Arshdeep about trolling: అభిమానుల ద్వేషం, ప్రేమ రెండింటిని తీసుకోవాలి.. ట్రోలింగ్‌పై అర్షదీప్ స్పందన-arshdeep singh reaction on fans trolling him ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Arshdeep Singh Reaction On Fans Trolling Him

Arshdeep about trolling: అభిమానుల ద్వేషం, ప్రేమ రెండింటిని తీసుకోవాలి.. ట్రోలింగ్‌పై అర్షదీప్ స్పందన

Maragani Govardhan HT Telugu
Nov 29, 2022 01:04 PM IST

Arshdeep about trolling: టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ తనపై వచ్చిన ట్రోలింగ్‌పై విభిన్నంగా స్పందించాడు. ఆటగాడిగా తనపై వచ్చే ప్రేమ, ద్వేషం రెండింటిని తీసుకోవాలని స్పష్టం చేశాడు.

అర్షదీప్  సింగ్
అర్షదీప్ సింగ్ (AFP)

Arshdeep about trolling: టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్, న్యూజిలాండ్ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ఈ ఏడాది ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా అసిఫ్ అలీ క్యాచ్‌ను జారవిడిచారనే కారణంగా అతడు విపరీతంగా ట్రోల్‌కు గురయ్యాడు. అంతేకాకుండా అతడు ఖలిస్థానీ నేషనల్ క్రికెట్ టీమ్‌లో చేరేందుకు ఎంపికయ్యాడంటూ వికీపీడియా పేజీలోని రావడంతో అతడిపై విమర్శలు తారా స్థాయికి వెళ్లాయి. అయితే వీటన్నింటినీ తన ప్రదర్శనతోనే సమాధానమిచ్చాడు అర్షదీప్. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 3/32 ప్రదర్శనతో తక్కువ వ్యవధిలోనే డెత్ ఓవర్ స్పెషలిస్టుగా ఎదిగాడు. ఫలితంగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

"ప్రజలు మమ్మల్ని, మా ఆటను ఎంతగానో ప్రేమిస్తున్నారు. కాబట్టి మేము బెస్ట్ ప్రదర్శన చేస్తే.. వారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తారు. ఇదే సమయంలో విఫలమైతే అంతే నిరాశను చూపిస్తారు. భారత్ తరఫున మేము ఆడుతున్నాం కాబట్టి వారు తమ భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నారు. అభిమానులకు వారు తమ ప్రేమ, కోపాన్ని వ్యక్తిపరిచే హక్కు ఉంది. కాబట్టి రెండింటినీ మనం అంగీకరించాలి." అని అర్షదీప్ స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో అరంగేట్రంపై అతడు స్పందించాడు. "భారత్ తరఫున వన్డే, టీ20లకు ప్రాతినిధ్యం వహించడం ఏ యువకుడికైనా స్వప్నం సాకారమైనట్లుగా భావిస్తాం. నేను నా జర్నీ సులభంగా ఉందని లేక కష్టంగా ఉందని అనుకోవడం లేదు. ఆటగాళ్లుగా ఆటపై దృష్టి పెట్టి ఆ ప్రక్రియను ఆస్వాదించాలి. సులభం, కష్టం వీటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మేము మా బెస్ట్ ప్రదర్శన చేసినప్పుడు చాలా బాగుంటుంది. ప్రతి మ్యాచ్‌కు మా ఆటతీరును ఉన్నతస్థాయికి తీసుకెళ్తున్నాం. వచ్చే ఏడాదికి నేను ఎక్కడికి చేరాలనేదానిపై ఎక్కువగా ఆలోచించట్లేదు." అని అర్షదీప్ తెలిపాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగతున్న వన్డే సిరీస్‌కు కూడా అర్షదీప్ ఎంపికయ్యాడు. ఈ మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 0-1 తేడాతో వెనుకంజలో ఉంది. తొలి మ్యాచ్‌లో కివీస్ విజయం సాధించగా.. రెండో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. మూడో వన్డే బుధవారం నాడు జరగనుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్