Azhar Ali on Kohli: కోహ్లి క్యాచ్ డ్రాప్ చేశాను.. ఇక నా ఇల్లు ధ్వంసం చేస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్-azhar ali on kohli reveals interesting things when he dropped kohlis catch in 2017 champions trophy final ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Azhar Ali On Kohli Reveals Interesting Things When He Dropped Kohlis Catch In 2017 Champions Trophy Final

Azhar Ali on Kohli: కోహ్లి క్యాచ్ డ్రాప్ చేశాను.. ఇక నా ఇల్లు ధ్వంసం చేస్తారనుకున్నా: పాక్ మాజీ కెప్టెన్

Hari Prasad S HT Telugu
Mar 27, 2023 08:17 PM IST

Azhar Ali on Kohli: కోహ్లి క్యాచ్ డ్రాప్ చేశాను.. ఇక నా ఇల్లు ధ్వంసం చేస్తారనుకున్నా అంటూ పాక్ మాజీ కెప్టెన్ అజర్ అలీ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ను గుర్తు చేసుకున్నాడు.

విరాట్ కోహ్లి
విరాట్ కోహ్లి (Getty)

Azhar Ali on Kohli: విరాట్ కోహ్లికి చేజ్ మాస్టర్ గా పేరుంది. ఇప్పుడు కాస్త తగ్గాడు కానీ కొన్నాళ్ల కిందటి వరకూ వన్డేల్లో ఛేజింగ్ అంటే చెలరేగిపోయేవాడు. ఎంతటి స్కోరు అయినా కోహ్లి ముందు దాసోహమయ్యేది. అతని సెంచరీల్లో చేజింగ్ లో వచ్చినవే ఎక్కువ అంటే నమ్మశక్యం కాదు. మరి అలాంటి కోహ్లి క్యాచ్ ను చేజింగ్ లో డ్రాప్ చేయడమంటే ఎంతటి నేరమో తెలుసు కదా.

ట్రెండింగ్ వార్తలు

అది కూడా ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లో అయితే ఆ క్యాచ్ డ్రాప్ చేసిన ప్లేయర్ గుండె గల్లంతవడం ఖాయం. సరిగ్గా అలాంటి క్షణాన్నే తాను 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ సందర్భంగా అనుభవించినట్లు పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అజర్ అలీ గుర్తు చేసుకున్నాడు. ఆ ఫైనల్లో నిజానికి ఇండియా దారుణంగా ఓడిపోయింది. కోహ్లి క్యాచ్ ను అజర్ డ్రాప్ చేసినా.. తర్వాతి బంతికే అతడు ఔటవడంతో అజర్ ఊపిరి పీల్చుకున్నాడు.

ఈ విషయాన్ని తాజాగా హస్నా మనా హై అనే ప్రోగ్రామ్ లో అజర్ అలీ వెల్లడించాడు. 338 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా.. కేవలం 158 పరుగులకే కుప్పకూలింది. మహ్మద్ ఆమిర్ ధాటికి ఇండియన్ బ్యాటింగ్ లైనప్ కకావికలం అయింది. అయితే ఇండియా ఇన్నింగ్స్ సందర్భంగా కోహ్లి ఇచ్చిన ఓ క్యాచ్ ను అజర్ డ్రాప్ చేశాడు. అప్పుడు తన మెదడులో ఎలాంటి ఆలోచనలు వచ్చాయో అతడు వివరించాడు.

"అది నేను ప్రత్యక్షంగా అనుభవించాను. క్యాచ్ డ్రాప్ చేయడానికి, అతడు ఔటవడానికి మధ్య ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. మొత్తం ప్రపంచమంతా నన్నే చూస్తూ నిందిస్తున్నట్లుగా చాలా భారంగా ఫీలయ్యాను. కోహ్లి చేజింగ్ లలో బాగా ఆడతాడు. ఇప్పుడు కూడా ఈ టార్గెట్ చేజ్ చేస్తే వాళ్లు నా ఇంటిని ధ్వంసం చేస్తారు.. దేవుడా రక్షించు అని అనుకున్నాను. కానీ నా టైమ్ బాగుండి ఆ మరుసటి బంతికే కోహ్లి ఔటయ్యాడు" అని అజర్ అలీ చెప్పాడు.

ఆ సమయంలో సెకండ్ స్లిప్ లో ఫీల్డింగ్ చేస్తున్న అజర్ అలీ.. కోహ్లి క్యాచ్ డ్రాప్ చేశాడు. అయితే మరుసటి బంతికే ఆమిర్ అతన్ని బోల్తా కొట్టించాడు. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న షాదాబ్ ఖాన్ చేతుల్లో పడింది. కోహ్లి ఔటవడంతో ఇండియా కోలుకోలేదు. పాక్ ఏకంగా 180 రన్స్ తో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ ఎగరేసుకుపోయింది. ఆ సమయంలో మొత్తం పాకిస్థాన్ కంటే కూడా తానే సంతోషంగా ఉన్నట్లు అజర్ చెప్పాడు.

ఆ ఫైనల్లో అజర్ 59 రన్స్ చేశాడు. అంతేకాదు సెంచరీ హీరో ఫఖర్ జమాన్ తో కలిసి తొలి వికెట్ కు 128 రన్స్ జోడించాడు. ఆ మ్యాచ్ లో బుమ్రా నోబాల్ తో బతికిపోయిన ఫఖర్ సెంచరీతో ఇండియా కొంప ముంచాడు. నిజానికి ఫైనల్ కు ముందే తాను నోబాల్ కు ఔటైనట్లుగా కల వచ్చిందని ఫఖర్ తనతో చెప్పినట్లు అజర్ ఈ సందర్భంగా వెల్లడించాడు.

WhatsApp channel

సంబంధిత కథనం