పూరిలో నిర్వహించే రథయాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారు. ఒరిస్సా లో ఉన్న పూరీలో జగన్నాథుని ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా ఆషాఢ మాసం శుక్లపక్షం రెండవ రోజు రథయాత్రను ఘనంగా జరుపుతారు. జగన్నాథుడితో పాటుగా సోదరుడు బలరాముడు, సోదరి సుభద్ర కలిసి రథాలపై పర్యటిస్తారు.
ఈ అద్భుతమైన రథయాత్రను వీక్షించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ రథయాత్రను చూసినట్లయితే 1000 యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఇదంతా పక్కన పెడితే, అసలు రథయాత్రను ఎందుకు జరుపుతారు? జగన్నాథుని రథయాత్ర వెనుక ఉన్న పురాణ కథలకు సంబంధించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం చూసినట్లయితే, సుభద్ర దేవి నగరాన్ని చూడాలని అనుకుంటుంది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రతో కలిసి రథంపై కూర్చుని పర్యటన మొదలు పెడతారు. జగన్నాథుని అత్త గుండిచా దేవి దగ్గరకు వెళ్తారు. ఏడు రోజులు అత్త దగ్గర విశ్రాంతి తీసుకోవడం జరుగుతుంది. కృష్ణుడు చేసిన ఆ యాత్రే జగన్నాథ రథయాత్ర అని అంటారు. ఇలా అప్పటి నుంచి ఇది ఆచారంగా మారిందని అంటారు.
రథయాత్ర వెనుక మరో కథనం కూడా ఉంది. అదేంటంటే, వేదవ్యాసుడు కృష్ణుడుని.. "నీ భక్తులకు దర్శనం ఇవ్వమని" ప్రార్థిస్తాడు. దీనికి సమాధానంగా జగన్నాథుడు రథయాత్రను నిర్వహిస్తాడు. రథయాత్ర అంటే జగన్నాథుడిని చూసి తన భక్తులు ఆనందించడానికి మార్గం అని అంటారు. ఆనాటి నుంచి ఇలా రథయాత్ర నిర్వహిస్తున్నారని కూడా చెబుతారు.
మరో పురాణం ప్రకారం చూసినట్లయితే, కృష్ణుని భార్యలు రాసలీల కథలను చెప్పమని బలరాముడు తల్లి రోహిణిని అడగగా.. అప్పుడు రోహిణి, కృష్ణుడితో "సుభద్ర ఈ కథలు వినకూడదు" అని అంటుంది. అందువల్ల కృష్ణుడు తన సోదరుడు బలరాముడు, సుభద్రను తీసుకుని రథయాత్రకు వెళ్లడం జరుగుతుంది. ఇలా రథం మీద వెళ్తున్నప్పుడు నారదుడు కనిపిస్తాడు.
వారు ముగ్గురు ఇలా ప్రయాణం చేయడం చూసి సంతోషపడతాడు. అప్పుడు భక్తులకు ప్రతి ఏటా ముగ్గురు ఇలా దర్శనం ఇవ్వాలని కృష్ణుడితో నారదుడు చెప్తాడు. ఈ అభ్యర్థనకు కృష్ణుడు ఒప్పుకుంటాడు. అందుకే అప్పటినుంచి రథయాత్ర నిర్వహిస్తున్నారని అంటారు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.