వివాహిత స్త్రీలు భర్త ఆయుష్షు పెరగాలని వట సావిత్రిని పూజిస్తారు. మర్రిచెట్టును దారంతో కట్టి తన భర్త దీర్ఘాయుష్షు కోసం వరం కోరుతారు. ఈ పండుగను ఉత్తర భారతదేశంలో చాలా ఆర్భాటంగా, విశ్వాసంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈరోజు పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. మే 27వ తేదీ మంగళవారం నాడు అమావాస్యను జరుపుకోనున్నారు.
ఈ సమయంలో స్త్రీలు త్రిమూర్తులను (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) పూజిస్తారు. మర్రిచెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు (శివుడు) నివసిస్తున్నారని నమ్ముతారు. సోమవారం ఉదయం 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 12.14 గంటల వరకు అభిజిత్ ముహూర్తంలో పూజలు చేయడానికి ఉత్తమ సమయం.
పురాణ కాలంలో సావిత్రి అనే సతీమణి ఉండేవారు. ఆమె బుద్ధిమంతురాలిగా, ధర్మానికి నిబద్ధురాలిగా పేరు పొందారు. సత్యవాన్ అనే ఒక రాకుమారుడితో ఆమెకు పెళ్లి జరిగింది. ఒక రోజు సత్యవాన్ అడవిలో పని చేస్తుండగా, అతనికి ప్రాణాలు పోయే స్థితి వచ్చింది.
ఆ సమయంలో యమధర్మరాజు అతని ప్రాణం తీయడానికి వచ్చాడు. అప్పుడు సావిత్రి యమధర్మ రాజు దగ్గరికి వెళ్లింది. ఆమె ధైర్యం, నిబద్ధత చూసిన యముడు వరం ఇచ్చి, సత్యవాన్ ప్రాణాన్ని కాపాడాడు. ఈ సమయంలో సావిత్రి సత్యవాన్‌ను ఒక వటవృక్షం దగ్గర ఉంచింది. అందుకే ఈ పూజ చేసేటప్పుడు వటవృక్షాన్ని పూజించే ఆచారం ఏర్పడింది.
ఈ చెట్టును ఆరాధించేటప్పుడు ఏడు సార్లు దారాన్ని చుట్టి ప్రదక్షిణలు చేస్తారు, పూజలు చేస్తారు. వివాహిత స్త్రీలు ఏడు దారాలను ఎందుకు కడతారు అనే విషయానికి వస్తే, భర్తతో వారి సంబంధం ఏడు జన్మల దాకా ఉండాలని ఈరోజు స్త్రీలు మర్రి చెట్టుకు దారం కడతారు. దీనిని భార్యాభర్తల మధ్య ఉన్న ఏడు జన్మల బంధానికి ప్రతీకగా భావిస్తారు.
వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య నాడు శని జయంతిని కూడా జరుపుకుంటారు. శనీశ్వరుడిని పూజిస్తారు. మే 27న ఉదయం అమావాస్య తిథి ఉంది. కనుక మంగళవారం శని అమావాస్యని జరుపుతారు. ఈ రోజున పూజలు చేస్తే మంచిది. హనుమంతుడికి, శనీశ్వరుడుకి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా, ఒక వ్యక్తి ఋణం నుండి విముక్తి పొందుతాడు. ఈ రోజున గంగానదిలో స్నానమాచరించి పితృదేవతలకు నైవేద్యాలు సమర్పించి శని దేవుడిని పూజిస్తే అదృష్టం పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.