టీమిండియా U19 జట్టు వైస్‌కెప్టెన్ షేక్ రషీద్‌కు రివార్డ్ ప్రకటించిన సీఎం జగన్
భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశాడు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. అంతేకాకుండా ఏపి ప్రభుత్వం తరఫున పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు.

Vijayawada | భారత క్రికెట్ అండర్-19 జట్టు వైస్ కెప్టెన్ షేక్ రషీద్ బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశాడు. ఈ సందర్భంగా షేక్ రషీద్‌ను సీఎం జగన్ అభినందించారు. అంతేకాకుండా ఏపి ప్రభుత్వం తరఫున పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 10 లక్షల రివార్డుతో పాటు, గుంటూరులో నివాస స్థలం కేటాయించారు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తికాగానే రషీద్‌కు సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇంకా ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలైనా అందిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రకటించిన రూ. 10 లక్షల చెక్‌ను సీఎం తన చేతుల మీదుగా రషీద్‌కు అందించారు.
ఆంధ్రా నుంచి అంతర్జాతీయ స్థాయికి..
యువ తెలుగు తేజం షేక్ రషీద్ స్వస్థలం గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలంలోని పాతమల్లాయపాలెం గ్రామం. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన 17 ఏళ్ళ రషీద్ భారత కికెట్ అండర్19 జట్టులో చోటు సంపాదించడమే కాకుండా, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ క్రికెట్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. వైస్ కెప్టెన్ గా టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, ఇటీవల జరిగిన ఐసీసీ క్రికెకెట్ అండర్-19 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో అద్భుతంగా రాణించాడు. ఫైనల్‌లో కూడా 50 పరుగుల స్కోరుతో అదరగొట్టాడు. భారత్ అండర్-19 ప్రపంచ కప్ టైటిల్‌ను ఐదోసారి గెలుచుకోవడంలో రషీద్ కీలక పాత్ర పోషించాడు.
ప్రపంచ కప్ ముగిసిన అనంతరం వెస్ట్ ఇండీస్ నుంచి ఇటీవలే భారత్ చేరుకున్న రషీద్, త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌ని మర్యాదపూర్వకంగా కలుస్తానని తెలిపాడు. ఈ క్రమంలోనే ఈరోజు సీఎంను ఆయన క్యాంప్ ఆఫీసులో కలిశాడు. అండర్-19 ప్రపంచకప్ ఆడడం గొప్ప అనుభవమని పేర్కొన్నాడు.
ప్రస్తుతం రషీద్ ఆంధ్రా జట్టు తరఫున తిరువనంతపురంలొ జరుగుతున్న రంజీ ట్రోఫి మ్యాచుల్లో ఆడనున్నాడు.