రథసప్తమి నాడు జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుంది- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లలోనూ, పారే నీటిలోనూ ఉంటుంది.

రథసప్తమి నాడు అరుణోదయ కాలంలో జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే గొప్ప ఫలితాన్నిస్తుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. సూర్యుని కిరణాలు నేలపై పుష్కలంగా పడతాయి. ఆ సౌరశక్తి ప్రధానంగా జిల్లేడు, చిక్కుడు, రేగు చెట్లలోనూ, పారే నీటిలోనూ ఉంటుంది. అందుకే రథసప్తమి నాడు చేసే స్నానం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. వ్రత చూడామణిలో రథసప్తమి నాడు చేయాల్సిన స్నాన వ్రతాన్ని గురించి వివరణ విశ్లేషణాత్మకంగా ఉంది.
ఆనాడు అరుణోదయ వేళకంటే ముందుగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదీతీరానికి గాని, చెరువుల వద్దకు గానీ వెళ్లి సంకల్పం చెప్పుకొని తీరంలోని మట్టిని ఒంటికి రాసుకుని జిల్లేడు ఆకులు తలపై, ఒంటిపై ఉంచుకొని "జననీ సర్వలోకానాం సప్తమీ సప్తసప్తికె' సప్తవ్యాహృతికే దేవా నమస్తే సూర్యమండలే" అంటూ సూర్యమండలాన్ని అర్చించి నమస్కరించాలి. అనంతరం చిక్కుడు, రేగు, గరిక, అక్షతలు, చందనం, పూలు కలిపిన జలంతో అర్ఘ్యమివ్వాలి.
అర్ఘ్యమివ్వడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, తేజస్సు వృద్ధి చెందుతాయి. చర్మరోగాలు నశిస్తాయి. ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. కేశవ స్వరూపుడైన ఆదిత్యుని దర్శిస్తే పాపరహితుడవుతాడని చెప్పబడింది. సూర్యుని రథం ఒకే చక్రం కలది. 'సప్త' అనే పేరుగల అశ్వం ఆర్ణథాన్ని లాగుతుంది.
సూర్యుని రశ్ములు అనగా కిరణాలు అశ్వరూపాలు. ఆదిత్యుని నుంచి ఉత్పన్నమైన ఏడు కిరణాలలో ఏదో కిరణము 'సప్త' అనే నామంతో లోకాన్నిఉద్దీపింపచేస్తోంది. మిగిలిన ఆరు కిరణాలు ఆరు ఋతువు లుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వేదం చెబుతుంది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
రథసప్తమికి జయంతి అని కూడా మరో పేరుంది. రథసప్తమి ఆదివారం నాడు సంభవిస్తే అది ఎంతో గొప్పయోగం. నీటి నుంచే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాడట సృష్టికర్త. అందుకే ప్రాణులన్నింటికీ నీరు తల్లిలాంటిదని చెబుతున్నాయి పురాణాలు. ఆ నీరే గలగలా పారే నదులుగా దర్శనమిస్తోంది. నదుల వల్లనే నాగరికతలు ఏర్పడ్డాయి. మనిషి మనుగడకు, సంస్కృతి సాంప్రదాయాలకు, వైభవానికి నదులు సాక్షిభూతంగా నిలిచాయి.
వేదభూమిగా పిలిచే ఈదేశంలో ప్రవహించే నదులు తీర్థము అనే పేరుతో దైవస్వరూపాలుగా వర్ణించబడి, గంగా గోదావరి నర్మదా కావేరి మొదలైన పేర్లతో గౌరవింపబడు తున్నాయి. అలాంటి తీర్థాలెన్నో ఈ భూమిపై ప్రవహిస్తూ ఈ భూమిని దివ్యభూమిగా మారుస్తున్నాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
తీర్థం అంటే పుణ్యమైన, లేదా పవిత్రమైన నీరు అని అర్థం. అటువంటి తీర్థాలని సేవించి వాటిలో స్నానం చేస్తే పాపాలు తొలగి అంతఃకరణ శుద్ధి కూడా కలుగుతుంది. తీర్థాలన్నింటిలోకీ ప్రధానమైనది గంగానది. గంగానదిని తలిచినా చాలు సకల పాపాలు తొలగుతాయని మనకి పురాణాలు చెబుతున్నాయి. నదీజలాల్లో అమృతత్వం ఉందని అవి రోగాలను నివారించి దీర్ఘాయుష్షును కలిగిస్తాయని యజుర్వేదంలో చెప్పబడింది అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
సంబంధిత కథనం