మొట్టమొదట మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజిస్తాము. వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని, సమస్యలు ఏమి ఉండవని అంతా నమ్ముతారు. ప్రాచీన కాలం నుంచి ఆది దంపతుల కుమారుడైనటు వంటి వినాయకుడిని మొట్టమొదట ఆర్దిస్తూ వున్నారు. వివాహం, గృహప్రవేశం వంటి వాటి నుంచి ఏ వ్రతం చేసుకున్నా వినాయకుడినే మొట్టమొదట కొలుస్తాము. వినాయకుడిని ప్రధాన దైవంగా కొలిచే ఆలయాలు మహిమాన్విత ఆలయాలుగా వెలసి నిలుస్తున్నాయి.
పిల్లలు కూడా భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు. వినాయకుడికి అనేక పేర్లు వున్నాయి. ఎన్నో ఆలయాలు వున్నాయి. అయితే వినాయకుడుని చింతామణి అని ఎందుకు అంటారు. "చింతామణి" అనే పేరు ఎందుకు వచ్చింది? ఆ పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
అభిజిత్ అనే మహారాజుకు ఘనుడు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతను చాలా దుష్టుడు, ప్రజల్ని ఎంతో బాధ పెట్టేవాడు. ఓ సారి వేటకు వెళ్ళాడు. అలా వెళ్తూ కపిలముని ఆశ్రమానికి చేరుకున్నాడు. కపిలముని అతిథి సత్కారాలు చేసి, భోజనం పెడతానని అంటాడు. “ఈ ముని ఆశ్రమంలో మాకు ఎలాంటి భోజనం లభిస్తుందా?” అని ఆలోచిస్తూ ఆకులు, కందమూలాలు వడ్డిస్తాడా అని అనుకున్నాడు.
కాసేపటికి కుటీరం దగ్గరకు వెండి పాత్రలు, ఆసనాలు, రకరకాల ఆహార పదార్థాలు వచ్చాయి. కపిలముని ప్రేమతో ఘనుడికి, అతని అనుచరులకు భోజనం పెట్టాడు. “ఎలా ఘనంగా ఈ ఏర్పాట్లు చేశావు?” అని కపిలమునిని అడిగాడు. కపిలముని — “ఇంద్రుని సహాయంతో నాకు చింతామణి వచ్చింది” అని చెప్తాడు. అయితే నాకు “అది కావాలి” అని ఘనుడు అడుగుతాడు.
కానీ ఇవ్వడానికి కపిలముని ఒప్పుకోలేదు. కానీ బలవంతంగా తీసుకు వెళ్ళిపోతాడు. జరిగిన దానికి బాధపడిన కపిలముని విష్ణువు సహాయాన్ని కోరాడు. శ్రీహరి ప్రత్యక్షమై “వినాయకుడిని ప్రార్థించు” అని సూచించాడు. కపిలముని ఘోర తపస్సు చేసి వినాయకుడిని ప్రసన్నం చేసుకున్నాడు.
వినాయకుడు ఘనుడి శిరస్సుని ఖండించి, చింతామణిని తీసుకొచ్చి కపిలమునికి అందజేశాడు. కపిలముని దానిని గణనాథుని మెడలో వేసి,“ఈ చింతామణి మీ దగ్గర ఉండనివ్వండి. అందరూ ఈరోజు నుంచి మిమ్మల్ని చింతామణి అని పిలుస్తారు అని అంటాడు. ఇలా వినాయకుడికి చింతామణి అనే పేరు వచ్చింది.