Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్
Ajit Agarkar: టీమిండియా చీఫ్ సెలక్టర్‌గా అజిత్ అగార్కర్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం (జులై 4) వెల్లడించింది. గతంలోనూ అతడు ఈ పదవి కోసం ప్రయత్నించాడు.
Ajit Agarkar: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ చీఫ్ సెలక్టర్ అయ్యాడు. 45 ఏళ్ల అగార్కర్ ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు మంగళవారం (జులై 4) బీసీసీఐ వెల్లడించింది. గత ఫిబ్రవరి నెలలో చేతన్ శర్మ రాజీనామా తర్వాత ఖాళీగా ఉన్న ఈ పదవిలో మొత్తానికి బోర్డు అగార్కర్ ను నియమించింది. అతడు ఈ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడే ఈసారి పదవి వరించడం ఖాయమన్న వార్తలు వచ్చాయి.
శివ సుందర్ దాస్, సలీల్ అంకోలా, సుబ్రతో బెనర్జీ, శరత్ లతో కూడిన సెలక్షన్ కమిటీలో తాజాగా అగార్కర్ చేరనున్నాడు. టీమిండియా తరఫున 191 వన్డేలు, 26 టెస్టులు ఆడిన అగార్కర్ మొదటి నుంచీ ఈ పదవికి ఫేవరెట్ గా ఉన్నాడు. అతన్ని గత శనివారం క్రికెట్ అడ్వైజరీ కమిటీలోని సులక్షన నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే ఇంటర్వ్యూ చేశారు.
అగార్కర్ ఇండియా తరఫున మొత్తం 349 వికెట్లు తీసుకున్నాడు. 2017 నుంచి 2019 మధ్య ముంబై టీమ్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గానూ అగార్కర్ ఉన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ గా పని చేసినా.. ఈ మధ్యే దాని నుంచి తప్పుకున్నాడు. అప్పుడే అగార్కర్ కు చీఫ్ సెలక్టర్ పదవి ఖాయమని అనుకున్నారు.
అగార్కర్ నేతృత్వంలో వెస్టిండీస్ తో జరగబోయే టీ20 సిరీస్ కు టీమిండియాను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే వన్డే, టెస్ట్ టీమ్స్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ సమయానికి టీమిండియాను సిద్ధం చేయడం అగార్కర్ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉండనుంది. అగార్కర్ ఇండియా తరఫున 1997, 2007 మధ్య పని చేశాడు.
ఇండియా తరఫున వన్డేల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రికార్డు అగార్కర్ పేరిటే ఉంది. అతడు కేవలం 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక బౌలింగ్ లో ఇన్‌స్వింగర్స్ బాగా వేస్తాడని పేరుంది. వన్డేల్లో 23 మ్యాచ్ లలోనే 50 వికెట్లు తీసి రికార్డు క్రియేట్ చేశాడు. ఆ తర్వాత అతని రికార్డును శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ బ్రేక్ చేశాడు.