Agarkar on Kohli: పరుగులు చేయడానికి ఈ పిచ్ గొప్ప అవకాశం.. అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు-ajit agarkar says ahmedabad pitch a great opportunity for virat kohli ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Ajit Agarkar Says Ahmedabad Pitch A Great Opportunity For Virat Kohli

Agarkar on Kohli: పరుగులు చేయడానికి ఈ పిచ్ గొప్ప అవకాశం.. అగార్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
Mar 10, 2023 09:36 PM IST

Agarkar on Kohli: పరుగులు చేయడానికి అహ్మదాబాద్ పిచ్ గొప్ప అవకాశమని అజిత్ అగార్కర్ స్పష్టం చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పుంజుకోడానికి ఇది మంచి అవకాశమని అన్నారు. ఈ మ్యాచ్‌లో ప్రస్తుతానికైతే ఆస్ట్రేలియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

భారత్-ఆస్ట్రేలియా
భారత్-ఆస్ట్రేలియా (PTI)

Agarkar on Kohli: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీల్లో ఇప్పటి వరకు పిచ్‌లపై విమర్శలు తలెత్తడంతో నాలుగో టెస్టులో మాత్రం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించేలా తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. దీంతో వరుసగా విఫలమవుతున్న భారత బ్యాటర్లకు ఇదే మంచి అవకాశమని టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ అభిప్రాయపడ్డారు. టాపార్డర్ పుంజుకోవాల్సిన తరుణమని, ముఖ్యంగా విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేసేందుకు దీన్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

"ఈ సిరీస్‌లో భారత జట్టు పెద్దగా పరుగులు చేయలేదు. ముఖ్యంగా ఇండియన్ టాపార్డర్‌లో రోహిత్ శర్మ నాగ్‌పుర్ సెంచరీ మినహా మిగిలిన వారు పెద్దగా రాణించలేదు. కాబట్టి టాపార్డర్ భారీగా పరుగులు చేయాలి. లోవర్ ఆర్డర్, లోవర్ మిడిల్ ఆర్డర్ మెరుగైన ప్రదర్శన చేశారు కాబట్టి టాపార్డర్‌కు ఇది గొప్ప అవకాశం. ఈ రోజు ఓపెనర్ల ఆరంభం బాగుంది. రేపు కూడా ఇలాగే మెరుగ్గా ప్రారంభించాలి. పరుగులు సాధించేందుకు ఇంతకంటే మెరుగైన పరిస్థితులు దొరకవు." అని అజిత్ అగార్కర్ అన్నారు. కోహ్లీ పుంజుకోడానికి ఇదే మంచి అవకాశమని స్పష్టం చేశారు.

"టాప్-4లో భాగమైన విరాట్ కోహ్లీకి కూడా ఇదే మంచి అవకాశం. ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారని నన్ను అడిగితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టి ఆస్ట్రేలియా అనే చెబుతాను. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు బాగా ఆడితే.. వారికి కూడా గెలిచే అవకాశముంటుంది." అని అగార్కర్ తెలిపారు.

అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా 480 పరుగుల భారీ స్కోరు చేసింది. రెండు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ బ్యాటర్లు పట్టుదలతో ఆడారు. ఈ రెండు రోజుల్లో కలిపి రెండు సెషన్లలో కనీసం ఒక్క వికెట్ కూడా పడలేదు. వికెట్ల కోసం భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆసీస్ బ్యాటర్లు నిలకడగా ఆడారు. ముఖ్యంగా ఉస్మాన్ ఖవాజా(180) భారీ సెంచరీ బాదగా.. అతడి మార్గంలోనే కామెరూన్ గ్రీన్ టెస్టుల్లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. వీరిద్దరి ధాటికి ఆసీస్ భారీ స్కోరు చేసింది. రెండో రోజు కాసేపట్లో ముగిస్తుందనగా ఆస్ట్రేలియా 480 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ రోజు ఆట ముగిసే సమయానికి బ్యాటింగ్‌కు భారత్ వికెట్ కోల్పోకుండా 36 పరుగులు చేసింది. రోహిత్(17), శుబ్‌మన్ గిల్(18) క్రీజులో ఉన్నారు.

WhatsApp channel