Karthika Masam 2023 : కార్తీక మాసంలో అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు ఎందుకు వండి పెట్టాలి?
Karthika Masam 2023 : కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి. అందులో ఒకటి అన్నదమ్ములకు అక్కాచెల్లెళ్లు వండి పెట్టడం. ఇలా ఎందుకు చేస్తారు? కార్తీక మాసంలో ఉన్న ముఖ్యమైన రోజుల గురించి ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చెప్పారు.
శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ప్రతి ఏటా దీపావళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి కఠిన నిష్టతో చేపట్టే వ్రతములకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ట్రెండింగ్ వార్తలు
ఈ మాసంలో పాడ్యమి, చవితి, పౌర్ణమి, చతుర్దశి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. ఈ మాసమందు వచ్చు సోమవారములు, చవితి, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి. నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజుల్లో పవిత్ర పుణ్య నదీ స్నానమాచరించి, ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకములు, లక్ష బిల్వార్చనలు, లక్ష కుంకుమార్చనలు, లలిత, విష్ణు సహస్రనామపారాయణలు, ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది. ఈ కార్తీక మాసం ముప్పది దినములు ఆచరించినవారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడిందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం. సూర్యాస్తమయ్యాక మూడు గడియలు (ఒక గంట) ప్రదోషరజనీముఖమ్. రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం. ఇలా ప్రతి నిత్యము వచ్చు ప్రదోషాన్ని నిత్యప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోషాన్ని నాలుగు విధాలుగా వివరిస్తూ ఉంటారు. 1. నిత్య ప్రదోషం. 2. పక్ష ప్రదోషం. 3. మాస ప్రదోషం. 4. మహాప్రదోషం అని చెప్తారు.
కొందరు నిష్టాపరులు ఈ కార్తీకమాసమంతా పుణ్యనదీస్నానమాచరిస్తూ ప్రతి నిత్యము హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారము అంటే వండని ఆహారము- పాలు, పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు, పూజలు కావించి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు. ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు. ఇక ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి, రెండో భాగమున పరమేశ్వర రూపంగా 'అర్థనారీశ్వరుడు'గా దర్శనమిచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది.
ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి “అధ్యక్షురాలిగా” అధిరోహించి ఉండగా! పరమేశ్వరుడు పరవశించి తాండవం చేస్తూ ఉంటాడు. ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువుదీరి ఉంటారట. ఆ సమయంలో అ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట. లక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరి మృదంగం వాయిస్తాడట. ఇంద్రుడు వేణునాదంతో పులకింపజేస్తూ ఉంటాడు. అట్టి ప్రదోష సమయాల్లో దేవగంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట. కనుక ప్రదోష సమయాల్లో శివుని ఆరాధిస్తే శివుని ఆశీస్సులతో పాటు మిగిలిన దేవతల ఆశీస్సులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్తారు.
ఇంకా మనం ఆ అర్థనారీశ్వర రూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయట. కామం అంటే కోర్కెలను నియంత్రించే శక్తి, కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట. ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వశుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య జాధలను తొలగించి సర్వ సంపత్తులను అనుగ్రహిస్తుంది.
ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైనది ఉత్పన ఏకాదశి. అంటే శ్రీమహావిష్ణువు పాలకడలిలో ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశినాడు కనులు విప్పి యోగ నిద్ర నుండి మేల్కొన్న రోజు. దీనికే ఉత్పన ఏకాదశి అనిపేరు. ఆ మరుసటి రోజు ద్వాదశినాడు ముప్పది ముగ్గురు దేవతలతో శ్రీమహాలక్ష్మి సమేతుడై తులసీధాత్రి వనమందు ఉంటాడని చెప్తారు. ఈ ద్వాదశిని క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాలసముద్రము మధనము చేసిన రోజు. కనుక దీనికి క్షీరాబ్ధి ద్వాదశి అని పేరు వచ్చినది.
పాలసముద్రమును చిలికారు కనుక దీనిని చిల్ముద్వాదశి అని కూడా అంటారు. కనుక స్త్రీలు ఈ రోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసీధాత్రి (తులసికోట) వద్ద విశేష దీపారాధనలు గావించి షోడశోపచారములతో తులసీధాత్రి లక్ష్మీనారాయణులను పూజిస్తారు. ఆరోజు దేశము నలుమూలల గల ఆలయములలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీపకాంతితో, బాణసంచాలతో సమీప నదీజలాలలో తెప్పోత్సవము నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక పూర్ణిమనాడు గడ్డిని వెంటిగా చుట్టి దానిని రెండు స్తంభములకు కట్టి ఆ వెంటిని మూడుమార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీపరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి ముమ్మారు తిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు. అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారని చిలకమర్తి తెలిపారు.
మన సంస్కృతిలో దీపారాధన అనేది ప్రధానమైన అంశం. ఈ దీపారాధనయందు ఆవు నెయ్యి ఉత్తమమైనది, మంచినూనె మధ్యమము, ఇప్పనూనె అథమము. ఇతరములైన అడవియందు పుట్టిన నూనెలు అథమాతి అధమములు. గేదె నేతితో దీపము వెలిగించిన పూర్వ పుణ్యము కూడా నశించి పోతుంది. అదే స్వల్పముగా ఆవు నెయ్యి కలిపి వెలిగించిన దోషము లేదని, అలా ఒకటి మొదలు వెయ్యి వరకు దీపములు వెలిగించుట ఎంతో శుభప్రదమని, వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందుతాయని దీపదాన మహాత్యములో చెప్పియున్నారు. అట్టి దీపారాధన పూజామందిర మందు, గృహ ప్రాంగణములో, దేవాలయములో, తులసీ బృందావనమందు, మారేడు, రావి వంటి దేవతా వృక్షాల వద్ద, పుణ్య నదీతీరములలో వెలిగించుట అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయని చిలకమర్తి చెప్పారు.
ఈ మాసంలో సోదరి చేతి వంట 'భగినీ హస్త భోజనము" చేసి వారికి కానుకలు సమర్పించుటతో పాటు, సమీప వనమందు బంధువులు, స్నేహితులతో కూడి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారముతో వనభోజనములు చేస్తూ ఉండుట మంచిది. అన్నదమ్ములకు అక్కా చెల్లెళ్లు వండి పెడితే.. ఆయుషు పెరుగుతుందని నమ్మకం. దోషాలు పోతాయని చెబుతారు.
ఈ కార్తీక మాసమునందు నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యము ఆరాధిస్తూ కార్తీక పురాణము పఠనము చేస్తే.. అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని, ఈ పవిత్ర పుణ్యదినములందు అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము, వస్త్ర, ఫల, పుష్ప, సువర్ణ దానములు మొదలైనవి చేయుటవల్ల ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయే కాకుండా, జన్మాంతరములందు జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక వ్రత మహాత్మ్యమును గురించి సూతమహాముని శౌనకాది మునులకు వివరించినాడు.
విశిష్టత
ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది. కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీకమాసమని పేరువచ్చింది. ఈ మాసంలో కృత్తిక నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కృత్తికా నక్షత్రం : కృత్తికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది. దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి. అగ్ని నక్షత్రాలైన కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢలలో మొదటిది కృత్తికాయే. వేదకాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే ప్రారంభమయ్యేది. ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రమని అంటారు. అగ్ని ఆరు ముఖాలు కలవాడు. కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు. ఈ కృత్తికలకు ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని ఆరు కృత్తిక నక్షత్రములు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరుముఖాలతో పాలు త్రాగాడు. అందుకే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు. అంటే ఆరుముఖాలు కలవాడని అర్థం. ఈ విధముగా కృత్తికాలతో పెంచబడుటచే కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చింది. ఈ కారణం వల్ల కృత్తికాలకు ప్రాముఖ్యం కలిగినదని చిలకమర్తి తెలిపారు.
కార్తీక దీపాలు : ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన. ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీస్నానమాచరించి శుచియై, పొడిబట్టలు ధరించి దీపారాధన చేయవలెను. ఈ మాసంలోనే జ్వాలాతోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు. ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజ పరుస్తూ శోభయమానంగా ఉంటాయి. ప్రతి ఇంటి ముంగిట ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది. కార్తీక మాసంలో స్త్రీలు నదులలో, కోనేరుల్లో దీపాలను వదులుతారు. ఈ దీపాలు ఆకాశంలోని చుక్కలవలె ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి. ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయని చిలకమర్తి చెప్పారు.
కార్తీక సోమవారాలు : ఈ మాస వారాలలో సోమవారానికి ఒక ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండడం, చంద్రుడు పూర్తుడై ఈ నక్షత్రం మీద ఉండడం చేత మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది. చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది. శివభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తిశ్రద్ధలతో, నియమ నిష్టలతో శివుడిని ఆరాధిస్తారు. ఈ మాస కాలంలో సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తమున నదీస్నానమాచరించి హరహర శంభో అంటూ శివుణ్ణి స్తుతిస్తూ భక్తి ప్రపంచంలో మునిగిపోతారు. ముఖ్యంగా శివభక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి పూజిస్తారు.
శివప్రీతికరమైన సోమవారం భానోదయం ముందులేచి స్నానాది కార్యక్రమాలు ముగించుకొని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివవత్ర నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం వల్ల నిత్యమూ సిరిసంపదలతో, సుఖసౌభ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం. సూర్యుడు తులారాశి యందు ప్రవేశించిన నాటి నుండి గానీ, కార్తీకమాసారంభ దినమగు శుద్ధ పాడ్యమి మొదలుకొని కానీ వ్రతారంభమును చేయవలెను. అట్లు ప్రారంభించు సమయములో 'ఓ కార్తీక దామోదరా! నీకు వందనములు. నాచే నారంభింపబడు కార్తీక 'వ్రతంబును విఘ్నములు లేకుండా చేయుము” అని పిమ్మట స్నానము చేయవలెను అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆ విధముగా జీవనదికి పోయి గంగకును, శ్రీమన్నారాయణునకును, ఖైరవునకును నమస్కరించి ఖైరవాజ్ఞను తలదాల్చి మొలలోతు నీటిలో నిలువబడి మొదట సంకల్పమును చెప్పుకొని, సూక్తములను చదివి, మార్దన మంత్రము తోడను, అఘమర్షణ మంత్రము తోడను గంగోదకమును శిరస్సున జల్లుకొని, అఘమర్న స్నానమాచరించవలెను. పిదప సూర్యునకు అర్హ్యప్రదానమొసంగి దేవతలకును, బుషులకును, పితృదేవతలకును క్రమ ప్రకారముగా తర్పణంబులొనర్చవలెను. అప్పుడది సుస్నానమగును. స్నానము చేసిన పిమ్మట నదీతీరము చేరి మూడు దోసిళ్ళ నీరు గట్టుపై పోయవలెను.
కార్తీక మాసంబున గంగా గోదావరి కావేరి తుంగభద్రాది నదులందు స్నానమొనర్చిన అత్యుత్తమము. గంగానది కార్తీకమాసమునందు నదులన్నింటియందు ద్రవరూప సన్నిహితయై ఉండు నని వేదములు, శ్రుతీ స్మృతులు చెప్పుచున్నవి. కావున సముద్రకామియగు నదీస్నానము మిగుల పవిత్రమైనది. నదీ స్నానావకాశము లభింపనిచో కాలువ యందుగాని, చెరువునందుగాని, కూపము కడగాని సూర్యోదయమునకు ముందే స్నానము చేయవలెను. పిదప మడిబట్టలను ధరించి భగవంతుని స్మరింపవలెను.
తదుపరి భస్మమును త్రిపుండ్రముగా నుదుట ధరించవలెను. లేక గోపీచందనము పైన నుదుట నూర్హ్వపుండ్రముగా నుంచుకొనవలెను. అనంతరము సంధ్యావందనము, బ్రహ్మ యజ్ఞమును ముగించి, నిత్యాగ్నిహోత్రమును గావించుకొని దేవతార్చనమును చేయవలెను. స్నానతీర్ధమునందే కార్తీక పురాణ శ్రవణమును చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సూర్యుడస్తమించు కాలమున సాయం సంధ్యావందనాన్ని పూర్తి చేసుకొని శివాలయమున గాని, విష్టా వలయమునగాని దీపారాధన చేయవలెను. షోడశోపచార పూజావిధానమున హరిహరులను పూజించి షడ్రసోపేతమైన భక్ష్యభోజ్యాదులతో కూడిన నైవేద్యమునిడవలయును. ఈ రీతిగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతము చేసినచో కార్తీకమాస వ్రతము పూర్తి అగును. మరునాడు శక్తిననుసరించి మృష్టాన్నముతో భూతతృప్తి గావించవలెను. కార్తీక మాసమున సోమవారము శివప్రీతికై సోమవారవ్రతము నొనర్చినవారికి కైలాసమున శివుని సన్నిధానమున నుండుట ప్రప్తించును.
సోమవారమున నదీస్నానం చేసి శివునికి అభిషేకమొనర్చి రాత్రి మొదటి యామమున జించవలెను. ఆ దినమున నితరులవలన నేపదార్థములను గ్రహింపరాదు. తిలదానమొనర్చినందు వలన పాపములన్నియు నశించును. ఇంకను అత్యంత నిష్టతోను, భక్తితోను నాచరింపనవకాశమున్నవారు ఆదినమున రాత్రిగూడ నిద్రింపక పురాణాది పఠనంబు వలన జాగరణం చేయాలి. మరునాడు శక్తికొలదిగ బ్రాహ్మణులకు సంతర్చణమును చేసిన పిమ్మట భుజింపవలెను. ఈ పై రెండును వేయలేనివారు సోమవారమున నపరాహ్హము వరకుండి భుజింపవలెను. ఇందేదియు చేయుటకు శక్తి లేనిచో నదీస్నానమును గావించుకొని భగవంతుని ధ్యానించవలెను.
సోమవారమున స్త్రీ గాని, పురుషుడు గాని నక్షత్రదర్శనమగువరకు ఉపవసించి పిమ్మట భుజించినవారి పాపములు అగ్నిలోపడిన దూదివలె నాశనమగును. ఆ దినమున శివునికి అభిషేకమొనర్చి వబిల్వదళంబులచే సహస్రనామార్చనమునొనర్చినను, ఇతరులచే చేయించినను, శివపంచాక్షరీ మంత్రము జపించినను, వారిని శివుడనుగ్రహించి సర్వసంపదలను, సమస్త శుభంబులను చేకూర్చును అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.