దీపావళికి తప్పకుండా కొనుగోలు చేయాల్సిన వస్తువులు జాబితా ఇదే-you must buy these auspicious items on diwali festival to get lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  దీపావళికి తప్పకుండా కొనుగోలు చేయాల్సిన వస్తువులు జాబితా ఇదే

దీపావళికి తప్పకుండా కొనుగోలు చేయాల్సిన వస్తువులు జాబితా ఇదే

Gunti Soundarya HT Telugu
Oct 30, 2024 06:59 PM IST

హిందూ శాస్త్రాల ప్రకారం దీపావళి రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి. ఆ వస్తువులు ఏంటి? వాటిని తీసుకురావడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

దీపావళికి కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే
దీపావళికి కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే (pinterest)

అక్టోబర్ 31 దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ఇప్పటికే మార్కెట్లు అన్నీ దీపావళికి సంబంధించిన వస్తువులతో కళకళాడిపోతున్నాయి. దీపావళి రోజు కొన్ని వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. ఈ పవిత్రమైన దీపావళి రోజు ఏయే వస్తువులు కొనాలో తెలుసుకుందాం.

yearly horoscope entry point

దక్షిణావర్తి శంఖం

దీపావళి రోజున దక్షిణావర్తి శంఖాన్ని కొనుగోలు చేసి, ఎర్రటి బియ్యం, కుంకుమ రంగుతో నింపి మీ ఇంటి పూజ గదిలో లేదా ఉత్తరం వైపున ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

గోమతి చక్రాలు

గోమతి చక్రాలు కూడా లక్ష్మీదేవితో ముడిపడి ఉంటాయి. పూజ సమయంలో పదకొండు గోమతి చక్రాలను ఎర్రటి వస్త్రంలో కట్టి ఉంచాలి. తర్వాత వాటిని డబ్బు నిల్వ చేసే ప్రదేశంలో ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులతో ఇల్లు సంపదతో నిండిపోతుంది.

పసుపు

దీపావళి రోజు పదకొండు పసుపు కొమ్ములు కొని పూజలో ఉంచాలి. ఇది బృహస్పతి అనుగ్రహాన్ని కూడా ఇస్తుంది. జాతకంలో గురు గ్రహాన్ని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది. వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.

శ్రీ యంత్రం

దీపావళి రోజు శ్రీ యంత్రం కొనుగోలు చేసి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ప్రతిష్టించుకోవడం మంచిది. దీన్ని రోజు పూజించాలి. అలాగే శ్రీ సూక్తాన్ని పఠించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఎప్పుడు తన ఆశీస్సులు మీ మీద ఉంచుతుంది.

లక్ష్మీదేవి విగ్రహం

దీపావళి రోజు తప్పనిసరిగా తీసుకురావాల్సిన వాటిలో ముఖ్యమైనది లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేర విగ్రహాలు. లేదంటే బంగారం లేదా వెండితో చేసిన లక్ష్మీదేవి నాణేలు అయినా ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటిని పూజలో తప్పనిసరిగా ఉంచాలి. లక్ష్మీదేవి ఏనుగు లేదా తామర మీద కూర్చున్న భంగిమలో ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలి. అలాగే వినాయకుడి తొండం ఎడమ వైపు ఉన్న విగ్రహం తీసుకొచ్చి ఇంట్లో ప్రతిష్టించుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. జీవితం ఆనందంగా సాగిపోతుంది.

తామర గింజలు

వీటినే కమల్ గట్ట అని పిలుస్తారు. లక్ష్మీదేవికి తామర పువ్వు ఎంతో ప్రీతికరమైనది అనే విషయం అందరికీ తెలిసిందే. దీపావళి రోజు కమల్ గట్టను ఇంటికి తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించాలి. అలాగే హవనం చేసేటప్పుడు తామర గింజలు ఉపయోగించుకోవచ్చు. దీనితో పాటు తామర పువ్వు పూజలో ఉంచితే విశేషమైన ఫలితాలు లభిస్తాయి.

దీపాలు

దీపాలు లేకుండా దీపావళి అసంపూర్తిగా పరిగణిస్తారు. అమావాస్య రోజు వచ్చే దీపావళి నాడు ప్రతి ఇంట్లో దీపాల కాంతులు దేదీప్యమానంగా ప్రకాశిస్తాయి. వివిధ రకాల దీపాలతో ఇంటికి అలంకరించడం వల్ల శ్రేయస్సు, ఆనందం లభిస్తుంది. ఈరోజు ఐదు పెద్ద దీపాలతో పాటు 25 చిన్న దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుందని అంటారు.

ఇవి మాత్రమే కాదు బిల్వపత్రాలు, తులసి ఆకులు, చీపురు, కొత్తిమీర, రావి ఆకులు వంటి వాటిని కూడా కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు. వీటిని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుందని ఆశీర్వాదాలు త్వరగా అందిస్తుందని నమ్ముతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner