Australia vs England Match Abandoned: మళ్లీ కొంప ముంచిన వర్షం.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ రద్దు-australia vs england match abandoned due to rain in melbourne ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Australia Vs England Match Abandoned Due To Rain In Melbourne

Australia vs England Match Abandoned: మళ్లీ కొంప ముంచిన వర్షం.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ రద్దు

Hari Prasad S HT Telugu
Oct 28, 2022 03:35 PM IST

Australia vs England Match Abandoned: వర్షం మళ్లీ కొంప ముంచింది. కీలకమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ కూడా వరుణుడి దెబ్బకు టాస్‌ కూడా పడకుండానే రద్దయింది.

మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అంపైర్ల సమక్షంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కెప్టెన్లు ఫించ్, బట్లర్ హ్యాండ్ షేక్
మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత అంపైర్ల సమక్షంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కెప్టెన్లు ఫించ్, బట్లర్ హ్యాండ్ షేక్ (AP)

Australia vs England Match Abandoned: టీ20 వరల్డ్‌కప్‌లో జట్టు కాదు వరుణుడే గెలుస్తున్నాడు. తనే బ్యాటింగ్‌, తనే బౌలింగ్‌ చేసుకొని వెళ్లిపోతున్నాడు. టీమ్స్‌కు కనీసం టాస్‌ వేసే అవకాశం కూడా ఇవ్వలేదు. వర్షం దెబ్బకు శుక్రవారం (అక్టోబర్‌ 28) జరగాల్సిన రెండు మ్యాచ్‌లూ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు

ఉదయం ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌ మ్యాచ్‌ రద్దవగా.. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లోనే జరగాల్సిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్ కూడా రద్దయింది. ఇప్పటికే సూపర్‌ 12లో అనూహ్యంగా ఒక్కో మ్యాచ్ ఓడి ఒత్తిడిలో ఉన్న ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్‌ ఎంతో కీలకంగా మారింది. ఇందులో పైచేయి సాధించిన టీమ్‌కు సెమీస్‌ అవకాశాలు మెరుగయ్యేవి.

అయితే వరుణుడు ఆ అవకాశం ఇవ్వలేదు. మెల్‌బోర్న్‌లో శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షం ఆటకు అస్సలు ఛాన్సివ్వలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ప్రారంభమయ్యే సమయానికి వర్షం ఆగిపోయినా.. ఔట్‌ఫీల్డ్‌ చిత్తడిగా మారడంతో ఆలస్యమైంది. రెండు, మూడుసార్లు అంపైర్లు ఫీల్డ్‌ను పరిశీలించినా.. ఆటకు అనుకూలంగా లేకపోవడంతో వేచి చూశారు.

ఈలోగా మరోసారి వర్షం కురవడంతో ఇక లాభం లేదనుకొని మ్యాచ్‌ను రద్దు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:48 గంటల వరకూ చూసిన అంపైర్లు ఇక మ్యాచ్‌ నిర్వహణ సాధ్యం కాదని తేల్చేశారు. దీంతో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ చెరొక పాయింట్‌ పంచుకున్నారు. ఈ మ్యాచ్‌ రద్దవడంతో ఇంగ్లండ్‌ మూడు పాయింట్లతో రెండోస్థానానికి వెళ్లగా.. ఆస్ట్రేలియా నాలుగోస్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌ రద్దవడం ఆస్ట్రేలియా సెమీఫైనల్‌ అవకాశాలను మరింత దెబ్బతీసింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో చేతుల్లో దారుణంగా ఓడిన ఆసీస్.. ఆ తర్వాత శ్రీలంకపై ఘన విజయం సాధించినా వాళ్ల నెట్‌రన్‌రేట్‌ ఇంకా మైనస్‌లోనే ఉంది. ఇంగ్లండ్‌పై గెలిచి ఉంటే వాళ్ల ఖాతాలో రెండు పాయింట్లతోపాటు నెట్‌ రన్‌రేట్ మెరుగయ్యేది. కానీ వర్షంతో ఆసీస్ ఆశలు గల్లంతయ్యాయి.

ఈ వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకూ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్‌.. ఆఫ్ఘనిస్థాన్‌, ఐర్లాండ్‌.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ మ్యాచ్‌లు కనీసం టాప్‌ కూడా పడకుండానే రద్దయ్యాయి. ఇక సౌతాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్‌ దాదాపు ముగిసిపోయే సమయంలో వరణుడి రాకతో ఫలితం తేలలేదు.

WhatsApp channel