Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా-avani lekhara creates history wins gold medal at paralympics 2024 first medal for india in paris ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

Avani Lekhara: పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

Hari Prasad S HT Telugu
Aug 30, 2024 04:33 PM IST

Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియా బోణీ చేసింది. షూటర్ అవని లెఖారా గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించింది. 2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్ కావడం విశేషం.

పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా
పారాలింపిక్స్‌లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్.. చరిత్ర సృష్టించిన షూటర్ అవని లెఖారా

Avani Lekhara: పారిస్ పారాలింపిక్స్ లో ఇండియాకు తొలి గోల్డ్ మెడల్ వచ్చేసింది. వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1 ఈవెంట్లో మన దేశానికి చెందిన అవని లెఖారా గోల్డ్ గెలిచి చరిత్ర సృష్టించింది. అంతేకాదు పారాలింపిక్స్ లో తాను టోక్యోలో నెలకొల్పిన రికార్డును ఆమె ఇక్కడ తిరగ రాయడం విశేషం.

ఇండియాకు తొలి గోల్డ్

పారిస్ ఒలింపిక్స్ లో ఇండియన్ అథ్లెట్లు ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేకపోయారు. కానీ పారాలింపిక్స్ లో మాత్రం అప్పుడే తొలి గోల్డ్ మెడల్ వచ్చేసింది. టోక్యో పారాలింపిక్స్ లో 249.6 పాయింట్లతో రికార్డు నెలకొల్పి గోల్డ్ గెలిచిన షూటర్ అవని లెఖారా.. ఇప్పుడు 249.7 పాయింట్లతో ఆ రికార్డు బ్రేక్ చేసి మరో గోల్డ్ సొంతం చేసుకుంది.

ఫైనల్ చివరి రౌండ్ నాటకీయ పరిణామాల మధ్య సాగింది. అవని గోల్డ్ షూటౌట్ లో వెనుకబడిపోయింది. చివరి షాట్ కంటే ముందు షాట్ లో ఆమె 9.9 స్కోరు చేయడంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ సమయంలో కొరియాకు చెందిన యున్రి లీ టాప్ లో నిలిచి గోల్డ్ గెలుస్తుందని అనిపించింది.

కానీ అవని తన చివరి షాట్ లో 10.5 స్కోరుతో టాప్ లోకి దూసుకొచ్చింది. అయితే అటు లీ మాత్రం చివరి షాట్ లో కేవలం 6.8 స్కోరు సాధించడంతో అవనికి గోల్డ్ ఖాయమైంది. దేశంలోని అత్యుత్తమ పారాలింపియన్స్ లో ఒకరిగా పేరుగాంచిన అవని.. వరుసగా రెండో పారాలింపిక్స్ లోనూ గోల్డ్ సాధించింది.

మరో బ్రాంజ్ కూడా..

ఇదే ఈవెంట్ లో మరో ఇండియన్ షూటర్ మోనా అగర్వాల్ కూడా బ్రాంజ్ మెడల్ గెలిచింది. మోనా 228.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ సొంతం చేసుకుంది.

నిజానికి ఫైనల్ రౌండ్ లో మోనా కూడా టాప్ ఫామ్ లో కనిపించింది. 20 షాట్ల తర్వాత ఆమెనే తొలి స్థానంలో నిలిచింది. అయితే 22వ షాట్ లో 10 స్కోరు చేయడంతో ఆమె గోల్డ్ కోసం పోటీ పడలేకపోయింది.

అవని కొత్త చరిత్ర

పారాలింపిక్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ గెలిచిన తొలి భారత మహిళగా అవని లెఖారా చరిత్ర సృష్టించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ షూటింగ్ లో ఇండియా తరఫున తొలి మెడల్ గెలిచిన మహిళా షూటర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్ 1లో గోల్డ్ తోపాటు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ లోనూ బ్రాంజ్ గెలిచింది. పారాలింపిక్స్ లో ఎస్‌హెచ్1 కేటగిరీ అంటే తమ చేతుల్లో, నడుము కింద, కాళ్లలో కదలికలు లేని అసలు కాళ్లే లేని అథ్లెట్లు పోటీ పడతారు. అవని లెఖారా 2022లో జరిగిన పారా వరల్డ్ కప్ లోనూ గోల్డ్ మెడల్ గెలిచింది.

టాపిక్