమయంలో పాక్ ఫ్యాన్స్ మంచి ఊపు మీద కనిపించారు. ఈ సమయంలో బౌలింగ్‌కు దిగిన హార్దిక్ పాండ్యా పాక్‌ను దెబ్బ తీశాడు. ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్‌దిల్ షా, మహ్మద్ రిజ్వాన్‌లను అతడు ఔట్ చేశాడు. దీంతో పాక్ భారీ స్కోరుపై ఆశలు వదులుకుంది.