Amla on Sunday: ఆదివారం ఉసిరికాయను ఎందుకు తినకూడదు? తింటే ఏమవుతుంది?
చాలామంది ఈ మాట చెప్పడం మీరు వినే ఉంటారు. ఆదివారం నాడు అస్సలు ఉసిరికాయని తినకూడదని చెప్తారు. దాని వెనుక కారణమైతే ఉంది. అసలు ఆదివారం నాడు ఉసిరికాయను ఎందుకు తినకూడదని పెద్దలు చెప్పారు అనే విషయాన్ని తెలుసుకుందాం.
హిందువులు మొక్కలని, చెట్లని కూడా పూజిస్తూ ఉంటారు. కచ్చితంగా ప్రతి హిందూ ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్కని లక్ష్మీదేవిగా భావించి, ప్రతి రోజు ఆరాధిస్తూ ఉంటారు. తులసి మొక్క దగ్గర దీపారాధన చేస్తే కూడా విశేష ఫలితాలు ఉంటాయి. అయితే తులసి మొక్క గురించి, తులసి మొక్క విశేషత గురించి అందరికీ తెలుసు. ఉసిరి గురించి చాలా మందికి తెలియని విషయాలు ఉన్నాయి. అవి ఈరోజు తెలుసుకుందాం.
ఉసిరి విశిష్టత:
ఉసిరి మొక్కను పూజించడం, ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం, ఉసిరి దీపాన్ని పెట్టడం, ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేయడం.. ఇటువంటివి మనం చేస్తూ ఉంటాము. అలాగే ఉసిరికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాము. కార్తీక మాసంలో అయితే ఉసిరి దీపాలను వెలిగిస్తూ ఉంటాము. అలాగే కార్తీకమాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తాము. క్షీరాబ్ది ద్వాదశి రోజున అయితే తులసితో పాటుగా ఉసిరిని కూడా పూజించడం జరుగుతుంది. తద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. సంతోషంగా ఉండొచ్చు.
ఉసిరి జననం:
క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతం కోసం దేవదానవుల మధ్య అమృతభాండం కోసం పెనుగులాట జరుగుతుంది. ఆ సమయంలో కొన్ని అమృతం చుక్కలు భూమిపై పడ్డాయి. అదే ఉసిరిగా మారిందని హిందువుల నమ్మకం. ఉసిరిలో పులుపు ఎక్కువగా ఉంటుంది. ఉసిరిని తీసుకోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలకి దూరంగా ఉండవచ్చు. సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండడానికి ఉసిరి ఔషధంలా పనిచేస్తుంది. ఉసిరి ఆరోగ్యానికి సంజీవిని అని చెప్పొచ్చు.
ఉసిరి దీపాన్ని ఎందుకు పెట్టాలి?
ఉసిరికాయ విష్ణువు యొక్క స్వరూపం. ఉసిరి చెట్టు ముందు దీపం వెలిగిస్తే దోషాలు తొలగిపోతాయి. ఉసిరికాయ దీపాన్ని పెట్టడం వలన అనారోగ్య సమస్యలు మన దరి చేరవు.
ఉసిరికాయను ఆదివారం ఎందుకు తినకూడదు?
చాలామంది ఈ మాట చెప్పడం మీరు వినే ఉంటారు. ఆదివారం నాడు అస్సలు ఉసిరికాయని తినకూడదని చెప్తారు. దాని వెనుక కారణమైతే ఉంది. అసలు ఆదివారం నాడు ఉసిరికాయను ఎందుకు తినకూడదని పెద్దలు చెప్పారు అనే విషయాన్ని చూస్తే... సూర్యునికి సంబంధించిన రోజుల్లో ఉసిరికాయని తినకూడదని ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా తెలుస్తోంది. గ్రహణం, అమావాస్య, సంక్రాంతి ఇలాంటి రోజుల్లో కూడా ఉసిరికాయని తినకూడదు.
పద్మ పురాణం ప్రకారం చూసుకున్నట్లయితే అన్ని దేవతల పూజల్లో కూడా ఉసిరికాయని ఉపయోగించడం జరుగుతుంది. చాలా శుభప్రదమైనదే కానీ సూర్యుడిని మాత్రం విడిచి పెట్టాలి. సూర్యుడు తప్ప మిగిలిన వారందరి పూజల్లో ఉసిరికాయని ఉపయోగించడం జరుగుతుంది. అది పనికి వస్తుంది.
కానీ సూర్యుడు వారాల్లో, సూర్యుడు తిధి ఉన్నప్పుడు ఉసిరికాయను తీసుకోకూడదు. అందుకనే సప్తమి, ఆదివారం నాడు ఉసిరికాయను తినకూడదు. ఎవరైతే ఆదివారం నాడు ఉసిరికాయను తింటారో వాళ్లకు ఆయుక్షీణం కలుగుతుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామికి కూడా ఇబ్బందులు వస్తాయట. కాబట్టి, ఇలా సూర్యునికి సంబంధించిన వారాల్లో, సూర్యునికి సంబంధించిన తిధుల్లో ఉసిరికాయను తినకూడదని అంటారు.