Fifa World Cup Argentina vs Poland: పోలాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం - నాకౌట్ చేరుకున్న మెస్సీ సేన
Fifa World Cup Argentina vs Poland: ఫిఫా వరల్డ్ కప్ 2022లో బుధవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో పోలాండ్‌పై 2-0 తేడాతో అద్భుత విజయాన్ని సాధించిన అర్జెంటీనా నాకౌట్ చేరుకున్నది. అర్జెంటీనా తరఫున మెక్ అలిస్టర్, జూలియన్ అల్వరెజ్ గోల్స్ చేశారు.
Fifa World Cup Argentina vs Poland: ఫిఫా వరల్డ్ కప్ 2022లో నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా అద్భుత పోరాట పఠిమను కనబరిచింది. బుధవారం అర్ధరాత్రి పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్ సీలో ఆరు పాయింట్లతో టాపర్‌గా నిలిచింది అర్జెంటీనా. నాకౌట్ రౌండ్‌లో ఆస్ట్రేలియాతో పోరుకు సిద్ధమైంది.
అర్జెంటీనా - పోలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫస్ట్ హాఫ్ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. తొలి అర్ధభాగంలో మెస్సికీ ఓ పెనాల్టీ కిక్ లభించింది. మెస్సీ గోల్‌తో అర్జెంటీనా బోణీ చేయడం ఖాయమని అభిమానులు భావించారు.
కానీ పోలాండ్ గోల్ కీపర్ స్కజెన్సీ అద్భుతంగా మెస్సీ పెనాల్టీ కిక్‌ను అడ్డుకొని అర్జెంటీనా ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. సెకండాఫ్ ప్రారంభమైన కొద్ది సేపటికి మెక్ అలిస్టర్ తొలి గోల్ చేసి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 67వ నిమిషంలో జూలియన్ అల్వరెజ్ గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కు పెంచాడు.
గోల్ చేసేందుకు పోలాండ్ గట్టిగానే ప్రయత్నాలు చేసింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్జినెజ్… పోలాండ్ ప్రయత్నాల్ని అద్భుతంగా అడ్డుకున్నాడు.ఈ మ్యాచ్‌లో ఓడినా పోలాండ్ నాకౌట్‌కు చేరుకున్నది. నాకౌట్ రౌండ్ లో మాజీ చాంఫియన్ ఫ్రాన్స్‌తో పోలాండ్త లపడనుంది.
మారడోనా రికార్డ్ బ్రేక్ చేసిన మెస్సీ
పోలాండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా రికార్డ్‌ను మెస్సీ బ్రేక్ చేశాడు. వరల్డ్ కప్‌లో అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడిన తొలిప్లేయర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డ్ మారడోనా పేరు మీద ఉంది. వరల్డ్ కప్‌లో మారడోనా 21 మ్యాచ్‌లకు ప్రాతినిథ్యం వహించాడు.పోలాండ్ మ్యాచ్ ద్వారా మెస్సీ మారడోనా రికార్డ్‌ను బ్రేక్ చేశాడు.
మొత్తంగా మెస్సీకి ఇది ఐదో వరల్డ్ కప్ కావడం గమనార్హం. మెక్సికోతో జరిగిన గత మ్యాచ్ ద్వారా వరల్డ్ కప్‌లో గోల్ చేసిన అత్యధిక వయస్కుడైన (35 సంవత్సరాల 155 రోజులు) ఆటగాడిగా మెస్సీ నిలిచాడు. అంతేకాకుండా వరల్డ్ కప్‌లో గోల్ చేసిన పిన్న వయస్కుడైన ప్లేయర్ (18 సంవత్సరాల 357 రోజులు) రికార్డ్ మెస్సీ పేరు మీదనే ఉంది. 2006 వరల్డ్ కప్ లో సెర్బియా పై గోల్ చేశాడు మెస్సీ.