Australian Open 2025: ఫైనల్‍లో సత్తాచాటిన సిన్నెర్.. మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం.. ప్రైజ్‍మనీ ఎంతంటే..-australian open 2025 men singles final jannik sinner won against zverev and he cliches second time winner prize money ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Australian Open 2025: ఫైనల్‍లో సత్తాచాటిన సిన్నెర్.. మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం.. ప్రైజ్‍మనీ ఎంతంటే..

Australian Open 2025: ఫైనల్‍లో సత్తాచాటిన సిన్నెర్.. మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం.. ప్రైజ్‍మనీ ఎంతంటే..

Australian Open 2025 Final - Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో జానిక్ సిన్నెర్ మరోసారి అదరగొట్టాడు. ఫైనల్‍లో దుమ్మురేపే ఆటతో జ్వెరెవ్‍పై గెలిచాడు. వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ టైటిల్ పట్టాడు.

Australian Open 2025: ఫైనల్‍లో సత్తాచాటిన సిన్నెర్.. మరోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కైవసం.. ప్రైజ్‍మనీ ఎంతంటే.. (AP)

టెన్నిస్ గ్రాండ్‍స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‍లో మరోసారి విజేతగా నిలిచాడు ఇటలీ స్టార్ ప్లేయర్ జానిక్ సిన్నెర్. ఫైనల్‍లో సత్తాచాటి వరుసగా రెండోసారి ఈ టోర్నీ టైటిల్ దక్కించుకున్నాడు. నేడు (జనవరి) జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ ఫైనల్‍లో సిన్నెర్ 6-3, 7-6 (7/4), 6-3 తేడాతో రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‍పై విజయం సాధించాడు. తుదిపోరులో వరుస సెట్లలో గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు 23 ఏళ్ల సిన్నెర్. ఆ వివరాలు ఇవే..

ఆరంభం నుంచి ఆధిపత్యం

ఈ ఫైనల్ మ్యాచ్‍లో మొదటి నుంచే జర్మన్ ప్లేయర్ జ్వెరెవ్‍పై ఆధిపత్యం చెలాయించాడు సిన్నెర్. తొలి సెట్లో పవర్ ఫుల్ షాట్లతో రెచ్చిపోయాడు. తొలి సెట్‍లో జ్వెరెవ్ సర్వీస్ బ్రేక్ చేశాడు. జోరు కొనసాగించాడు. దీంతో 6-3తో తొలి సెట్‍ను సిన్నెర్ కైవసం చేసుకున్నాడు.

రెండో సెట్‍లో సిన్నెర్, జ్వెరెవ్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పాయింట్లు స్కోరు చేశారు. దీంతో 6-6కు చేరగా.. టై బ్రేకర్ అవసరం అయింది. టై బ్రేకర్లో సిన్నెర్ పైచేయి సాధించి రెండో సెట్ దక్కించుకున్నాడు. మూడో సెట్‍లో సిన్నెర్ మరింత చెలరేగాడు. జ్వెరెవ్‍కు పెద్దగా అవకాశాలు ఇవ్వకుండా అదరగొట్టాడు. మూడో సెట్‍ను 6-3తో సిన్నెర్ కైవసం చేసుకున్నాడు. దీంతో ఫైనల్‍లో వరుస సెట్లలో గెలిచి సత్తాచాడు ఈ 23 ఏళ్ల ఆటగాడు.

1992-93లో జిమ్ కొరియర్ తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‍ను వరుసగా రెండుసార్లు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా జానిక్ సిన్నెర్ నిలిచాడు.

గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‍తో పాటు యూఎస్ ఓపెన్ గ్రాండ్‍స్లామ్ టైటిల్‍ను కూడా సిన్నెర్ కైవసం చేసుకున్నాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా టైటిల్‍ను మరోసారి దక్కించుకున్నాడు. ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు 23 ఏళ్ల సిన్నెర్.

ప్రైజ్‍మనీ ఇదే

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ గెలిచిన జానిక్ సిన్నెర్‌.. 2.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.19 కోట్లు) ప్రైజ్‍మనీ సొంతం చేసుకున్నాడు. ఫైనల్‍లో ఓడి రన్నరప్‍గా నిలిచిన జ్వెరెవ్‍కు 1.2 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10కోట్ల) ప్రైజమనీ దక్కింది.

సంబంధిత కథనం