Agarkar to meet Rohit: వెస్టిండీస్‌లో రోహిత్, ద్రవిడ్‌లను కలవనున్న అగార్కర్.. వరల్డ్‌కప్ టీమ్ అక్కడే ఎంపిక చేసేస్తారా?
Agarkar to meet Rohit: వెస్టిండీస్‌లో రోహిత్, ద్రవిడ్‌లను కలవనున్నాడు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్. దీంతో వరల్డ్‌కప్ టీమ్ అక్కడే ఎంపిక చేసేస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Agarkar to meet Rohit: టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. వెస్టిండీస్ వెళ్తున్నాడు. ప్రస్తుతం అక్కడే ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ లతోపాటు ఇతర సీనియర్ టీమ్ మేనేజ్‌మెంట్ ను అతడు కలవనున్నాడు. ఇండియాలో జరగబోతున్న వరల్డ్ కప్ కు మరో రెండున్నర నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆ మెగా టోర్నీకి టీమ్ ఎంపికపై అనుసరించాల్సిన వ్యూహంపై వీళ్లు చర్చించనున్నారు.
ట్రెండింగ్ వార్తలు
దీంతోపాటు బుమ్రా కమ్‌బ్యాక్, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ పై కూడా వీళ్ల మధ్య చర్చ జరగనుంది. ఇండియన్ టీమ్ ప్రస్తుతం వెస్టిండీస్ తో రెండో టెస్టు కోసం ట్రినిడాడ్ లో ఉంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 141 పరుగులతో గెలిచిన టీమిండియా.. రెండో టెస్టుకు కాన్ఫిడెంట్ గా సిద్ధమైంది. అయితే ఈ టెస్ట్ సిరీస్ తర్వాత మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
ఆ 20 మంది ఎవరు?
వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వన్డే సిరీస్ లో సీనియర్ ప్లేయర్స్ అందరూ ఆడనున్నారు. అయితే అంతకుముందే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్.. కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ లతో నేరుగా చర్చించనున్నాడు. వరల్డ్ కప్ కోసం ఎంపిక చేయాల్సిన టీమ్ కోసం మొదట 20 మంది కోర్ ప్లేయర్స్ గ్రూప్ ను గుర్తించాల్సి ఉంది.
దీనిపై ఈ ముగ్గురూ చర్చించనున్నారు. జులై 27న వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే అగార్కర్ టీమ్ తో చేరనున్నాడు. ఆ 20 మంది ప్లేయర్స్ కోర్ గ్రూపులో పెద్దగా ఆశ్చర్యకర నిర్ణయాలేమీ ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
బుమ్రా, రాహుల్ సంగతేంటి?
ఇక అగార్కర్, రోహిత్, ద్రవిడ్ చర్చల్లో బుమ్రా, రాహుల్ ఫిట్‌నెస్ ప్రస్తావన కూడా రానుంది. ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్స్ గాయాల నుంచి కోలుకొని ప్రస్తుతం బౌలింగ్, బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్ నుంచి టీమిండియాకు దూరంగా ఉన్న బుమ్రా.. వరల్డ్ కప్ సమయానికి పూర్తి ఫిట్ గా ఉంటాడా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం అతడు ఎన్సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
అటు ఐపీఎల్లో గాయపడిన కేఎల్ రాహుల్ కూడా ఎన్సీఏలోనే ఉన్నాడు. సర్జరీ తర్వాత రీహ్యాబిలిటేషన్ కోసం వెళ్లిన అతడు.. ప్రస్తుతం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ ఇద్దరు ప్లేయర్స్ వచ్చే నెలలో జరగబోయే ఐర్లాండ్ సిరీస్ కు వెళ్లేలా కనిపిస్తున్నారు. అయితే ఆసియా కప్ లో ఆడతారా లేదా అన్నదానిపై అగార్కర్, రోహిత్, ద్రవిడ్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు.
సంబంధిత కథనం