Ashada masam: ఆషాఢమాసం అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు..?
Ashada masam: ఆషాడ మాసం జులై 6 నుంచి ప్రారంభమైంది. ఈరోజు నుంచి నెల రోజుల పాటు అత్తాకోడళ్ళు ఒకే ఇంట్లో ఉండకూడదని చెప్తారు. అలా ఎందుకు చెప్తారు? దీని వెనుక కారణం ఏంటో పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
Ashada masam: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు పౌర్ణమి రోజు పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రానికి దగ్గరగా ఉండటం చేత ఈ మాసానికి ఆషాఢ మాసమనే పేరని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఆషాఢం అంటే ఆది అని ఒక అర్థమని, శక్తి అని మరొక అర్థమని చిలకమర్తి తెలిపారు. ఉత్తరాయణం పూర్తై దక్షిణాయనం ప్రారంభంకావడం చేత శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి ఈ మాసంలో ప్రవేశించడం చేత ఈ మాసం దేవతారాధనలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇదే మాసంలో శక్తి స్వరూపిణి అయినటువంటి వారాహీ అమ్మవారి ఆరాధనలు జరుగుతాయి. గురుపౌర్ణమి రోజు గురు ఆరాధనలు, చాతుర్మాస దీక్షలు వంటివి ఉండటం చేత ఈ మాసాన్ని దేవతార్చనలకు వినియోగించాల్సిన మాసంగా శాస్త్రాలు తెలియజేస్తున్నాయని చిలకమర్తి తెలిపారు.
కొత్తగా పెళ్లైన వధూవరులకు లేదా పెళ్లైన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఆషాఢమాసంలో అత్తాకోడళ్లు ఒకేచోట ఉండకూడదని ముఖ్యంగా వివాహమైన తొలి ఆషాడమాసంలో కోడలు అత్తగారింట్లో బదులు తన పుట్టింట్లో ఉండాలనేది తెలుగువారి సంప్రదాయమని చిలకమర్తి తెలిపారు. ఈ సంప్రదాయంలో కొన్ని ఆరోగ్య విషయాలు దాగి ఉన్నాయని ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల అనారోగ్యాలు పెంపొందుతాయి.
ఆషాడ మాసంలో భార్యాభర్తలు కలిసి ఉంటే అప్పుడు కలిగే సంతానానికి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని పెద్దలు తెలియజేశారు. ఇదే కాకుండా కొత్తగా వివాహమైన స్త్రీ తన తల్లిదండ్రులకు దూరంగా అత్తగారింట్లో ఉంటుంది. అలాంటి సమయంలో ఆ తల్లిదండ్రులకు కూతురు దూరంగా ఉందనే బెంగ కలిగే అవకాశం ఉంటుంది. ఇలా ఆషాఢమాసంలో నూతనంగా వివాహమైన స్త్రీలు తిరిగి పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రులతో ఉండి ఆరోగ్యం, తల్లిదండ్రుల ప్రేమ, ఆశీస్సులు పొందడానికి శక్తి ఆరాధన చేసుకోవడానికి ఇదొక మంచి అవకాశమని చిలకమర్తి తెలిపారు. అందువల్ల ఆషాఢ మాస నియమం నూతనంగా పెళ్లైన దంపతులే ఆచారించాలి తప్ప, మిగతావారికి పనికిరాదని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.