Tulsi vivah: తులసి వివాహం ఈ రోజే ఎందుకు చేయాలి, తులసి-శాలిగ్రాముల కథేంటి?
Tulsi vivah: ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున దేవుతాని ఏకాదశి జరుపుకుంటారు. ఈ రోజున తులసి వివాహం జరిపించడం వల్ల సంతోషం, శ్రేయస్సు, సంపద కలుగుతాయని భావిస్తారు.
లోకానికి అధిపతి అయిన విష్ణువు ఆరాధనతో పవిత్ర తులసి మొక్కను పూజించడం పవిత్రమని హిందువులు భావిస్తారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం దేవుత్తాన ఏకాదశి రోజున తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ రోజున, లక్ష్మీ అవతారంగా కొలుచుకునే తులసి దేవి శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని వివాహం చేసుకుంటుంది. తులసీ వివాహం నిర్వహించడం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయినీ, చక్కటి ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉంటారనీ నమ్ముతారు. ఇంట్లో శాంతి చేకూరి శ్రేయస్సు లభించేలా సకల దేవతల ఆశీర్వచనాలు అందుతాయని చెబుతున్నారు. నేడు నవంబర్ 12న దేవుత్తాని ఏకాదశి. ఇదే రోజున తులసి వివాహ కార్యక్రమం ఎందుకు జరిపించాలో తెలుసుకుందాం..
తులసి వివాహ కథ:
పురాణాల ప్రకారం.. జలంధరుడు అనే అసురుడు ఉండేవాడు. అతను బృందా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. బృందా దేవి విష్ణుమూర్తికి అపారమైన భక్తురాలు. విష్ణునామ స్మరణం వల్ల ఆమె కొన్ని శక్తులను పొందడం వల్ల ఆమె భర్త జలంధరుడిని ఎవ్వరూ చంపలేకపోయారు. దీంతో తనకు తిరుగులేదని భావించిన జలంధరుడు తన అజేయతను చూసి గర్వపడి పరలోకపు అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టాడు. అతని అరాచకాలకు భయపడి కలత చెందిన దేవతలు, దేవతలు విష్ణువు ఆశ్రయిస్తారు. జలంధరుడు కోపము నుండి వారందని కాపాడమని హరిని వేడుకుంటారు.
జలంధరుడి భార్య బృందా భర్తను బాగా ప్రేమించే మహిళ. ఆమె పవిత్రత కారణంగా అసురుడైన జలంధరుడిని ఓడించడం దేవతలెవ్వరికీ కుదరడం లేదు. అందువల్ల జలంధరుడిని నాశనం చేయాలంటే బృందా పవిత్రతను నాశనం చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ కారణంగా, విష్ణువు తన మాయతో జలంధరుడి రూపాన్ని ధరించి, వంచనతో బృందా పవిత్రతను నాశనం చేశాడు. దీనితో జలంధరుడిని తన శక్తులను కోల్పోయి.. దేవుళ్లపై చేస్తున్న యుద్ధంలో ఓడిపోతాడు.
ఈ మోసాన్ని గ్రహించిన బృందకు కోపం వచ్చి విష్ణుమూర్తిని శిలగా మారాలని శపించి సతీదేవిగా మారింది. బృందా తినే చోట ఒక తులసి మొక్క పెరిగింది.తర్వాత దేవతల ప్రార్థనతో బృంద తన శాపాన్ని ఉపసంహరించుకుంది. కాని శ్రీమహా విష్ణువు ఆమెకు చేసిన మోసం గురించి పశ్చాత్తాపపడతాడు. అందుకనే ఆమె విధించిన శాపాన్ని సజీవంగా ఉంచడానికి, అతను రాయి రూపంలో ఒక రూపాన్ని ధరిస్తాడు. ఆ రాతిని శాలిగ్రామం అని పిలుస్తారు. బృందాదేవి గౌరవాన్ని, పవిత్రతను కాపాడటానికి, దేవతలు తులసి మొక్కగా మారిన బృందా దేవికి, శాలిగ్రామ రాయి రూపంలో ఉన్న విష్ణుమూర్తి రూపానికి వివాహం చేశారు. అలా ప్రతి ఏ ప్రతి సంవత్సరం కార్తీక మాసం శుక్లపక్షం ఏకాదశి రోజున తులసికి శాలిగ్రామ స్వామికి వివాహం జరిపిస్తారు.
చాతుర్మాసంలో విష్ణుమూర్తి నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటారు. అనంతరం దేవుత్తాని ఏకాదశి రోజు మేల్కొంటాడు. అప్పుడే శాలిగ్రామ రూపంలో ఉన్న విష్ణుమూర్తికి, తులసి దేవికి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల ఏకాదశి లేదా ద్వాదశి రోజున మాత్రమే తులసి వివాహం చేస్తే లక్ష్మీనారాయణుడి ఆశీస్సులు, సరిసంపదలు, శ్రేయస్సు లభిస్తాయని నమ్మిక.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
టాపిక్