Australia vs Afghanistan T20 World Cup: 'కంగారూ'ను కంగారు పెట్టిన ఆఫ్గాన్.. తృటిలో ఓటమిని తప్పించుకున్న ఆసీస్
Australia vs Afghanistan T20 World Cup: అడిలైడ్ వేదికగా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ఆఫ్గాన్ జట్టు తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
Australia vs Afghanistan T20 World Cup: ఈ టీ20 ప్రపంచకప్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయడానికి లేదు. ఈ టోర్నీ ప్రారంభంలోనే ఇంగ్లాండ్‌కు ఐర్లాండ్ షాక్ ఇవ్వగా.. అనంతరం పాకిస్థాన్‌పై జింబాబ్వే విజయం సాధించింది. తాజాగా పసికూన అనే పేరు ఎప్పుడో చెరిపేసుకున్న ఆఫ్గానిస్థాన్.. ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పనిచేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌ను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లింది. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్గాన్‌పై ఆస్ట్రేలియా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేయగా.. అనంతరం ఆఫ్గానిస్థాన్.. 7 వికెట్ల నష్టానికి 164 పరుగులే చేయగలిగింది. ఆతిథ్య జట్టును దాదాపు ఓడించినంత పనిచేసిన ఆఫ్గానిస్థాన్.. తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
ఆసీస్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్య ఛేదనంలో ఆఫ్గాన్ జట్టు ఆరంభంలోనే ఓపెనర్ ఉస్మాన్ ఘని(2) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ రహ్మతుల్లా గుర్బాజ్(30).. వన్డౌన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్(26)తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే వేగంగా ఆడే ప్రయత్నంలో అతడు ఔటైనప్పటికీ.. గుల్బాదిన్ నైట్(39).. ఇబ్రహీం జద్రాన్‌తో కలిసి 59 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అయితే ప్రమాదకరంగా మారుతున్న గుల్బాదిన్ 14వ ఓవర్లో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే ఇబ్రహీంతో, నజీబుల్లా కూడా వెంట వెంటనే పెవిలియన్ చేరారు.
అయితే అప్పటి వరకు ఒకలా సాగిన ఆఫ్గాన్ ఇన్నింగ్స్.. రషీద్ ఖాన్(48) రాకతో పూర్తిగా మారిపోయింది. డార్విష్ రసూలీ(15)తో కలిసి అతడు విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లో 48 పరుగులతో అజేయంగా నిలిచాడు. రసూలీ నెమ్మదిగా ఆడుతుండగా.. రషీద్ మాత్రం హేజిల్‌వుడ్, రిచర్డసన్, స్టాయినీస్ బౌలింగ్‌లో ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు.
చివరి ఓవర్లో ఆఫ్గాన్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. 16 పరుగులే వచ్చాయి. స్టాయినీస్ వేసిన ఆ ఓవర్లో రషీద్ ఓ సిక్సర్ సహా రెండు ఫోర్లతో ఆఫ్గాన్ విజయంపై ఆశలు రేకెత్తించినప్పటికీ.. విజయం మాత్రం కంగారూ జట్టూనే వరించింది. చివరి వరకు పోరాడిన ఆఫ్గాన్ లక్ష్యానికి 4 పరుగుల దూరంలో నిలిచింది. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా, హెజిల్ వుడ్ చెరో 2 వికెట్లు తీయగా.. రిచర్డ్‌సన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మ్యాక్స్ వెల్(54) అర్ధశతకంతో ఆదుకోగా.. మిచెల్ మార్ష్ 45 పరుగులతో రాణించాడు. వీరిద్దరూ మినహా మిగిలిన వారు విఫలం కావడంతో ఆసీస్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. ఆఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హఖ్ 3 వికెట్లు తీయగా.. ఫజల్లా హఖ్ 2, రషీద్, ముజీబ్ చెరో వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు.
సంబంధిత కథనం