Camphor: పూజలో కర్పూరం ఎందుకు ఉపయోగిస్తారు? దీని వల్ల ప్రయోజనాలు ఏంటి?
Camphor: కర్పూరం లేకుండా పూజ, యాగం, యజ్ఞం వంటి ఎటువంటి దైవిక కార్యక్రమాలు పూర్తి కావు. అంత ప్రాముఖ్యత కలిగిన కర్పూరం అసలు ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?
Camphor: మతపరమైన ఎటువంటి కార్యక్రమం, పూజ పూర్తయిన తర్వాత తప్పని సరిగా కర్పూరం వేసి హారతి ఇస్తాడు. కర్పూరం లేకుండా పూజ పూర్తి కాదు. దేవుడికి హారతి ఇవ్వడం కోసం కర్పూరం వినియోగిస్తారనే చాలా మందికి తెలుసు. కానీ కర్పూరం ఉపయోగించడం వెనుక ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.
కర్పూరం అనేది కృత్రిమగా తయారు చేస్తారని అనుకుంటారు. కానీ ఇది చెట్టు నుంచి వస్తుంది. అద్భుతమైన వాసన కలిగి ఉంటుంది. సుగంధ వాసనతో కూడిన స్పటికాకార పదార్థం. సిన్నమోమం కర్పూరం అనే చెట్టు చెక్క నుంచి దాని ఆకులు, పాలు వంటి పదార్థాలతో కర్పూరం తయారు చేస్తారు. కర్పూరం తరచుగా ఔషధ, మతపరమైన, సుగంధ వాసన కోసం వినియోగిస్తారు.
కర్పూరం ప్రాముఖ్యత
పూజ పూర్తయిన తర్వాత హారతి ఇవ్వడానికి కర్పూరం ఉపయోగిస్తారు. దీన్ని కాల్చినప్పుడు అద్భుతమైన వాసన వస్తుంది. చెడు విషయాలు వదిలించుకుని మంచి ఆలోచనలు తీసుకురావడానికి ప్రతీకగా దీన్ని వాడతారు. తీపి వాసనతో కూడిన పొగ పూజని స్వచ్చంగా చేస్తుంది. అందుకే పూజకి ప్రత్యేకమైన దైవ స్పర్శ కలిగించేందుకు చివర్లో హారతి ఇస్తారు. ప్రతికూల శక్తులని తొలగించడాన్ని సూచిస్తుంది. కర్పూర జ్వాల శివుని ధర్మబద్ధమైన, శాశ్వతమైన జ్వాలని సూచిస్తుంది. అహంకారాన్ని వదిలి ఇతరుల జీవితాల్లో వెలుగు ఎలా వ్యాప్తి చేస్తామో ఇది సూచిస్తుంది. తెల్లని కర్పూరానికి శివుడు నిదర్శనమని చెప్తారు.
కర్పూరంతో పరిహారాలు
శ్రేయస్సుని పెంపొందించుకోవడం కోసం కర్పూరంతో కొన్ని పరిహారాలు చేస్తే మంచిది. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం కోసం రాత్రిపూట కర్పూరం, లవంగాలని వెండి గిన్నెలో వేసి కాల్చాలి. అలాగే గులాబీ పువ్వులో కర్పూరాన్ని కాల్చి 43 రోజుల పాటు దుర్గాదేవికి సమర్పించాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల ఆర్థిక విషయాలలో సానుకూల మార్పులు కనిపిస్తాయి.
కర్పూరం సంపద కోసం మాత్రమే కాదు ఇది ప్రతికూల శక్తుల్ని ప్రక్షాళన చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇంటికి సంబంధించి ఏవైనా వివాదాలు, ప్రతికూల శక్తులతో ఇబ్బందిగా అనిపిస్తే ఉదయం, సాయంత్రం కర్పూర ధూపం వేయాలి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి సామరస్య వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయోజనాలు కోసం మాత్రమే కాకుండా కర్పూరం వాస్తు దోషాలని కూడా పోగొడుతుంది.
కర్పూరంతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు కర్పూరం ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.. చర్మ వ్యాధులని నయం చేస్తుంది. నొప్పి, దురద తగ్గించేందుకు నివారణగా పని చేస్తుంది. దగ్గు, జలుబు వంటి వైరల్ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి మెడ లేదా ఛాతీకి కర్పూరం రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. దీని బలమైన సువాసన పీల్చడం వల్ల నరాలని శాంతపరుస్తుంది. శ్వాసకోశ సమస్యల్ని నయం చేస్తుంది.
కర్పూరం నుంచి వచ్చే పొగ పీల్చడం వల్ల ఆందోళన తగ్గిపోతుంది. మనసు ప్రశాంతంగా ఉండేందుకు సహకరిస్తుంది. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది.