Bangles importance: మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారు? ఏ రంగు గాజులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా?
Bangles importance: మహిళకు అందాన్ని ఇచ్చే ఆభరణాలలో గాజులు ఒకటి. ఇవి లేకపోతే చేతులు బోసిగా కనిపిస్తాయి. జ్యోతిష్య శాస్త్ర పరంగా గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఏ రంగు గాజులు వేసుకుంటే అదృష్టం వరిస్తుందో తెలుసా? ఏ రోజు గాజులు కొనకూడదో మీకు తెలుసా?
ప్రతి స్త్రీకి అందాన్ని ఇచ్చేది కళ్ళకు కాటుక, ముక్కుకు ముక్కెర, చేతులకు గాజులు, కాళ్ళకు పట్టీలు, నుదుట బొట్టు, చెవులకు కమ్మలు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మొహం వెలితిగా అనిపిస్తుంది.
ముఖ్యంగా చేతులకు వేసుకునే గాజుల గలగల శబ్ధం వినడానికి కూడా చాలా మధురంగా ఉంటుంది. భారతీయ సంప్రదాయాన్ని అనుసరించే ప్రతి మహిళ గాజుల ధరిస్తుంది. బ్యాంగిల్స్ అనే పదం బాంగ్రీ అనే దాని నుంచి ఉద్భవించింది. అంటే చేతిని అందంగా మార్చే ఆభరణాలు అని అర్థం.
ఒకప్పుడు చేతికి గాజులు తప్పనిసరి. కానీ ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ గా మారిపోయింది. బంగారం, ఇత్తడి, రాగి, ప్లాస్టిక్, మట్టి మొదలైన వాటితో గాజులు తయారు చేస్తారు. భారతీయ మహిళలు ప్రత్యేక సందర్భాలలో, కార్యక్రమాలలో వీటిని ధరిస్తారు. ఇవి వైవాహిక జీవితానికి ప్రతీకగా చెబుతారు. గాజులు ధరించిన స్త్రీ తన వైవాహిక జీవితంలో అదృష్టాన్ని తీసుకొస్తుంది. గాజులు లేకుండా ఉత్తి చేతులతో ఉంటే ప్రతికూల శక్తులు ఎక్కువగా గ్రహిస్తాయి. అలాగే వితంతువులు, దురదృష్టాన్ని కూడా సూచిస్తుంది. అందుకే మహిళలు తప్పనిసరిగా గాజులు ధరించాలని చెబుతారు.
ఏ రాశి వాళ్ళు ఏ రంగు వేసుకోవాలి?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గాజులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏ రంగువి ధరిస్తే ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చెబుతుంది. మేష రాశి వారు ఎరుపు రంగు గాజులు ధరిస్తే వారి ప్రియమైన వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే వృషభ రాశి వాళ్లు బ్రౌన్ కలర్ గాజులు ధరించాలి. ఇవి మిమ్మల్ని విజయపథంలోకి తీసుకెళ్తాయి. గులాబీ రంగు గాజులను మిథున రాశి వారు ధరించవచ్చు. ఇవి జీవితానికి అదృష్టాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారు పసుపు రంగు గాజులు ధరించవచ్చు. ఆనందం, అదృష్టాన్ని ఇస్తాయి. పురాతన కాలంలో మహిళలు కంకణాలు ధరించేవారు. ఇప్పుడు కంకణాలు సందర్భానుసారం మాత్రమే ధరిస్తున్నారు. ఎక్కువగా వాటి స్థానంలో గాజులు ధరిస్తున్నారు.
గాజులు ధరించడం వల్ల వైవాహిక జీవితంలో దంపతుల మధ్య బంధం బలపడుతుంది. అది మాత్రమే కాదు జాతకంలో ఏవైనా గ్రహాలు ప్రతికూల ప్రభావాలు కలిగి ఉన్నప్పుడు గాజులు వేసుకోవడం వల్ల వాటి ప్రభావం తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
గాజులు వేసుకోవడం వల్ల ప్రయోజనాలు
గాజులు బుధ, చంద్రగ్రహాలకు ప్రతీకగా చెబుతారు. అందుకే వాటిని సరిగ్గా ఉపయోగించుకున్నప్పుడు విజయం, ప్రేమ దక్కుతుంది. వివాహిత స్త్రీలు ఎరుపు రంగు గాజులు ధరించడం ఉత్తమం. గాజుల కొనుగోలు చేసేందుకు కూడా సరైన రోజు ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు గాజులు కొనుగోలు చేయడం శ్రేయస్కరం కాదు. మంగళ, శనివారాల్లో గాజులు కొనకూడదు. అలాగే పొరపాటున కూడా నలుపు రంగు గాజులు ధరించకూడదు. కానీ ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ పేరిట చాలామంది నలుపు రంగు గాజులు కూడా ధరిస్తున్నారు. అది సరైనది కాదని పండితులు చెబుతారు.
గాజులు ధరించడం పట్ల జ్యోతిష్య పరంగానే కాదు శాస్త్రీయ పరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ధరించడం వల్ల మణికట్టు దగ్గర రాపిడి ఏర్పడి రక్తప్రసరణ బాగా జరిగేలాగా సహాయపడుతుంది. అలాగే అధిక రక్తపోటు ప్రమాదాలను నివారిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అదే కంకణాలు ధరిస్తే ఒత్తిడి నిరాశ నుంచి ఉపశమనం కలుగుతుంది.
శ్రీమంతం చేసేటప్పుడు అందుకే గర్భిణీలకు చేతి నిండుగా గాజులు తొడుగుతారు. దీని వెనుక మంచి ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఈ గాజుల మంచి వెలువడే శబ్దం శిశువు మెదడుని అభివృద్ధి చేస్తుందని అంటారు. అందుకే గర్భిణీకి శ్రీమంతం చేసేటప్పుడు చేతులకు నిండుగా గాజులు వేస్తారు. ప్రసవం అయ్యే వరకు నిండుగా గాజులు ఉంచుకోమని తొలగించకూడదని పెద్దలు చెబుతారు.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.
టాపిక్