Apple to buy Manchester United: మాంచెస్టర్ యునైటెడ్‌ను కొనుగోలు చేయనున్న ఆపిల్!
Apple to buy Manchester United: మాంచెస్టర్ యునైటెడ్‌ను ప్రముఖ సంస్థ ఆపిల్ కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ఈ పాపులర్ ఫుట్‌బాల్ క్లబ్‌ను ప్రస్తుత ఓనర్లు అమ్మకానికి పెట్టిన విషయం తెలిసిందే.

Apple to buy Manchester United: ప్రపంచంలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్స్‌లో ఒకటి మాంచెస్టర్ యునైటెడ్. ఈ క్లబ్‌కు ఎంతో చరిత్ర ఉంది. అయితే ఈ మధ్య కాలంలో చాలా వరకూ నెగటివ్‌గానే వార్తల్లో నిలుస్తోంది. క్లబ్‌పై ప్రముఖ ప్లేయర్ రొనాల్డో సంచలన ఆరోపణలు చేయడం, ఆ తర్వాత క్లబ్ అతనికి ఉద్వాసన పలకడం, ఏకంగా క్లబ్‌నే అమ్మకానికి పెట్టడం ఆశ్చర్యం కలిగించింది.
ఇక తాజాగా ఈ క్లబ్‌ను ప్రముఖ సంస్థ ఆపిల్ కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు వస్తున్న వార్తలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుత ఓనర్లు గ్లేజర్ ఫ్యామిలీ తాము క్లబ్‌ను అమ్మకానికి పెట్టినట్లు చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆపిల్ రేసులో ఉన్నట్లు డైలీ స్టార్ రిపోర్ట్ చేసింది. ఈ క్లబ్‌ను పాక్షికంగా అమ్మడం లేదా స్టేడియం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పెట్టుబడులు వంటి అంశాన్ని కూడా ఈ కుటుంబం పరిశీలిస్తోంది.
క్లబ్‌కు ఏది మంచి చేసే అన్ని అవకాశాలను తాము పరిశీలిస్తామని అవ్రమ్ గ్లేజర్, జోయెల్ గ్లేజర్ చెప్పారు. అయితే క్లబ్ కొనుగోలు రేసులో ఆపిల్ సంస్థ ఉండటమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే ఈ ప్రతిష్టాత్మక సంస్థకు ఇప్పటి వరకూ ఫుట్‌బాల్ ప్రపంచంలో ఏమాత్రం అనుభవం లేదు. అయినా ఆపిల్ సీఈవో టిమ్ కుక్ మాత్రం యునైటెడ్ కొనుగోలు అంశాన్ని సీరియస్‌గా పరిశీలిస్తున్నారు.
ఒకవేళ ఆపిల్ డీల్ సెట్ అయితే మాత్రం మాంచెస్టర్ యునైటెడ్ ప్రపంచంలోనే రిచెస్ట్ క్లబ్‌గా అవతరించనుంది. పీఎస్‌జీ, న్యూకాజిల్ యునైటెడ్, మాంచెస్టర్ సిటీలాంటి క్లబ్స్‌ను వెనక్కి నెట్టనుంది. ఆపిల్ ఇప్పటికే యునైటెడ్ క్లబ్ అమ్మకానికి సంబంధించి పలు బ్యాంకులతో చర్చలు కూడా జరుపుతోంది.
చాలా కాలంగా మాంచెస్టర్ యునైటెడ్ ఫ్యాన్స్ ఓనర్లపై ఆగ్రహంతో ఉన్నారు. ఐదేళ్లుగా ఈ క్లబ్ ఒక్క ట్రోఫీ కూడా గెలవకపోవడానికి ఇప్పుడున్న ఓనర్లే కారణమన్నది ఫ్యాన్స్ ఫీలింగ్. 2017లో చివరిసారి మాంచెస్టర్ యునైటెడ్ యురోపా లీగ్ ట్రోఫీ గెలిచింది.