Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా? పోలాండ్‌తో మ్యాచ్‌ డ్రా అయితే ఎలా?-argentina knock out chances in fifa world cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Argentina Knock Out Chances In Fifa World Cup 2022

Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా? పోలాండ్‌తో మ్యాచ్‌ డ్రా అయితే ఎలా?

Hari Prasad S HT Telugu
Nov 30, 2022 02:37 PM IST

Argentina Knock out chances: అర్జెంటీనా నాకౌట్‌ స్టేజ్‌కు వెళ్తుందా.. ఇప్పుడందరిలోనూ ఇదే సందేహం. తొలి మ్యాచ్‌లోనే సౌదీ చేతుల్లో ఓడినా.. తర్వాత మెక్సికోపై గెలిచి నిలిచిన ఆ టీమ్‌కు పోలాండ్‌ రూపంలో బుధవారం (నవంబర్ 30) మరో పరీక్ష ఎదురు కానుంది.

చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో అర్జెంటీనా
చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో అర్జెంటీనా (REUTERS)

Argentina Knock out chances: ఫిఫా వరల్డ్‌కప్‌ నాకౌట్‌ స్టేజ్‌ దగ్గరవుతున్న కొద్దీ ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, పోర్చుగల్‌లాంటి టీమ్స్ రౌండ్‌ ఆఫ్‌ 16కు అర్హత సాధించాయి. అటు గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి నుంచి నెదర్లాండ్స్‌, సెనెగల్, ఇంగ్లండ్, యూఎస్‌ఏ కూడా నాకౌట్‌ రౌండ్‌లో అడుగుపెట్టాయి.

ట్రెండింగ్ వార్తలు

ఇక బుధవారం(నవంబర్‌ 30) గ్రూప్‌ సి, గ్రూప్‌ డిలోని టీమ్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. బుధవారంతో ఈ రెండు గ్రూప్‌లలోని టీమ్స్‌ తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లను ఆడబోతున్నాయి. వీటిలో అర్జెంటీనా కూడా ఉంది. ఆ టీమ్‌కు పోలాండ్‌ రూపంలో అగ్ని పరీక్ష ఎదురు కాబోతోంది.

అర్జెంటీనా క్వాలిఫై అవుతుందా?

బుధవారం జరగబోయే మ్యాచ్‌లలో అందరి కళ్లూ అర్జెంటీనా, మెస్సీపైనే ఉన్నాయి. ఆ టీమ్‌ తర్వాతి రౌండ్‌కు అర్హత సాధిస్తుందా లేక తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పడుతుందా అన్నది తేలనుంది. గ్రూప్‌ సిలో టాపర్‌గా ఉన్న పోలాండ్‌తో చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిస్తేనే అర్జెంటీనా రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌ డ్రా అయితే పోలాండ్‌ రౌండ్‌ ఆఫ్‌ 16కు వెళ్తుంది.

అటు అర్జెంటీనా మాత్రం మరో మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. సౌదీ అరేబియాను మెక్సికో ఓడించాలి. అదే సమయంలో గోల్‌ డిఫరెన్స్‌తో అర్జెంటీనా కంటే మెక్సికో వెనుక ఉండాలి. లేదంటే ఈ ఇద్దరి మ్యాచ్‌ డ్రా కావాలి. సౌదీ అరేబియా నాకౌట్‌కు చేరాలంటే కచ్చితంగా మెక్సికోను ఓడించాలి. మెక్సికో రౌండ్‌ ఆఫ్‌ 16 చేరాలంటే సౌదీని ఓడించడంతోపాటు అటు అర్జెంటీనాను పోలాండ్‌ ఓడించాల్సి ఉంటుంది. అదే సమయంలో అర్జెంటీనా కంటే గోల్స్‌ డిఫరెన్స్‌లో పైచేయి సాధించాలి.

ఆ లెక్కన చూస్తే అర్జెంటీనాకు ఇది అగ్ని పరీక్షే అవుతుంది. ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండా నాకౌట్‌ చేరాలంటే పోలాండ్‌ను కచ్చితంగా ఓడించాల్సి ఉంటుంది. అయితే అది అంత సులువైన పనిలా కనిపించడం లేదు. తొలి మ్యాచ్‌లో సౌదీ చేతుల్లో ఓడటం అర్జెంటీనా అవకాశాలను సంక్లిష్టం చేసిన విషయం తెలిసిందే.

WhatsApp channel