Age Importance in T20 World Cups: వయస్సు వైన్ లాంటిది.. ఎంత తాగితే అంత కిక్.. మరి మనోళ్లు కిక్ ఇస్తారా.. కక్కేస్తారా?-age importance in t20 world cups and look at india average over the years ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Age Importance In T20 World Cups And Look At India Average Over The Years

Age Importance in T20 World Cups: వయస్సు వైన్ లాంటిది.. ఎంత తాగితే అంత కిక్.. మరి మనోళ్లు కిక్ ఇస్తారా.. కక్కేస్తారా?

Maragani Govardhan HT Telugu
Oct 15, 2022 12:21 PM IST

Age Importance in T20 World Cups: టీ20 వరల్డ్ కప్‌కు ఎంపికైన టీమిండియా జట్టు సగటు వయస్సు ఈ సారి ఎక్కువగా ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వయస్సు పెరిగినా ఆట తీరు మాత్రం మారదని మన క్రికెటర్లు నిరూపిస్తున్నారు.

టీ20 ప్రపంచకప్ భారత జట్టు
టీ20 ప్రపంచకప్ భారత జట్టు (BCCI Twitter)

Age Importance in T20 World Cups: ఆటగాళ్ల వయస్సు పెరుగుతున్న కొద్ది ఫామ్ తగ్గుతుంది.. ఇంతకుముందు జోరు కొనసాగించలేరు.. ఇక రిటైర్మెంట్ దిశగా వెళ్లాల్సిందే.. తరచూ క్రికెట్ ఈ మాటలు వింటూ ఉంటాం. అయితే వయస్సు అనేది కేవలం ఓ సంఖ్య మాత్రమే.. ఆటకు, ఏజ్‌కు అస్సలు సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు నిరూపించారు కూడా. కానీ ఎప్పటికప్పుడూ ఈ విషయంపై చర్చ వస్తూనే ఉంది. తాజాగా 2022 టీ20 ప్రపంచకప్ కోసం ఎంపికైన భారత జట్టులో ఆటగాళ్ల వయస్సు గురించి చర్చ నడుస్తుంది. దీనికి ప్రధాన కారణంగా టీమిండియా ఆటగాళ్ల సగటు వయస్సు వచ్చేసి 30.6 సంవత్సరాలు ఉండటమే. ఇప్పటి వరకు పొట్టి ప్రపంచకప్‌లో ఆడిన టీమిండియా ఆటగాళ్ల వయస్సు కంటే ఇదే అత్యధికం.

ట్రెండింగ్ వార్తలు

టీ20 వరల్డ్ కప్ జట్టు ఆటగాళ్ల వయస్సు..

గతంతో పోలిస్తే ఈ సారి ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. 15 మంది సభ్యుల టీమ్‌లో దినేశ్ కార్తిక్(37) అందరి కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉన్నాడు. అత్యల్ప వయస్కుడిగా అర్ష్‌దీప్ సింగ్ 23 ఏళ్ల వయస్సుతో ఉన్నాడు. ఒక్క దినేశ్ కార్తికే కాకుండా మూడు పదుల కంటే ఎక్కువ వయస్సున్న వారు జట్టులో చాలా మంది ఉన్నారు. విరాట్ కోహ్లీ(33), రోహిత్ శర్మ(35), రవిచంద్రన్ అశ్విన్(36), సూర్యకుమార్ యాదవ్(32), భువనేశ్వర్ కుమార్(32) మూడు పదుల వయస్సును దాటారు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించిన అతిపెద్ద ఆటగాడు. 2016లో ఎంఎస్ ధోనీ(34)ని అధిగమించాడు.

పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా సగటు వయస్సు పెరుగుదల..

2007 ప్రపంచకప్‌ను గెలిచిన భారత జట్టు సగటు వయస్సు 23.6 సంవత్సరాలు కాగా.. 2009లో టీమిండియా సగటు వయస్సు 24.2 సంవత్సరాలు. 2010కి వచ్చేసరికి ఈ సంఖ్య 25.8 సంవత్సరాలుగా ఉంది. 2012లో ఈ సంఖ్య 28 ఏళ్లకు పెరిగింది. 2014లో ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన టీమిండియా సగటు వయస్సు 26.8 సంవత్సరాలు కాగా.. 2016లో ఈ సంఖ్య 28.3కి చేరింది. 2021లో భారత సగటు వయస్సు 28.9కి చేరింది. ఈ సారి మాత్రం టీమిండియా ఆటగాళ్ల సగటు వయస్సు పెరిగింది. 30.6 సంవత్సరాలతో మూడు పదుల వయస్సు అడ్డంకిని అధిగమించారు.

అయితే చరిత్రను ఓ సారి పరిశీలిస్తే.. పొట్టి ప్రపంచకప్‌లో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన యువకులు జట్టులో ఉన్నప్పుడే వచ్చింది. 2007లో భారత ఆటగాళ్ల వయస్సు అన్నింటికంటే తక్కువ కాగా.. 2014 రన్నరప్ టీమ్ సగటు వయస్సు కూడా 26.8 సంవత్సరాలే కావడం విశేషం. అయితే ఈ సారి భారత జట్టు వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ అభిమానులు మాత్రం ఆశాభావంతో ఉన్నారు. భారత జట్టు చక్కటి వైన్‌లా మారుతుందని ఆశిస్తున్నారు. విరాట్ కోహ్లీ ఆరేళ్ల క్రితం ఎలాగైతే ఫిట్‌గా ఉన్నాడో ఇప్పటికీ అలాగే ఉండటం గమనార్హం. వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీస్తూ ఆకట్టుకుంటున్నాడు. సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీల కోణంలో అదిరిపోయే షాట్లు ఆడుతున్నాడు. కాబట్టి వయస్సు ప్రతిభకు కొలమానం కాదని వీరు నిరూపితమవుతోంది.

అనుభవజ్ఞులున్నా యువకులు ఉంటే మంచిది..

ఆటగాళ్లు ఎంత బాగా ఆడుతున్నప్పటికీ జట్టులో యువకులు ఉండాలని అనేక వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ జట్టులో స్టార్ ఆటగాళ్లతో పాటు అర్ష్‌దీప్ సింగ్ లాంటి యువ ఆటగాళ్లు కూడా ఉన్నారు. మెజార్టీ ప్లేయర్లు సీనియర్లు ఉన్నప్పటికీ.. యువ ఆటగాళ్లతో సమతూల్యంగా ఉంది. దినేశ్ కార్తిక్ వయస్సు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అతడు అదిరిపోయే రీతిలో ఆడుతున్నాడు. మంచి ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫినిషర్‌గా అతడు కాకుండా మరొకరిని చూడలేమన్నంతా స్థాయిలో ఆకట్టుకుంటున్నాడు.

గతంతో పోలిస్తే భారత జట్టు సగటు వయస్సు ఎక్కువగా ఉండటం వారి ప్రద్శనలపై ఎలాంటి ప్రభావం చూపకూడదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి ఇతర జట్లు కూడా 30 ఏళ్ల సగటు వయస్సును కలిగి ఉన్నాయి. జట్టు వ్యూహాలు కూడా వీరిపైనే ఆధారపడి ఉన్నాయి. అందువల్ల భారత జట్టులో కొన్ని గాయాలు ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్నందున వయస్సు పట్టింపు లేదు. అంతేకాకుండా తన ప్రత్యర్థులపై మైదానంలోకి దిగినప్పుడు వారి ఎలాంటి ఒత్తిడి, శారీరక సమస్యలు లేకుండా సమర్థవంతంగా ఆడగలరు.

WhatsApp channel

సంబంధిత కథనం