Govardhan puja: దీపావళి తర్వాతే గోవర్థన్ పూజ ఎందుకు చేస్తారు? అందుకు గల కారణం ఏంటి?-why we celebrate govardhan puja after diwali ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Govardhan Puja: దీపావళి తర్వాతే గోవర్థన్ పూజ ఎందుకు చేస్తారు? అందుకు గల కారణం ఏంటి?

Govardhan puja: దీపావళి తర్వాతే గోవర్థన్ పూజ ఎందుకు చేస్తారు? అందుకు గల కారణం ఏంటి?

Gunti Soundarya HT Telugu
Oct 31, 2024 05:30 PM IST

Govardhan puja: దీపావళి మరుసటి రోజు గోవర్ధన్ పూజ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని ప్రాముఖ్యత ఏంటి? దీని వెనుక ఉన్న కథ గురించి తెలుసుకుందాం.

గోవర్ధన్ పూజ ప్రాముఖ్యత
గోవర్ధన్ పూజ ప్రాముఖ్యత (pinterest)

దీపావళి పండుగ మరుసటి రోజు గోవర్ధన్ పూజ జరుపుకుంటారు. ఈ ఏడాది తిథుల సమయంలో కాస్త తేడాలు రావడం వల్ల దీపావళి అమావాస్య రెండు రోజులు ఉంటుంది. అందువల్ల అక్టోబర్ 31తో పాటు నవంబర్ 1 కూడా దీపావళి జరుపుకుంటున్నారు.

నవంబర్ 2 గోవర్ధన్ పూజ జరుపుకోనున్నారు. ఈరోజు నుంచే తెలుగు రాష్ట్రాల వారికి కార్తీకమాసం కూడా ప్రారంభం కాబోతుంది. గోవర్ధన్ పూజ జరుపుకోవడం వెనుక పురాణాల ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. కృష్ణుడు తన లీలతో గోవర్ధన్ పర్వతాన్ని ఎత్తి బృందావనంలోని ప్రజలందరినీ రక్షించాడు. దీపావళి వెలుగులను నింపే పండుగ అయితే గోవర్దన పూజ పర్యావరణాన్ని గౌరవిస్తూ, దాన్ని రక్షించాలనే ప్రాముఖ్యతను నొక్కి చెప్పే పండుగ. వివిధ రాష్ట్రాలలో ఈ పండుగను అన్నకూట్ అని పిలుస్తారు.

గుజరాతీ సంప్రదాయం ప్రకారం వారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. దీపావళితో పాత సంవత్సరం ముగిసిపోగా గోవర్ధన్ పూజతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. సంప్రదాయ ఉత్సవాలు జరుపుకుంటారు. ఊరేగింపులు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

దీపావళి తర్వాత ఎందుకు చేస్తారు?

ప్రకృతి ప్రాముఖ్యతను గుర్తు చేసే పండుగ ఇది. ఐక్యత, శ్రీకృష్ణుడి దైవిక శక్తులను గుర్తు చేసుకుంటూ ఈ పండుగ జరుపుకుంటారు. భక్తులు ఈరోజు పేడతో గోవర్థన కొండను చేసి పూజిస్తారు. అన్నం, పిండి పదార్థాలు రాసులుగా పోస్తారు. పర్యావరణాన్ని రక్షించాలని, గౌరవించాలని సందేశాన్ని ఇచ్చే పండుగ ఇది. దీపావళి తర్వాత చేసుకునే గోవర్ధన్ పూజకు చాలా లోతైన అర్థం ఉంటుంది. దీపావళి దీపాల వెలుగులు, వినయం, ఉత్సవాలను సూచిస్తుంది. గోవర్ధన్ పూజ మనల్ని రక్షించే ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్యత మన మీద ఉందనే విషయాన్ని గుర్తు చేస్తుంది.

ఆహార పదార్థాలు అన్నీ రాసులుగా పోసి గోవర్ధన కొండ రూపాన్ని నిర్మిస్తారు. ఇది అందరిలోని ఐక్యతను, సమాజ బంధాన్ని ప్రోత్సాహిస్తుంది. అందుకే దీన్ని అన్నకూట్ అని పిలుస్తారు. ఈ ప్రసాదాన్ని అందరికీ పంపిణీ చేస్తారు. పూర్వం గోవర్ధన కొండ దగ్గర ఉండే ప్రజలు ఇంద్రుడిని పూజించే వాళ్ళు. అలా ఎందుకు చేస్తున్నారని శ్రీకృష్ణుడు తల్లిని అడుగుతాడు. ఇంద్రుడు వర్షం ఇచ్చి పంటలకు నీటిని, పశువులకు మేతను ఇస్తున్నాడని అందుకే పూజిస్తున్నట్టు చెప్తుంది. అలా అయితే గోవర్దన కొండను కదా పూజించాల్సింది. పశువులకు అవసరమైన పచ్చిక బయళ్ళు ఇస్తూ ప్రజలకు ఆశ్రయాన్ని కల్పించిన కొండకు కృతజ్ఞతలు తెలిపాలి ఇంద్రుడికి కాదని అంటాడు.

ప్రజలు గోవర్దన కొండను పూజించసాగారు. విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఆ ప్రాంతం మొత్తం వరదలు, రాళ్ళ వర్షం కురిపించాడు. దీంతో ప్రజలను కాపాడేందుకు కృష్ణుడు గోవర్ధన్ పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తాడు. దాని కింద ప్రజలందరూ రక్షణ పొందారు. అలా గోవర్ధన్ పూజ చేయడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner