శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు? అభిషేకం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి?
శివుడిని అభిషేక ప్రియుడు అని ఎందుకు అంటారు. శివపూజలో జలాభిషేకానికి ఎందుకంత ప్రాధాన్యత. లింగానికి అభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం రండి.
శివుడిని సంతోషపెట్టడానికి కఠోర తప్పస్సు చేయాల్సిన అవసరం లేదు, కఠిన ఉపవాసాలు అక్కర్లేదు, భక్తితో బిల్వపత్రాలను సమర్పించి, శ్రద్ధతో జలాభిషేకం చేస్తే చాలని, శివుడు సంతోషపడి వరాలు కురిపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు.శివుడి అభిషేకానికి పాలు, తేనే, పంచామృతాలే కాదు పవిత్ర జలం కూడా అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అభిషేకం అనేది హృదయాన్ని, ఆత్మను శుద్దచేసి పవిత్రంగా మారుస్తుంది. పాపాలు తొలగిపోతాయి. కుటుంబంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. ప్రకృతి వైపరిత్యాల నుంచి రక్షించే శక్తి శివుడికి చేసే అభిషేకానికి ఉందని భక్తుల నమ్మిక.
శివుడికి జలాభిషేకం ఎందుకు చేస్తారు?
క్షీరసాగర మథనం సమయంలో ఒకానొక సందర్భంలో హాలాహలం ఉద్భవించింది. ఈ విషాన్ని అలాగే వదిలేస్తే అది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఆ సమయంలో శివుడి విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటారు. ఫలితంగా శివుడి కంఠం నీలిరంగులోకి మారుతుంది. అందుకే శివుడిని నీలకంఠుడు అని పిలుస్తారు. అయితే విష ప్రభావాన్ని తగ్గించేందుకు, దేవతందరూ కలిసి ఆ సమయంలో శివుడిని నీటితో అభిషేకం చేస్తారు. అప్పటినుంచి శివుడి పూజలో అభిషానికి ప్రాముఖ్యత ఏర్పడింది. శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు శివలింగానికి పవిత్ర జలంతో అభిషేకం చేస్తే చాలా పురాణాలు చెబుతున్నాయి.
జలాభిషేక నియమాలేంటి?
శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు దక్షిణం లేదా తూర్పు ముఖంగా నిలబడాలి. ఉత్తరం వైపు ముఖాన్ని పెట్టి శివ లింగానికి ఎడమవైపు నిలబడి నీటిని సమర్పించాలి. శివుడికి ఎడమవైపున పార్వతీ దేవి ఉంటుంది. ఇలా నిలబడి లింగానికి జలాభిషేకం చేయడం వల్ల శివపార్వతులు ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు.
లింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఎప్పుడూ నిలబడకూడదు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. కూర్చుని శివుడికి అభిషేకం చేయడం శుభప్రదం.
జలాభిషేక సమయంలో ఉక్కు లేదా ఇనుప పాత్రలో నీటిని తీసుకోకూడదు. ఇది శుభప్రదం కాదు. రాగి, కంచు లేదా వెండి పాత్రల్లో మాత్రమే నీటిని తీసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి. పాలాభిషేకానికి మాత్రం రాగి చెంబును ఉపయోగించకూడదు.
శివుడికి నీటితో అభిషేకం చేసేటప్పుడు నీటి ధార ఎప్పుడూ విరిగిపోకూడదు. సన్నటి ధార అయినా సరే ఆగకుండా ప్రవహిస్తూనే ఉండాలి.
శివుడికి జలాభిషేకం చేసేటప్పుడు శంఖాన్ని ఎప్పుడూ ఉపయోగించకూడదు. పురాణాల ప్రకారం శివ పూజలో శంఖం నిషేదించబడింది. శివుడు శంఖచూడ్ అనే రాక్షసుడిని సంహరించాడు, ఆ రాక్షసుడి ఎముకలు శంఖంలో భాగం కనుక శివపూజలో శంఖానికి స్థానం లేదు.
శివలింగానికి నీటిని సమర్పించేటప్పుడు సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఉదయం 5గంటల నుంచి 11గంటల మధ్య లింగానికి జలాభిషేకం చేయడం ఫలప్రదంగా భావిస్తారు. సాయంత్రం పూట లింగానికి నీటిని సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని విశ్వాసం.
శివుడికి జలాభిషేకం చేస్తున్నప్పుడు నీరు చాలా పవిత్రమైనదిగా ఉండాలి. నీటిలో ఎలాంటి పదార్థాలను కలపకూడదు.
శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శివమంత్రాన్ని జపిస్తూ నెమ్మదిగా నీటిని సమర్పించాలి.
శివుడికి నీటిని సమర్పించేటప్పుడు మొదటగా గణేషుడి స్థానమైన కుడి వైపు నీటిని వదలాలి, తర్వాత కార్తికేయుడి స్థానమైన ఎడమ వైపు నీటిని సమర్పించాలి. ఆ తర్వాత శివ కుమార్తె అయిన అశోక సుందరి ఉండే మధ్య స్థానంలో నీరు సమర్పించాలి. తదుపరి వృత్తాకార భాగానికి అభిషేకం చేయాలి. ఇది పార్వతీదేవి స్థానం. చివరగా శివలింగానికి అభిషేకం చేయాలి. శివమంత్రాన్ని జపిస్తూ ఈ నియమాలను పాటిస్తే శివలింగానికి జలాభిషేకం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి శివపార్వతుల అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్మిక.