క్రిస్టియానో రొనాల్డో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లబ్ లకు స్టార్ అట్రాక్షన్ గా కొనసాగుతున్నాడు. అతని కోసం క్లబ్ లు పోటీపడుతున్నాయి. ప్రస్తుతం సౌదీ ప్రో లీగ్ జట్టు అల్ నాసర్ క్లబ్ తరపున రొనాల్డో ఆడుతున్నాడు. ఈ క్లబ్ తో అతని కాంట్రాక్టస్ ముగిసేందుకు చివరి దశలో ఉంది. దీంతో రొనాల్డో కోసం క్లబ్ లు క్యూ కడుతున్నాయి. కానీ అల్ నాసర్ క్లబ్.. రొనాల్డోను వదులుకునేందుకు సిద్ధంగా లేదని తెలిసింది.
రొనాల్డో ను తమ జట్టులో ఆడించేందుకు బ్రెజిల్ లీగ్ కు చెందిన పోర్చుగీసా జట్టు ఇంట్రస్ట్ చూపిస్తోంది. పౌలిస్టా ఏ1 జట్టు పోర్చుగీసా ఇందుకోసం ప్రయత్నాలు చేస్తోందని తెలిసింది. పోర్చుగీస్ దేశానికి చెందిన రొనాల్డోను పోర్చుగీసా క్లబ్ కు ఆడించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1000 ఫ్రొఫెషనల్ గోల్స్ సాధించాలనే లక్ష్యంతో ఉన్న రొనాల్డో.. ఇప్పటివరకూ 925 గోల్స్ సాధించాడు.
రొనాల్డోను తమ జట్టులో చేరేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని పోర్చుగీస్ చీఫ్ అలెక్స్ బూర్జువా పేర్కొన్నాడు. బ్రెజిల్ లో పోర్చుగీస్ కమ్యూనిటీని చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ‘‘బ్రెజిల్లోని పోర్చుగీస్ కమ్యూనిటీ గౌరవాన్ని బలోపేతం చేయడం, రక్షించడం లక్ష్యం. 2026 సీజన్ కోసం గొప్ప పోర్చుగీస్ ఆటగాణ్ని (రొనాల్డో) రప్పించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సీఎన్ఎన్ తో అలెక్స్ బూర్జువా తెలిపాడు.
మరోవైపు అల్ నాసర్ తో కొనసాగేందుకే రొనాల్డో ఆసక్తి చూపిస్తున్నాడని తెలిసింది. తన కాంట్రాక్ట్ ను పొడిగించుకుంటాడని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని టాక్. ఇందు కోసం రొనాల్డో ఏడాదికి ఏకంగా 183 మిలియన్ యూరోలు (సుమారు రూ.1672 కోట్లు) తీసుకోబోతున్నాడని వివిధ రిపోర్ట్ లు వెల్లడిస్తున్నాయి. 2022లో అల్ నాసర్ క్లబ్ తో రొనాల్డో చేరాడు.
రొనాల్డో ఇప్పటివరకూ రియల్ మాడ్రిడ్, మాంచెస్టర్ యునైటెడ్, జువెంచస్, అల్ నాసర్, స్పోర్టింగ్ సీపీ జట్ల తరపున ఆడాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్లో పోర్చుగీస్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. రియల్ మాడ్రిడ్ తరపున 450 గోల్స్ చేసిన రొనాల్డో.. మాంచెస్టర్ యునైటెడ్ జట్టుకు ఆడుతూ 145 గోల్స్ సాధించాడు. పోర్చుగల్ కు 135, జువెంచస్ కు 101, అల్ నాసర్ కు 89, స్పోర్టింగ్ సీపీకి 5 గోల్స్ అందించాడు. మోస్ట్ గోల్స్ రికార్డు 40 ఏళ్ల రొనాల్డోదే.
సంబంధిత కథనం