Palapitta: దసరా రోజున పాలపిట్టను ఎందుకు చూడాలి? ఏ దిక్కున చూస్తే మంచిది?
Dasara 2023: విజయ దశమి రోజున పాలపిట్టను చూడటం మంచిదని చెబుతుంటారు. దీని వెనక ఉన్న కారణాలేంటి?
విజయ దశమి(Vijaya Dashami) వేడుకలకు అంతా సిద్ధంగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాలు ఘనంగా జరుగుతాయి. ఇక తెలంగాణలో అయితే దసరా వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడున్నా.. విజయ దశమికి సొంత ఊరికి వస్తుంటారు జనాలు. దసరా నాడు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి ఆకులు తెచ్చి పంచి పెట్టుకుంటారు. అయితే విజయ దశమి రోజున పాలపిట్టను చూడాలనే సంప్రదాయం ఎప్పటి నుంచో వస్తుంది. దీని వెనక ఉన్న పురాణ కథలు ఏంటి?
దసరా(Dasara) రోజున తప్పకుండా పాలపిట్ట(Palapitta)ను చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ పక్షిని చూసేందుకు ఊరు చివరకు వెళ్తారు. పొలాల్లో తిరుగుతారు. కనిపించిన తర్వాత సంతోషంగా తిరుగుపయనమవుతారు. పాలపిట్టను పరమేశ్వరుడి స్వరూపంగా భావిస్తారు. పాలపిట్టను కార్యసిద్ధికి, మన:శాంతికి సంకేతంగా చెబుతారు. దశమి రోజున పాలపిట్టను చూసే సంప్రదాయం ఉంది.
దీని వెనక కూడా పురాణ సంబంధమైన కథలు ఉన్నాయి. అదేంటంటే.. త్రేతాయుగంలో రావణసురుడి మీదకు రాముడు యుద్ధానికి వెళ్లింది విజయదశమి రోజున. జమ్మి చెట్టుకు పూజ చేసి.. రాముడు యుద్ధానికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయనకు పాలపిట్ట ఎదురు వచ్చిందని చెబుతారు. ఆ యుద్ధంలో శ్రీరాముడు విజయం సాధించాడు.
మహా భారత సమయంలోనూ పాలపిట్టకు సంబంధించిన ప్రస్తావన ఉంది. పాండవులు అజ్ఞాతవాసం వెళ్లే సమయంలో జమ్మి చెట్టుపై ఆయుధాలు పెడతారు. పూజలు చేసి.. అజ్ఞాతంలోకి వెళ్తారు. ఈ సమయంలో ఇంద్రుడు పాలపిట్ట రూపంలో ఆయుధాలకు కాపలాగా ఉన్నాడని అంటుంటారు. పాండవులు అజ్ఞాతం ముగించుకుని తిరికి వచ్చేప్పుడు పాలపిట్ట ఎదురు వచ్చిందని, ఆ తర్వాత యుద్ధం విజయం సాధించారని చెబుతారు. అందుకోసమే పాలపిట్టను కార్యసిద్ధికి సంకేతంగా భావిస్తారు.
ఏ దిక్కున చూడాలి
పాలపిట్టను చూసే దిక్కు కూడా ముఖ్యమే. ఏ దిక్కున పడితే ఆ దిక్కున చూడటం వలన శుభం కలగదు. దసరా రోజున పాలపిట్ట ఉత్తర దిశ వైపు కనిపిస్తే.. శుభమని చెబుతారు. దక్షిణం వైపు కనిపిస్తే అశుభం అని నమ్మకం. జమ్మికి వెళ్లే సమయంలో పాలపిట్టను చూస్తుంటారు. దసరా రోజున పాలపిట్టను చూస్తే అంతా మంచే జరుగుతుందని ప్రజల నమ్మకం. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుందని చెబుతారు. తెలంగాణలో దసరా వచ్చిందంటే.. జమ్మి చెట్టుతో పాటు పాలపిట్ట దర్శనం కోసం వెళ్తారు.