Telugu News  /  Sports  /  Australia Won Innings 182 Runs Against South Africa In 2nd Test
దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘనవిజయం
దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా ఘనవిజయం (AP)

Aus vs SA 2nd Test 2022: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన ఆసీస్.. ప్రొటీస్ డబ్ల్యూటీసీ ఆశలపై నీళ్లు

29 December 2022, 12:01 ISTMaragani Govardhan
29 December 2022, 12:01 IST

Aus vs SA 2nd Test 2022: మెల్‌బోర్న్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

ఫలితంగా మూడు టెస్టుల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆసీస్ ఇన్నింగ్స్ 182 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటర్ తెంబా బవుమా(65) మినహా మిగిలిన వారంతా విఫలం కావడంతో ప్రొటీస్ జట్టుకు పరాజయం తప్పలేదు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లయన్ 3 వికెట్లు తీయగా.. స్టాక్ బొలాండ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన ఈ టెస్టులో ఆస్ట్రేలియా తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుని సౌతాఫ్రికాను బ్యాటింగ్‌ను ఆహ్వానించింది. తొలి ఇన్నింగ్స్ దక్షిణాఫ్రికా బ్యాటర్లు చేతులెత్తేశారు. వికెట్ కీపర్ బ్యాటర్ వెయిర్నే(52), మార్కో జాన్సన్(59) అర్ధశతకాలు మినహా మిగిలిన వారు తక్కువ పరుగులకే పెవిలియ్ చేరారు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 189 పరుగులకు ఆలౌటైంది. అసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ 5 వికెట్ల తేడాతో విజృంభించాడు.

అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు నమోదు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(200) డబుల్ శతకంతో కదం తొక్కగా.. అలెక్సీ కెరీ(111) సెంచరీతో రాణించారు. ఫలితంగా 8 వికెట్ల నష్టానికి 575 పరుగుల భారీ స్కోరు వద్ద డీక్లేర్ చేసింది. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా(1), లబుషేన్(14) తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. వార్నర్ రికార్డు ద్విశతకంతో దుమ్మురేపాడు. మరో బ్యాటర్ స్టీవ్ స్మిత్ నిలకడైన అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో అలెక్స్ కేరీ సెంచరీతో విజృంభించాడు. వీరికి తోడు ట్రావిస్ హెడ్(51), కామెరూన్ గ్రీన్(51*) అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఆసీస్ 364 పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా తడబడింది. కెప్టెన్ డీన్ ఎల్గర్ డకౌట్ సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు. తెంబా బవుమా ఒక్కడే అర్ధశతకంతో రాణించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక..

ఆస్ట్రేలియా ఈ ఘనవిజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. రెండో స్థానం కోసం పోటీ పడుతున్న సౌతాఫ్రికాతో ఈ పరాజయంతో చేదు అనుభవం మిగిలింది. తాజా ఓటమితో 72 పాయింట్లున్న ప్రోటీస్ పాయింట్ల పట్టికలో 54.55 నుంచి 50 శాతానికి పడిపోయింది. అయితే ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో విజయం సాధించిన భారత్ 99 పాయింట్లతో 58.93 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది.