Asia Cup 2023 Schedule: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపే!.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍‍లపైనే అందరి దృష్టి-asia cup 2023 full schedule set to release tomorrow all eyes on india vs pakistan matches venues ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Asia Cup 2023 Schedule: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపే!.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍‍లపైనే అందరి దృష్టి

Asia Cup 2023 Schedule: ఆసియా కప్ పూర్తి షెడ్యూల్ వచ్చేది రేపే!.. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‍‍లపైనే అందరి దృష్టి

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 13, 2023 03:43 PM IST

Asia Cup 2023 Schedule: ఆసియాకప్ మ్యాచ్‍ల పూర్తి షెడ్యూల్ శుక్రవారం విడుదలవుతుందని తెలుస్తోంది. భారత్, పాకిస్థాన్.. ఏ వేదికలో మ్యాచ్‍లు ఆడతాయోనన్న విషయంపై ఆసక్తి నెలకొని ఉంది.

పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌
పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం, టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌

Asia Cup 2023 Schedule: ఈ ఏడాది ఆసియా కప్ క్రికెట్ టోర్నీపై చాలా ఆసక్తి నెలకొని ఉంది. ఈ టోర్నీ పూర్తి ఆతిథ్యంపై పాకిస్థాన్ పట్టుబట్టగా.. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) మాత్రం హైబ్రిడ్ మోడల్‍లో నిర్వహించేందుకు నిర్ణయించింది. పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరుగుతుందని ప్రకటించింది. ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు ఆసియా కప్ జరుగుతుందని ఏసీసీ ఇటీవల తేదీలు ప్రకటించింది. అయితే, ఇప్పుడు మ్యాచ్‍ల తేదీలతో కూడిన పూర్తి షెడ్యూల్‍ను వెల్లడించేందుకు ఏసీసీ సిద్ధమైంది. రేపు (జూలై 14) ఆసియాకప్ షెడ్యూల్‍ను ఏసీసీ ప్రకటిస్తుందని తెలుస్తోంది. అయితే, ఈ టోర్నీలో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‍లు ఎక్కడ జరుగుతాయన్న దానిపై అందరి దృష్టి ఉంది.

ఆసియాకప్ కోసం పాకిస్థాన్‍కు టీమిండియాను పంపేందుకు బీసీసీఐ నిరాకరించటంతో హైబ్రిడ్ మోడల్‍కు ఏసీసీ నిర్ణయించింది. పాకిస్థాన్‍తో పాటు శ్రీలంకలోనూ టోర్నీ జరపాలని డిసైడ్ అయింది. ఆసియా కప్‍ నిర్వహణకు హైబ్రిడ్ మోడల్‍ను ఆదిలో వ్యతిరేకించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఎట్టకేలకు దిగివచ్చింది. దీనికి అంగీకరించింది. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్‍ను బీసీసీఐ సెక్రటరీ జైషా ఇటీవల దక్షిణాఫ్రికాలోని దర్బన్‍లో కలిశారు. ఆసియా కప్‍పై చర్చించారు. దీంతో శ్రీలంకలో 9 మ్యాచ్‍లు నిర్వహించేందుకు పీసీబీ కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆసియా కప్ పూర్తి షెడ్యూల్‍ను వెల్లడించేందుకు ఏసీసీ సిద్ధమైంది. శ్రీలంకలో పాక్ నాలుగు మ్యాచ్‍లు ఆడనుంది.

చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్.. ఆసియాకప్‍ గ్రూప్ దశలో రెండు మ్యాచ్‍ల్లో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‍లు శ్రీలంకలోని దంబుల్లాలో నిర్వహించేందుకు బీసీసీఐ, పీసీబీ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో దంబుల్లాలో భారత్, పాక్ మ్యాచ్‍లు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఇండియా, పాకిస్థాన్ ఫైనల్ చేరితే.. అది కూడా దంబుల్లా వేదికగా జరగనుంది.

ఈ ఏడాది ఆసియాకప్ వన్డే ఫార్మాట్‍లో ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 17న తేదీ వరకు జరగనుంది. ఇండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ ఈ టోర్నీలో తలపడనున్నాయి. మొత్తంగా 13 మ్యాచ్‍లు ఉంటాయి.

మరోవైపు, ఈ ఏడాది ఆసియా కప్ కోసం టీమిండియా తమ దేశానికి రాకపోతే.. భారత్‍లో జరగబోయే వన్డే ప్రపంచకప్‍కు తమ జట్టును పంపబోమని పాకిస్థాన్‍కు చెందిన ఓ మంత్రి ఇటీవల వ్యాఖ్యలు చేశారు. అయితే, పీసీబీ మాత్రం ఆ వైఖరితో లేనట్టు కనిపిస్తోంది. ఈ ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్‍కు పాక్ జట్టును పంపేందుకే మొగ్గు చూపుతుందని తెలుస్తోంది.

Whats_app_banner