శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం వెనుక ఉన్న కథలు తెలుసా?-why we should offer mustard oil to lord shani dev what is the stories behind this ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం వెనుక ఉన్న కథలు తెలుసా?

శనీశ్వరుడికి తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం వెనుక ఉన్న కథలు తెలుసా?

Gunti Soundarya HT Telugu
Nov 11, 2024 04:10 PM IST

శని దేవాలయానికి వెళ్తే నువ్వుల నూనె దీపం తప్పనిసరిగా వెలిగిస్తారు. అలాగే తైలాభిషేకం చేస్తారు. ఇలా చేయడం వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటో తెలుసా?

శనికి నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారంటే
శనికి నువ్వుల నూనె దీపం ఎందుకు పెడతారంటే

నవగ్రహాలలో న్యాయ దేవుడిగా శనీశ్వరుడిని భావిస్తారు. శని సంచారం ఒక వ్యక్తి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఏలినాటి శని, అర్థాష్టమ శని, శని మహాదశ అంటూ అనేక రకాలుగా శని ప్రభావం ఉంటుంది. శని కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు.

ఒక వ్యక్తి చేసే పనులను బట్టి శని ఇచ్చే ప్రతిఫలం ఆధారపడి ఉంటుంది. మంచి పనులు చేస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. అదే చెడు పనులు చేస్తే కష్టాలు, దుఃఖంతో నిండిపోతుంది. శని బాధల నుంచి తప్పించుకునేందుకు ఎక్కువగా సూచించే మార్గం శనీశ్వరుడికి తైలాభిషేకం చేయాలని అంటారు. అలాగే శని ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లేదా దీపం పెట్టడం వల్ల మేలు జరుగుతుంది. శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అయితే నువ్వుల నూనెతో మాత్రమే దీపం ఎందుకు పెడతారు. దీని వెనుక కారణం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం శనికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వెనుక రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. రెండూ కథలు హనుమంతుడితో ముడి పడి ఉండటం మరొక విశేషం. ఒకనాడు రావణుడు తనకున్న శక్తులను చూసుకుని విర్రవీగుతూ గ్రహలన్నింటినీ బంధించాడు. అలా శనీశ్వరుడిని తలకిందులుగా వేలాడదీశాడు. అదే సమయంలో రావణుడి చెరలో ఉన్న సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ హనుమంతుడు వస్తాడు.

హనుమంతుడి తోకకు రావణుడు నిప్పు పెట్టిస్తాడు. దీంతో లంకను మొత్తం దహనం చేస్తాడు హనుమంతుడు. అప్పుడు రావణుడి బంధీలో ఉన్న గ్రహాలకు విముక్తి కలుగుతుంది కానీ శనీశ్వరుడు మాత్రం తలకిందులుగా ఉండిపోవడం వల్ల వెళ్లలేకపోతాడు. తీవ్ర గాయాలపాలవుతాడు. అప్పుడు హనుమంతుడు శనీశ్వరుడిని గమనించి అతడి దెబ్బలకు నువ్వుల నూనెతో మర్థన చేశాడు. అప్పటి నుంచి తనకు ఎవరైతే నూనెతో అభిషేకం చేస్తారో వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయను, కష్టాల నుంచి విముక్తి కలిగిస్తానని చెప్పాడట.

మరొక కథనం ప్రకారం దేవతల అందరిలోనూ హనుమంతుడికి మాత్రమే శని పట్టలేదని చెబుతారు. శని తన గర్వం అహంకారంతో ఒకనాడు హనుమంతుడితో యుద్ధానికి దిగాడు. అప్పుడు హనుమంతుడు తెలివిగా శనీశ్వరుడిని ఓడిస్తాడు. ఈ యుద్ధంలో శనికి బాగా దెబ్బలు తగులుతాయి. వాటితో ఇబ్బందులు పడుతుంటే హనుమంతుడు చలించిపోయి నూనె రాస్తాడు. దెబ్బల నుంచి ఉపశమనం కలుగుతుంది. అప్పటి నుంచి హనుమంతుడి భక్తులను శనీశ్వరుడు ఏమి చేయదడని అంటారు. అందుకే శని అనుగ్రహం పొందటం కోసం హనుమంతుడిని పూజిస్తారు.

అప్పటి నుంచి శని అనుగ్రహం పొందటం కోసం తైలాభిషేకం చేయడం, నువ్వుల నూనె దీపం వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. ఇలా చేసిన వారికి శని కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తాడని నమ్ముతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner