Bangladesh vs England: ఇంగ్లండ్‌కు మళ్లీ షాకిచ్చిన బంగ్లాదేశ్.. తొలిసారి సిరీస్ విజయం
Bangladesh vs England: ఇంగ్లండ్‌కు మళ్లీ షాకిచ్చింది బంగ్లాదేశ్. వరల్డ్ ఛాంపియన్ పై తొలిసారి టీ20 సిరీస్ విజయం సాధించింది. ఆదివారం (మార్చి 12) జరిగిన రెండో టీ20లో నాలుగు వికెట్లతో గెలిచింది.
Bangladesh vs England: టీ20 వరల్డ్ ఛాంపియన్ ఇంగ్లండ్ మరోసారి బోల్తా పడింది. బంగ్లాదేశ్ చేతుల్లో వరుసగా రెండో టీ20లోనూ ఓడిపోయింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లా టీమ్ మూడు టీ20ల సిరీస్ ఎగరేసుకుపోయింది. బంగ్లా ప్లేయర్ మెహదీ హసన్ మిరాజ్ మరోసారి ఆల్ రౌండ్ మెరుపులు మెరిపించడంతో 4 వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో 118 పరుగుల లక్ష్యాన్ని బంగ్లాదేశ్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. మిరాజ్ 16 బంతుల్లోనే రెండు సిక్స్ లతో 20 రన్స్ చేశాడు. షాంటో 46 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు బౌలింగ్ లోనూ మిరాజ్ రాణించాడు. అతడు 4 ఓవర్లలో కేవలం 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.
దీంతో ఇంగ్లండ్ 20 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ మిడిలార్డర్ బ్యాటర్ బెన్ డకెట్ 28 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఫిల్ సాల్ట్ 25, మొయిన్ అలీ 15 పరుగులు చేశారు. తర్వాత చేజింగ్ లోనూ బంగ్లాదేశ్ 56 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే షాంటో మాత్రమే చివరి వరకూ క్రీజులో నిలిచి బంగ్లాను గెలిపించాడు.
అతనికి చివర్లో మిరాజ్ మెరుపు ఇన్నింగ్స్ సాయపడింది. ఇంగ్లండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 13 పరుగులకు 3 వికెట్లు తీసుకొని బంగ్లాను దెబ్బతీశాడు. సామ్ కరన్, మొయిన్ అలీ, రేహాన్ అహ్మద్ కూడా తలా ఒక వికెట్ తీసినా.. ఫలితం లేకపోయింది.
ఇంగ్లండ్ ఈ మ్యాచ్ లో చేసిన 117 పరుగులు ఆ జట్టుకు టీ20ల్లో ఎనిమిదో అత్యల్ప స్కోరు కావడం విశేషం. ఇప్పటికే తొలి టీ20 కూడా గెలిచిన బంగ్లాదేశ్ ఈ విజయంతో సిరీస్ ను ఖాయం చేసుకుంది. మూడో టీ20 మంగళవారం (మార్చి 14) జరగనుంది. ఈ సిరీస్ కు ముందు మూడు వన్డేల సిరీస్ ను ఇంగ్లండ్ 2-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఆ సిరీస్ చివరి వన్డేలో బంగ్లాదేశ్ విజయం సాధించింది.
సంబంధిత కథనం