Ben Stokes on IPL: బెన్ స్టోక్స్‌కు మోకాలి గాయం.. ఐపీఎల్లో చెన్నైకి ఆడతాడా.. ఇదీ అతని రియాక్షన్
Ben Stokes on IPL: బెన్ స్టోక్స్‌కు మోకాలి గాయం అయింది. మరి అతడు ఐపీఎల్లో చెన్నైకి ఆడతాడా? న్యూజిలాండ్ తో రెండో టెస్టు ముగిసిన తర్వాత స్టోక్స్ దీనిపై స్పందించాడు.
Ben Stokes on IPL: న్యూజిలాండ్ తో జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లండ్ కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయిన విషయం తెలుసు కదా. ఈ ఓటమితో సిరీస్ ను 1-1తో కివీస్ తో పంచుకోవాల్సి వచ్చింది. ఈ సిరీస్ సందర్భంగానే కెప్టెన్ స్టోక్స్ కూడా మోకాలి గాయంతో బాధపడ్డాడు. మరి ఈ గాయంతో అతడు రానున్న ఐపీఎల్లో ఆడతాడా? చెన్నై టీమ్ గత వేలంలో అతన్ని ఏకంగా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
మోకాలి గాయం వేధిస్తున్నా తాను కచ్చితంగా ఐపీఎల్లో ఆడతానని రెండో టెస్టు తర్వాత స్టోక్స్ చెప్పడం గమనార్హం. ఈ రెండో టెస్టులో స్టోక్స్ కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేయగలిగాడు. అటు బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనూ అతడు మోకాలి గాయంతో బాధపడ్డాడు. అయితే తొలి ఇన్నింగ్స్ లో 27, రెండో ఇన్నింగ్స్ లో 33 పరుగులు చేశాడు.
రూట్ తో కలిసి రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ భాగస్వామ్యంతో ఇంగ్లండ్ ను గెలిపించే ప్రయత్నం చేశాడు. కానీ చివరికి ఒక పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. అయితే ఈ ఓటమి కన్నా ఎక్కువగా మోకాలి గాయం స్టోక్స్ ను, అతన్ని కొనుగోలు చేసిన చెన్నై ఫ్రాంఛైజీని ఆందోళనకు గురి చేస్తోంది. మార్చి 31 నుంచి మే 28 వరకూ ఈ సీజన్ ఐపీఎల్ జరగనున్న విషయం తెలిసిందే.
"నేను ఐపీఎల్ కు వెళ్తున్నాను. నేను ఫ్లెమింగ్ తో ఇప్పటికే మాట్లాడాను. అతనికి నా ప్రస్తుతం నా శరీరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మొత్తం తెలుసు. ప్రతి వారం దీనిపై అంచనా వేయాల్సి ఉంటుంది" అని స్టోక్స్ చెప్పాడు. అయితే ఐపీఎల్ తర్వాత జరగబోయే యాషెస్ సిరీస్ నాటికి తాను పూర్తి ఫిట్ గా ఉండాలని భావిస్తున్నట్లు కూడా స్టోక్స్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
"నేను అబద్ధం చెప్పడం లేదు. నేను నా పూర్తిస్థాయి ప్రదర్శన చేయకుండా ఏదో అడ్డు పడుతుండటం నాకు చాలా చిరాకు తెప్పిస్తోంది. ఈ విషయంపై నేను ఫిజియోలు, మెడికోలతో కలిసి పని చేస్తున్నాను. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తున్నాను. యాషెస్ సిరీస్ కు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఆ సమయానికి పూర్తి సామర్థ్యంతో ఆడటానికి చేయాల్సినవన్నీ చేస్తాను" అని స్టోక్స్ స్పష్టం చేశాడు.
ఐపీఎల్లో ఆడినా కూడా మధ్యలోనే తాను వెళ్లిపోతానని ఈ మధ్యే స్టోక్స్ చెప్పిన విషయం తెలిసిందే. ఐర్లాండ్ తో జూన్ 1 నుంచి ఇంగ్లండ్ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి తనకు తగిన సమయం కావాలని స్టోక్స్ అన్నాడు.
సంబంధిత కథనం