Abdul Razzaq on Asia Cup: ఆసియా కప్ 2023 విషయంలో ఇప్పుడు బీసీసీఐ, పీసీబీ మధ్య గొడవ నడుస్తున్న విషయం తెలుసు కదా. నిజానికి ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహణ హక్కులు పాకిస్థాన్ కే దక్కినా.. ఆ దేశానికి వెళ్లేది లేదని బీసీసీఐ కార్యదర్శి జై షా స్పష్టం చేశారు. అవసరమైతే టోర్నీని అక్కడి నుంచి తరలిస్తామని ఏసీసీ అధ్యక్షుడు కూడా అయిన షా అనడం వివాదానికి కారణమైంది.,ఈ మధ్య జరిగిన ఏసీసీ అత్యవసర సమావేశంలోనూ దీనిపైనే చర్చ జరిగింది. మార్చిలో జరిగే మరో సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీనిపై పాక్ మాజీ క్రికెటర్ జావెద్ మియందాద్ ఘాటుగా స్పందించాడు. ఇండియా వస్తే ఎంత రాకపోతే ఎంత.. ఇక్కడికి వచ్చి ఓడిపోతామన్న భయం వాళ్లది అంటూ మియాందాద్ అన్నాడు. కానీ మరో పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ మాత్రం ఆసియా కప్ తరలింపుపై సానుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం.,క్రికెట్ కు ఇది మంచిదే అని అతడు అన్నాడు. "క్రికెట్ కు ఇది మంచిదే. క్రికెట్ ప్రమోషన్ కు కూడా. ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ లు కేవలం ఐసీసీ టోర్నీల్లోనే జరుగుతాయి. ఒకవేళ ఆసియా కప్ ను దుబాయ్ కు తరలిస్తే అది మంచి ఆప్షన్. అది క్రికెట్ కు, క్రికెటర్లకు మంచిది" అని జియో న్యూస్ తో మాట్లాడుతూ రజాక్ అన్నాడు.,"ఇప్పుడే ఇది జరగడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి. రెండు క్రికెట్ బోర్డులు చర్చించుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది. రెండు బోర్డులూ ఈ సమస్యను పరిష్కరించాలి" అని అబ్దుల్ రజాక్ స్పష్టం చేశాడు. నిజానికి ఆసియా కప్ ను తరలించే ప్రయత్నాలపై పాక్ మాజీ క్రికెటర్లంతా విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవేళ టోర్నీని పాకిస్థాన్ నుంచి తరలిస్తే ఇండియాలో జరిగే వరల్డ్ కప్ ను తాము బాయ్‌కాట్ చేస్తామని కూడా పీసీబీ గతంలో హెచ్చరించింది.,