Anil Kumble Broken Jaw: దవడ విరిగినా కట్టుతో బౌలింగ్.. విండీస్‌పై వీరోచిత స్పెల్ గుర్తు చేసుకున్న కుంబ్లే
Anil Kumble Broken Jaw: దవడ విరిగినా కట్టుతో బౌలింగ్ చేశాడు అనిల్ కుంబ్లే. విండీస్‌పై ఒకప్పుడు తాను వేసిన వీరోచిత స్పెల్ ను అతడు గుర్తు చేసుకున్నాడు.
Anil Kumble Broken Jaw: వెస్టిండీస్ తో ఇండియా మరో టెస్టు సిరీస్ కు సిద్ధమైన వేళ ఆ టీమ్ పై 21 ఏళ్ల కిందట తాను వేసిన వీరోచిత స్పెల్ ను టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే గుర్తు చేసుకున్నాడు. దవడ నుంచి తలపైకి కట్టుతో కుంబ్లే బౌలింగ్ చేసిన ఆ ఫొటోలు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.
2002లో జరిగిన ఆంటిగ్వా టెస్టులో కుంబ్లే ఇలా తీవ్ర గాయంతోనూ బౌలింగ్ చేశాడు. అయితే ఆ సమయంలో తాను అలా బౌలింగ్ చేస్తానని చెబితే తన భార్య చేతన నమ్మలేదని, జోక్ చేస్తున్నానని అనుకున్నట్లు కుంబ్లే చెప్పాడు.
ఇక తన కెరీర్లో బ్రియాన్ లారాకు బౌలింగ్ చేయడం తనకు చాలా కష్టంగా అనిపించిందని కూడా ఈ సందర్భంగా కుంబ్లే తెలిపాడు. అయితే ఆ ఆంటిగ్వా టెస్టులో మాత్రం లారాపై కుంబ్లే పైచేయి సాధించాడు. దవడ విరిగినా వరుసగా 14 ఓవర్లు వేసి లారాను ఔట్ చేశాడు.
జోక్ చేశానని అనుకుంది
"నా భార్య చేతనకు ఫోన్ చేసి చెప్పాను. ఆమెతో మాట్లాడినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు సర్జరీ అవసరం అని చెప్పాను. దానికోసం ఆమె ఏర్పాట్లు చేసింది. అయితే తాను అలాగే బౌలింగ్ చేయబోతున్నానని చెబితే ఆమె నమ్మలేదు. జోక్ చేస్తున్నానని అనుకుంది" అని జియో సినిమాలో మాట్లాడుతూ కుంబ్లే చెప్పాడు.
అలాంటి సమయంలోనూ టీమ్ అవసరాల కోసం తాను బౌలింగ్ చేయాలని అనుకున్నట్లు కుంబ్లే తెలిపాడు. "నేను డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లినప్పుడు సచిన్ బౌలింగ్ చేయడం చూశాను. ఆ సమయంలో వేవెల్ హిండ్స్ బ్యాటింగ్ చేస్తున్నట్లున్నాడు. అప్పుడే ఇది నాకు ఛాన్స్ అనుకున్నాను.
వెళ్లి రెండు వికెట్లు తీయాలని భావించాను. అలా చేస్తే వెస్టిండీస్ ను ఓడించే అవకాశం ఉందని అనుకున్నాను. దీంతో ఆండ్రూ లీపస్ కి నన్ను రెడీ చేయాలని చెప్పాను. నా వంతు ప్రయత్నం చేశానన్న సంతృప్తితో నేను ఇంటికి తిరిగి వెళ్తాను అని అనిపించింది" అని కుంబ్లే చెప్పాడు.
ఆ టెస్టులో ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన కుంబ్లే.. మెర్విన్ డిల్లాన్ వేసిన షార్ట్ బాల్ కు గాయపడ్డాడు. వెంటనే అతని నోటి నుంచి రక్తం వచ్చింది. అయితే అతడు మరో 20 నిమిషాల పాటు అలాగే బ్యాటింగ్ చేశాడు. ఆ తర్వాత స్కానింగ్ లో గాయం తీవ్రత తెలిసి సర్జరీ తప్పనిసరి అని తేలినా.. కుంబ్లే మాత్రం కట్టు కట్టుకొని బౌలింగ్ కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు.